మహానాడులో చినరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ ఆంధ్రావర్సిటీలో శనివారం ప్రారంభమైన టీడీపీ మహానాడులో డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆసక్తికర ప్రసంగం చేశారు.
విశాఖ: విశాఖ ఆంధ్రావర్సిటీలో శనివారం ప్రారంభమైన టీడీపీ మహానాడులో డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆసక్తికర ప్రసంగం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు - పార్టీ నిర్మాణంపై తీర్మానం ప్రవేశపెట్టిన చినరాజప్ప ఈ సందర్భంగా మాట్లాడారు. నేతలు ఎన్నికల ముందు కార్యకర్తలతో ఎలా ఉంటారో....ఎమ్మెల్యే అయ్యాక అలాగే ఉండాలని సూచించారు. కొందరు ఎమ్మెల్యేలు కాగానే అందుబాటులో ఉండడం లేదని తెలిపారు.
కొందరు నేతలు తాము చేసేది అధినేతకు తెలీదు అనుకుంటున్నారు, కానీ అధినేతకు అన్నీ తెలుసు...అందరి పనితీరు తెలుసునని వ్యాఖ్యానించారు. పనిచేయని, గాడి తప్పిన నేతలను ఎన్నికల నాటికి సీఎం కట్ చేస్తారని హెచ్చరించారు. టీడీపీలో కార్యకర్తలకు గౌరవం ఉంటుంది.. అందుకు తానే ఒక ఉదాహరణ అని వివరించారు. పార్టీ పదవులు వచ్చాక ఇంకా పెద్ద పదవి కావాలంటూ కొందరు వ్యవహరిస్తున్నారని అన్నారు. అయితే, పదవులు కాదు... పార్టీ ముఖ్యమనే ఆలోచన అంతా చేయాలని కోరారు.
నామినేటెడ్ పదవులెన్నీ ఇచ్చినా ఇంకా కావాలనే రీతిలో కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పదవులు రాని వారిని కొందరు రెచ్చగొడుతున్నారు.. ఇది కరెక్ట్ కాదని హితవు పలికారు. టిక్కెట్ ఎవరికిచ్చినా వారిని గెలిపించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని అన్నారు. అన్నీ ఆలోచించే చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు. మనం ఇంకా పని చేయడం లేదనే భావన ప్రజల్లోనూ.. కార్యకర్తల్లోనూ ఉంది.. దీని తొలగించాలని కోరారు.