TRANSFFERS
-
బది'లీలలు' ఏమిటో..?
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : ఎట్టకేలకు గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖలో జరిగిన బదిలీలు, పదోన్నతుల అక్రమాలపై డొంక కదిలింది. జిల్లాలో 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన అటవీ శాఖ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంపై స్థానిక డీఎఫ్ఓ సీహెచ్ శాంతి స్వరూప్‌పై తీవ్రమైన ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందాయి. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ సీహెచ్ సూర్యనారాయణ పడాల్ బృందం మంగళవారం స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో విచారణ చేపట్టింది. దీనిపై కార్యాలయ ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో చర్చ చోటుచేసుకుంది. కొద్ది రోజుల కిందటే డీఎఫ్ఓ సీహెచ్ శాంతి స్వరూప్‌కు గుంటూరులోని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయానికి రిపోర్టు చేయాలంటూ బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఈయన స్థానంలో విజయనగరం జిల్లా డీఎఫ్ఓ జి.లక్ష్మణ్‌కు అదనపు బాధ్యతలను అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ప్రస్తుతానికి శాంతి స్వరూపే డీఎఫ్ఓగా విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు జిల్లా కేంద్రంలో ఆయనపైనే విచారణ చేపట్టడం ఆసక్తికరంగా మారింది. చేయి తడపాల్సిందే.. జిల్లాలో అటవీ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, సీనియార్టీ ప్రకారం పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో (2016 నుంచి 2019 బదిలీల వరకు) అటవీ శాఖలో లక్షలాది రూపాయల నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్న క్రమంలో కార్యాలయంలో కూడా ఉద్యోగుల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు డీఎఫ్ఓ శాంతి స్వరూప్‌పై వినిపించాయి. ఆయన హయాంలో మొత్తం 21 మందికి బదిలీలు, పదోన్నతులు జరిగాయని, వీరిలో ఒకరు మృతి చెందగా, మిగిలిన వారిలో అధికంగా లంచాల బాధితులే అని విశ్వసనీయ సమాచారం. అయితే ఈ మేరకు గత ఐదేళ్ల కాలం టీడీపీ నేతల అండదండలతో శాంతి స్వరూప్ ఆగడాలను ప్రశ్నించలేకపోయామని, కొత్త ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని పలువురు బాధిత ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఈయన అక్రమాలపై ఫిర్యాదు చేశారు. బదిలీ స్థానానికి ఒక్కో రేటు పెట్టారని, అలాగే పదోన్నతి ఇస్తే కూడా ఒక్కో రేటు చొప్పున వసూళ్లు చేసారంటూ బాధితులు సుమారు 19 మంది ఉన్నతాధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిర్యాదుల ఆధారంగా మంగళవారం ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ సీహెచ్ సూర్యనారాయణ పడాల్ స్థానిక కార్యాలయంలో సుమారు ఐదు గంటల సమయం సిబ్బందితో విచారణ చేపట్టారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, అక్రమాలపై సంబంధిత అధికారులపై చర్యలు తప్పవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మంగళవారం అటవీ శాఖ కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు. వెళ్తున్నారు.? స్క్వాడ్ అధికారిని ఎవరు కలుస్తున్నారన్న విషయాలపై ఎప్పటికప్పుడు తన అనుచరులతో శాంతి స్వరూప్ మినిట్ టు మినిట్ అప్డేట్ను తెలుసుకుంటున్నారంటూ చర్చలు జోరందుకున్నాయి. -
దేశ వ్యాప్తంగా సెన్సార్ అధికారుల బదిలీ
దేశ వ్యాప్తంగా ఏడుగురు సెన్సార్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటనను వెల్లడించింది. ఇటీవల సెన్సార్ విషయంలో పలు ఆరోపణలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దర్శక నిర్మాతలు సెన్సార్ బోర్డు సభ్యులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓకేసారి దేశ వ్యాప్తంగా ఏడుగురు సెన్సార్ అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. చెన్నై సెన్సార్‌బోర్డు అధికారిగా ఉన్న అన్భుళగన్ స్థానంలో షీలా మీనాక్షిని నియమించారు. ఇంతకు ముందు ఈమె ఢిల్లీ దూరదర్శన్‌లో పని చేశారు. ఇదే విధంగా కోల్‌కతా సెన్సార్ అధికారిగా సామ్రాట్‌బందోపాధ్యాయ, బెంగళూర్ సెన్సార్ అధికారిగా గురుప్రసాద్, ముంబై అధికారిగా రాయ్ పూర్‌కు చెందిన కర్మార్కర్ తుషార్ అరుణ్, తిరువనంతపురం అధికారిగా గౌహతికి చెందిన ఎల్.పార్వతి, కటక్‌కు ఢిల్లీకి చెందిన శుభశ్రీ మహాపత్రా, హైదరాబాద్‌కు చెందిన రకుల్ గౌలికర్ హైదరాబాద్ సెన్సార్ అధికారిగా నియమితులయ్యారు. -
వెలుగుల శాఖలో బదిలీల పర్వం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఆ సంస్థలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 20 శాతం మందిని మాత్రమే బదిలీ చేయాలని మార్గదర్శకాలు అందాయి. బదిలీకి అర్హులైన వారి జాబితాను ఈపీడీసీఎల్ ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డి సిద్ధం చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలను బదిలీల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో రెండేళ్ల పదవీ కాలం పూర్తిచేసిన వారిని పట్టణ ప్రాంతాలకు బదిలీ చేస్తారు. అర్హుల జాబితా విడుదల క్షేత్రస్థాయి ఉద్యోగుల నుంచి ఇంజినీరింగ్ అధికారుల వరకు మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు, 3నుంచి ఐదేళ్లుగా ఒకేచోట పని చేస్తున్న వారు, ఐదేళ్లుగా ఒకేచోట ఉన్న వారి జాబితాలను వేర్వేరుగా రూపొందించారు. గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఏరియాల వారీగా వివిధ స్థాయిల్లో జాబితాలను సిద్ధం చేశారు. ఈ జాబితాలపై రెండు రోజులపాటు అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలించిన తరువాత అర్హుల జాబితా విడుదల చేస్తారు. తరువాత ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో సంబంధిత ఉద్యోగులు తమకు కావాలి్సన ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పిస్తారు. వెబ్ ఆప్షన్లకు వచ్చేనెల 4వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అనంతరం బదిలీ ఉత్తర్వులు ఇస్తారు. బదిలీ పొందిన వారంతా వచ్చేనెల 22వ తేదీలోగా పాత స్థానాలను వదిలి కొత్త స్థానాల్లో చేరాల్సి ఉంటుంది. ఇదిలావుంటే ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకుల బదిలీలపై సస్పెన్స్ వీడలేదు. కీలకంగా పనిచేస్తున్న మూడు గుర్తింపు సంఘాల వారికి మాత్రమే బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాల కోసం వివిధ సంఘాల నేతలు ఎదురుచూస్తున్నారు. ఉద్యోగుల వారీగా.. సాధారణ బదిలీల్లో ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఎస్ఈ వివిధ స్థాయి ఉద్యోగులను బదిలీ చేస్తారు. అకౌంట్స్ విభాగంలో జూనియర్ అకౌంట్స్ అధికారి, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్లను బదిలీ చేస్తారు. ఇంజినీరింగ్ విభాగంలో సబ్ ఇంజినీర్లను, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ విభాగంలో ఫోర్‌మెన్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేయవచ్చు. కాగా బదిలీ మార్గదర్శకాల మేరకు తయారు చేసిన జాబితాలో 8 మంది జేఏఓలు, 31 మంది సీనియర్ అసిస్టెంట్లు, 38 మంది జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు టైపిస్టులు, 18 మంది సబ్ ఇంజినీర్లు, ముగ్గురు ఫోర్మెన్లు ఉన్నారు. వీరిలో సీనియార్టీ ప్రకారం వారు కోరుకున్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు.