స్టీల్‌ప్లాంట్ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి ఆదేశాలు
స్థలాన్ని పరిశీలించిన ఉక్కు కర్మాగారం డెరైక్టర్
కాపలాకు ఇద్దరు హోంగార్డుల ఏర్పాటు
ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూమిని కాపాడుకునేందుకు కర్మాగారం యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. ప్లాంట్‌కు చెందిన రూ.70కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ‘సాక్షి’ ప్రచుంరించిన కథనంపై యాజమాన్యం వెంటనే స్పందించింది. అగనంపూడి వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఏడు ఎకరాలను పరిరక్షించేందుకు ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించింది. ‘బరితెగింపు... ఆపై బెదిరింపు’ అనే శీర్షికతో ఈ నెల 27న సాక్షి ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. అగనంపూడి వద్ద సర్వే నంబర్లు 226, 227లలో ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు చెందిన భూమిని ఫోర్జరీ పత్రాలతో ఓ ఎమ్మెల్యే సన్నిహితులు కబ్జా చేయడానికి ప్రయత్నించడం.. అందులో భాగంగా పునాదుల పనులు చేపట్టడమే కాకుండా.. కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లిన స్టీల్‌ప్లాంట్ అధికారులపై కబ్జాదారులు ఎమ్మెల్యే పేరుతో బెదిరింపులకు దిగారు. ఈ బాగోతాన్ని ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించడంతో అధికారులు స్పందించారు.
స్టీల్‌ప్లాంట్ డెరైక్టర్(పర్సనల్) డాక్టర్ జి.బి.ఎస్. ప్రసాద్ ఆ భూమిని సోమవారం పరిశీలించారు. భూమి పత్రాలు, మ్యాప్‌లు పరిశీలించారు. ఈడీ ఆర్‌పీ శ్రీవాత్సవ, టౌన్ అడ్మిన్ విభాగాధిపతి ఎం.వి.ఆర్. ప్రసాద్, విభాగం అధికారులు పి.ఎల్. రాముడు, సూరి అప్పారావులతో భూమి రక్షణకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. వెంటనే ఈ ఏడు ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించారు.
అంతవరకు అక్కడ నిరంతరం సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కబ్జా ప్రయత్నాలపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని కూడా ఆయన తమ అధికారులకు సూచించారు. దాంతో పోలీసు అధికారులు వెంటనే ఇద్దరు హోం గార్డులను ఏర్పాటు చేశారు.