ఇంకా వివక్షేనా...! | Discrimination on language pandith test | Sakshi
Sakshi News home page

ఇంకా వివక్షేనా...!

Published Sat, Oct 21 2017 12:22 PM | Last Updated on Sat, Oct 21 2017 12:22 PM

Discrimination on language pandith test

పాఠశాల విద్యాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న భాషా పండిత పోస్టులపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివక్షత కొనసాగిస్తోంది. ఉన్నత పాఠశాల స్థాయిలో  భాషకు పునాదులేసే ఈ పోస్టుల ప్రాధాన్యతను విస్మరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్హత, బోధనానుభవం ఉన్న గ్రేడ్‌–2 భాషా పండితులకు పదోన్నతుల్లో ప్రభుత్వం పదేళ్లుగా అన్యాయం చేసింది. ఉద్యమాలకు తలొగ్గి గత ఏడాది జీఓ నెం.144 ను విడుదల చేసి పదోన్నతులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది.  తెలుగు, హిందీ భాషలపై ఇంటర్మీడియట్‌ స్థాయి నుంచి అధ్యయనంతో ప్రత్యేక డిగ్రీలు చేసి ప్రతిభ చూపిన వారికి అప్పట్లో పదోన్నతుల కల్పనలో తీరని అన్యాయం  చేసింది. ఉద్యమాలు చేసి ఆ డిమాండ్‌లను సాధించుకున్నారు.  తాజాగా ఉపాధ్యాయులకు నిర్మించిన ఏకీకృత సర్వీసు నిబంధనలో మరోసారి వివక్షత చూపారు.

విజయనగరం అర్బన్‌: బోధనా తరగతులను నిర్వహిస్తున్న ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌ భాషా సబ్జెక్టు పోస్టుల ఉపాధ్యాయులకు ఉన్నత విద్యలోని అధ్యాపక, పర్యవేక్షణ అధికార పోస్టుల పదోన్నతి అర్హత ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గత సర్వీసు నిబంధనలకు  స్కూల్‌ అసిస్టెంట్‌ భాషా పోస్టులు పదోన్నతులకు సంబంధించి అశాస్త్రీయమైన విద్యార్హతలు, ఫీడర్‌ క్యాడర్‌లను నిర్ధేశించిన భాషాలకు, భాషా బోధకులకు తీవ్ర అన్యాయం చేసింది. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలోని భాషా పండిత ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా వీరు 1200 మంది వరకు ఉన్నారు. వీరంతా దీన్నే ప్రధాన డిమాండ్‌గా చేసుకొని తాజాగా ఉద్యమాలకు సిద్దపడ్డారు. వచ్చేనెల 16 వరకు వివిధ స్థాయిలో నిరసనలు చేపట్టడానికి సిద్ధమయ్యారు.

9, 10 తరగతులకు బోధన సహాయ నిరాకరణ
జిల్లాలో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులకు బోధనలు చేసే గ్రేడ్‌–1 స్కూల్‌ అసిస్టెంట్‌ భాషా సబ్జెక్టు పోస్టులు భాళీగా ఉన్నాయి.  వీరి స్థానంలో దాదాపు 400 మంది భాషా పండిత గ్రేడ్‌–2 (సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ అర్హతలోని) ఉపాధ్యాయులు అదనపు బోధిస్తూ నెట్టుకొస్తున్నారు.  గత కొన్ని సంవత్సరాలుగా పది ఉత్తమ ఫలితాలను అందించడంలో వీరి కృషి శ్లాఘనీయంగా ఉండేది.  తాజాగా రూపొందించిన ఏకీకృత సర్వీసు నిబంధనల్లో లభించే పదోన్నతుల ఫలాలు మొత్తం 1200 మంది భాషా పండిత ఉపాధ్యాయులకు అందడం లేదు. ఏకీకృత సర్వీసు నిబంధన జీవో నెం.73లోని క్లాజ్‌ 4 ప్రకారం కేటగిరి 1, ఎంఈఓ హెచ్‌ఎం పదోన్నతులకు సంబంధించి విద్యార్హతలలో సంబంధం లేకుండా స్కూల్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌లో సీనియరిటీ ప్రాతిపదికగా పదోన్నతి కల్పిస్తూ పండిత శిక్షణ కూడా పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తం భాషా పండిత ఉపాధ్యాయ వ్యవస్థకు కలుగుతున్న ఏకీకృత సర్వీసు నిబంధనల అన్యాయానికి మద్దతుగా వీరంతా  ఉద్యమాలకు దిగారు. ఈ నెల 26న జిల్లా కేంద్రాలలో నిరసన దీక్షలు చేపడతారు.

ఆ తరువాత మండల స్థాయిలో చైతన్యసభులు నిర్వహిస్తారు. వచ్చే నెల 16న విజయవాడలో చేపడుతున్న భారీ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా భాషా పండితులు హాజరుకానున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే బోధనా తరగతులకు సహాయ నిరాకరణ చేట్టాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. విజయవాడలో రాష్ట్ర కమిటీ నాయకులు ఆమరణ నిరాహార దీక్షలను చేపడతారు. ఈ మేరకు కమిటీ జిల్లా అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బంకురు గోవిందనాయుడు ఉద్యమాల షెడ్యూల్‌ని ప్రకటించారు.  ఏకీకృత సర్వీసు నిబంధనలను సవరించి భాషా పండిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఉద్యమ కార్యక్రమాల్లో భాషా పండిత ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

న్యాయం చేయకపోతే బహిష్కరణ
భాషా పండిత ఉపాధ్యాయులకు ప్రభుత్వం అన్యాయం చేస్తూనే ఉంది. పదేళ్ల పాటు ఎలాంటి పదోన్నతులకు కల్పించక అప్పట్లో అన్యాయం చేశారు. తాజాగా  ఉపాధ్యాయులకు నూతనంగా రూపొందించిన  సర్వీసు నిబంధనల్లో కూడా బాషతో పాటు బాషా బోధనకులకు పక్షపాతం వహించారు. వచ్చే నెల 16లోగా వివిధ స్థాయిలో ఉద్యమాలు చేస్తాం. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే అదనంగా అందిస్తున్న బోధనా తరగతుల (9, 10వ తరగతులకు)కు సహాయ నిరాకరణ చేపడతాం.
– బి.గోవిందనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement