తిరుమలలో భక్తుల రద్దీ: లైన్లలో తోపులాట
తిరుమల/హైదరాబాద్: రేపు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి), నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు నుంచే తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కాలిబాట ద్వారా ఇప్పటికే 30వేల మందికిపైగా భక్తులు ఇక్కడకు చేరుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో లైన్ల వద్ద భక్తుల తోపులాట ఎక్కువగా ఉంది. లైన్లు తెలియక భక్తులు ఇబ్బందిపడుతున్నారు. వృద్ధులు, పిల్లలు అవస్తలు పడుతున్నారు. భక్తులను అదుపు చేయలేక సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. పలువురు రాజకీయ నాయకులు, సినీనటులు తిరుమల చేరుకున్నారు. సినీ నటుడు బ్రహ్మానందం, ఎంపి సుజనా చౌదరి తిరుపతి చేరుకున్నారు.
కట్టుదిట్టమైన భద్రత మధ్య టీటీడీ అధికారులే భక్తులను లైన్ల వద్దకు తీసుకువెళుతున్నారు. రేపు వైకుంఠం కాంప్లెక్స్తోపాటు మూడు కిలోమీటర్ల వరకు భక్తులు బారులు తీరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో వీఐపీ పాస్లను కుదించే యోచనలో టీటీడీ అధికారులు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత గురువారం తొలి ఘడియల్లో వైకుంఠ ద్వారం (ఉత్తరద్వారం) ప్రవేశానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేకువజామున తిరుప్పావై పఠనం తర్వాత 1.45 గంటల నుంచి వీఐపీలకు దర్శనం కల్పిస్తారు. వేకువజామున 4 గంటల లోపు వారి దర్శనం పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే సర్వదర్శనం ప్రారంభిస్తారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గంటకు ఐదువేల మందికి తగ్గకుండా వైకుంఠద్వార ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. ఆలయం ముందున్న వాహన మండపంలోనే శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను దర్శించే అవకాశం కల్పించారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో ఆలయవీధుల్లో స్వర్ణరథాన్ని ఊరేగిస్తారు. ఈ రోజు, రేపు తిరుమల, తిరుపతి మధ్య అర్ధరాత్రి కూడా 2 ఘాట్‌రోడ్లూ తెరచి ఉంచాలని నిర్ణయించారు. సామాన్య భక్తులకు 5500 గదులు, వీఐపీ భక్తులకు 600 గదులు అందుబాటులో ఉంచారు.
ఇదిలా ఉండగా, భక్తులకు కల్పించే సౌకర్యాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని టీటీడీ అధికారులను సీఎం ఆదేశించారు.