టీడీపీ నేతలకు అనుగుణంగా ఉద్యోగుల బదిలీలు: దేవినేని
మచిలీపట్నం : టీడీపీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగుల బదిలీలు చేసుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చారని, దీనిని వినియోగించుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం మచిలీపట్నంలోని రామరాజు కన్వెన్షన్ సెంటరులో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుత కన్వీనరు బచ్చుల అర్జునుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంత్రి దేవినేని ప్రకటించారు.
పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోట వీరబాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్షను అన్ని నియోజకవర్గాల్లో చేపట్టనున్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలకు జూన్ 3 నుంచి ఏడో తేదీ వరకు రుణమాఫీ చెక్కులు అందజేయనున్నట్లు చెప్పారు. ఒక్కొక్క డ్వాక్రా మహిళకు రూ.10 వేలు చొప్పున రుణమాఫీ చేస్తామని, మొదటి విడతగా రూ.3 వేలను చెక్కు రూపంలో అందజేస్తామని తెలిపారు.