మరణంలోనూ వీడని బంధం...
మరణంలోనూ వీడని బంధం...
పత్తిపాడు,
కష్టసుఖాల్లో తోడునీడగా నిలిచిన ఆ జంటను చూసి విధికి కన్నుకుట్టిందేమో... ట్రాక్టర్‌రూపంలో మృత్యువు కబళించింది. నాతిచరామి అంటూ అగ్నిసాక్షిగా వివాహమాడిన ఆ ఇద్దరూ జంట గానే మృత్యువాత పడ్డారు. కన్నబిడ్డలు మాత్రం అనాథలుగా మారారు. హృదయవిదారకమైన ఈ సంఘటన ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది.
దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పెదనందిపాడు మండలం వరగాని గ్రామానికి చెందిన నిజాంపట్నం శంకర్(27) తాపీపని పనిచేస్తుండగా, భార్య మాధవి(20) కూడా తనతో పాటు కూలి పనులు చేసుకుంటోంది. వీరికి ఇద్దరు పిల్లలు. గురువారం ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో పనికి వెళ్లి, తిరిగి ద్విచక్రవాహనంపై రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో గొట్టిపాడు మీదుగా కొప్పర్రు వైపు వెళుతున్నారు. అదే సమయంలో గొట్టిపాడు సమీప పొలాల నుంచి పత్తి టిక్కీల లోడుతో గొట్టిపాడు వైపు ట్రాక్టర్ వస్తోంది. ఎదురెదురుగా వస్తూ ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి.
ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళుతున్న భార్యభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రత్తిపాడు ఎస్‌ఐ సీహెచ్‌ప్రతాప్‌కుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.