భవానీపురంలో ఉన్నట్లు నిర్ధారణ
అనారోగ్యంతో ఉండటంతో నేడు విచారించే అవకాశం
విజయవాడ : కడుపునొప్పి అని చెప్పి ప్రభుత్వాస్పత్రికి వచ్చి గుట్టు చప్పుడు కాకుండా ప్రసవించి శిశువును కమోడ్‌లో కుక్కిన మహిళ ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఈ విషయమై ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ మాచవరం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా, వారు 108లో ఎక్కిన సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఆ మహిళ భవానీపురంలోని తమ ఇంట్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు పోలీసులు చెపుతున్నారు. గర్భిణిగా ఉండి పురిటినొప్పులు వస్తుంటే కడుపు నొప్పి అని చెప్పటం.. గుట్టుచప్పుడు కాకుండా టాయిలెట్స్‌లో ప్రసవించటం.. తర్వాత శిశువును కమోడ్‌లో కుక్కడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక 108కి వారు ఫోన్ చేసిన నంబరుకు ఆస్పత్రి అధికారులు చేయగా, తొలుత ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి తాను గ ర్భిణి సోదరుడినని, అసలు ఆమె గర్భిణి అన్న సంగతే తెలియదని చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో శుక్రవారం పోలీసులు పూర్తి వివరాలు సేకరించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
శిశువుకు 32 వారాలు!
మృత శిశువు వయస్సు సుమారు 32 నుంచి 34 వారాలు ఉండవచ్చని వైద్యులు అంచనాకు వచ్చారు. అంటే గర్భిణి ఎనిమిది నెలలు నిండి తొమ్మిదో నెలలో ప్రవేశించిందని, అంటే ప్రసవించే సమయమేనని నిపుణులు చెపుతున్నారు. పురిటి నొప్పులు వస్తుంటే, మరి కడుపు నొప్పి అని ఎందుకు చెప్పారో అర్థం కాని పరిస్థితి. వారిని ఆస్పత్రికి తీసుకువచ్చిన 108 వాహనం టెక్నీషియన్ ఇదే విషయం చెపుతున్నారు. రక్తస్రావం అని చెప్పినా, గర్భిణి అని చెప్పినా పాత ఆస్పత్రికే తీసుకెళ్లేవారమని, కడుపునొప్పి అనడంతోనే క్యాజువాలిటీకి తీసుకువచ్చినట్లు పేర్కొంటున్నారు.
అన్నీ అనుమానాలే...
గుట్టు చప్పుడు కాకుండా ప్రసవించడంతో పాటు, శిశువును కమోట్‌లో కుక్కేసిన ఘటనపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అవాంఛిత గర్భం దాల్చిన వారైతేనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటారని నిపుణులు అంటున్నారు. ఆడపిల్ల అని అలా చేశారనుకోవడానికి అసలు పురిటి నొప్పులని వారు చెప్పకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే పోలీసులు కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. అయితే శుక్రవారం అన్ని విషయాలు చెపుతామని వారు పేర్కొన్నారు.
ఆ.. మహిళ గుర్తింపు!
Published Fri, Jul 31 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement
Advertisement