Security arrangement
-
ప్రతీ రెండు నెలలకు అయోధ్య భద్రతా సిబ్బంది మార్పు!
అయోధ్యలోని రామాలయ భద్రత కోసం మోహరించిన పీఏసీ సిబ్బందిని ప్రతి రెండు నెలలకోసారి మార్చనున్నారు. రామ మందిర భద్రత బాధ్యతను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం (యూపీఎస్ఎస్ఎఫ్)నిర్వహిస్తోంది. ఈ దళం ఏర్పాటైనప్పటి నుంచి ఎటువంటి నియామకాలు జరగలేదు. దీంతో పీఏసీ సిబ్బంది సాయాన్ని తీసుకుంటున్నారు. పీఏసీ సిబ్బందిని ఒకేచోట నియమిస్తే వారిలో పని సామర్థ్యం దెబ్బతింటుందని, వారిలో నైతికత పడిపోతుందని భావించిన ఉన్నతాధికారులు పీఏసీ ఫోర్స్‌ను ప్రతీ రెండు నెలలకు మార్చాలని నిర్ణయించారు. అయోధ్యలోని రామ మందిర భద్రత కోసం ఎనిమిది కంపెనీల పీఏసీని యూపీ ఎస్ఎస్ఎఫ్కు అప్పగించారు. అయోధ్యలో మోహరించిన ఈ ఎనిమిది కంపెనీలను ప్రతి రెండు నెలలకు మార్చడానికి డీజీపీ ఆమోదం తెలిపారు. ఈ సిబ్బందికి సెక్యూరిటీ బ్రాంచ్ రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. -
ఈఆర్సీ కార్యాలయంలోకి ప్రవేశంపై నిషేధాజ్ఞలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) కార్యాలయంలోకి సందర్శకుల ప్రవేశంపై నిషేధాజ్ఞలు విధించారు. ఆఫీసులోకి ప్రవేశించాలనుకునేవారు తమ వివరాలను సెక్యూరిటీ రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ఈఆర్సీ కార్యదర్శి అనుమతి ఉంటేనే లోపలికి అనుమతించనున్నట్లు చెప్పారు. పని వేళల్లో సందర్శకులు అధికారులను కలవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు తమ వార్షిక ఆదాయ, అవసరాల అంచనాల(ఏఆర్ఆర్ల)ను ఈఆర్సీకి గురువారం రహస్యంగా సమర్పించాయి. 2018–19లో అమలుచేయనున్న విద్యుత్ చార్జీల వివరాలనూ వీటితోపాటు పొందుపరిచాయి. ఏఆర్ఆర్ నివేదికలు, విద్యుత్ చార్జీల వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు విధించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కబ్జాకు కంచె
స్టీల్‌ప్లాంట్ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి ఆదేశాలు స్థలాన్ని పరిశీలించిన ఉక్కు కర్మాగారం డెరైక్టర్ కాపలాకు ఇద్దరు హోంగార్డుల ఏర్పాటు ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూమిని కాపాడుకునేందుకు కర్మాగారం యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. ప్లాంట్‌కు చెందిన రూ.70కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ‘సాక్షి’ ప్రచుంరించిన కథనంపై యాజమాన్యం వెంటనే స్పందించింది. అగనంపూడి వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఏడు ఎకరాలను పరిరక్షించేందుకు ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించింది. ‘బరితెగింపు... ఆపై బెదిరింపు’ అనే శీర్షికతో ఈ నెల 27న సాక్షి ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. అగనంపూడి వద్ద సర్వే నంబర్లు 226, 227లలో ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు చెందిన భూమిని ఫోర్జరీ పత్రాలతో ఓ ఎమ్మెల్యే సన్నిహితులు కబ్జా చేయడానికి ప్రయత్నించడం.. అందులో భాగంగా పునాదుల పనులు చేపట్టడమే కాకుండా.. కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లిన స్టీల్‌ప్లాంట్ అధికారులపై కబ్జాదారులు ఎమ్మెల్యే పేరుతో బెదిరింపులకు దిగారు. ఈ బాగోతాన్ని ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించడంతో అధికారులు స్పందించారు. స్టీల్‌ప్లాంట్ డెరైక్టర్(పర్సనల్) డాక్టర్ జి.బి.ఎస్. ప్రసాద్ ఆ భూమిని సోమవారం పరిశీలించారు. భూమి పత్రాలు, మ్యాప్‌లు పరిశీలించారు. ఈడీ ఆర్పీ శ్రీవాత్సవ, టౌన్ అడ్మిన్ విభాగాధిపతి ఎం.వి.ఆర్. ప్రసాద్, విభాగం అధికారులు పి.ఎల్. రాముడు, సూరి అప్పారావులతో భూమి రక్షణకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. వెంటనే ఈ ఏడు ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించారు. అంతవరకు అక్కడ నిరంతరం సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కబ్జా ప్రయత్నాలపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని కూడా ఆయన తమ అధికారులకు సూచించారు. దాంతో పోలీసు అధికారులు వెంటనే ఇద్దరు హోం గార్డులను ఏర్పాటు చేశారు.