సిబ్బంది నుంచి వివరాలను సేకరిస్తున్న స్క్వాడ్ డీఎఫ్‌ఓ సూర్యనారాయణ పడాల్
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : ఎట్టకేలకు గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖలో జరిగిన బదిలీలు, పదోన్నతుల అక్రమాలపై డొంక కదిలింది. జిల్లాలో 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన అటవీ శాఖ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంపై స్థానిక డీఎఫ్‌ఓ సీహెచ్ శాంతి స్వరూప్‌పై తీవ్రమైన ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందాయి. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ సీహెచ్ సూర్యనారాయణ పడాల్ బృందం మంగళవారం స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో విచారణ చేపట్టింది. దీనిపై కార్యాలయ ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో చర్చ చోటుచేసుకుంది.
కొద్ది రోజుల కిందటే డీఎఫ్‌ఓ సీహెచ్ శాంతి స్వరూప్‌కు గుంటూరులోని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయానికి రిపోర్టు చేయాలంటూ బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఈయన స్థానంలో విజయనగరం జిల్లా డీఎఫ్‌ఓ జి.లక్ష్మణ్‌కు అదనపు బాధ్యతలను అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ప్రస్తుతానికి శాంతి స్వరూపే డీఎఫ్‌ఓగా విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు జిల్లా కేంద్రంలో ఆయనపైనే విచారణ చేపట్టడం ఆసక్తికరంగా మారింది.
చేయి తడపాల్సిందే..
జిల్లాలో అటవీ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, సీనియార్టీ ప్రకారం పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో (2016 నుంచి 2019 బదిలీల వరకు) అటవీ శాఖలో లక్షలాది రూపాయల నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్న క్రమంలో కార్యాలయంలో కూడా ఉద్యోగుల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు డీఎఫ్‌ఓ శాంతి స్వరూప్‌పై వినిపించాయి. ఆయన హయాంలో మొత్తం 21 మందికి బదిలీలు, పదోన్నతులు జరిగాయని, వీరిలో ఒకరు మృతి చెందగా, మిగిలిన వారిలో అధికంగా లంచాల బాధితులే అని విశ్వసనీయ సమాచారం.
అయితే ఈ మేరకు గత ఐదేళ్ల కాలం టీడీపీ నేతల అండదండలతో శాంతి స్వరూప్ ఆగడాలను ప్రశ్నించలేకపోయామని, కొత్త ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని పలువురు బాధిత ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఈయన అక్రమాలపై ఫిర్యాదు చేశారు. బదిలీ స్థానానికి ఒక్కో రేటు పెట్టారని, అలాగే పదోన్నతి ఇస్తే కూడా ఒక్కో రేటు చొప్పున వసూళ్లు చేసారంటూ బాధితులు సుమారు 19 మంది ఉన్నతాధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఫిర్యాదుల ఆధారంగా మంగళవారం ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ సీహెచ్ సూర్యనారాయణ పడాల్ స్థానిక కార్యాలయంలో సుమారు ఐదు గంటల సమయం సిబ్బందితో విచారణ చేపట్టారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, అక్రమాలపై సంబంధిత అధికారులపై చర్యలు తప్పవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మంగళవారం అటవీ శాఖ కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు. వెళ్తున్నారు.? స్క్వాడ్ అధికారిని ఎవరు కలుస్తున్నారన్న విషయాలపై ఎప్పటికప్పుడు తన అనుచరులతో శాంతి స్వరూప్ మినిట్ టు మినిట్ అప్‌డేట్‌ను తెలుసుకుంటున్నారంటూ చర్చలు జోరందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment