అసంతృప్తి సెగ | Dissatisfaction fire | Sakshi
Sakshi News home page

అసంతృప్తి సెగ

Published Thu, Jun 25 2015 4:47 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

Dissatisfaction fire

సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి చివరి క్షణంలో మొండిచేయి చూపడం యాదవ సామాజిక వర్గాన్ని అవమానించడమేనని ఆ వర్గ నేతలు భావిస్తున్నారు. దీనికి సామాజిక సమీకరణాలను సాకుగా చూపడంపై వారు మండిపడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఆశచూపి నిరాశకు గురిచేశారని గుర్తుచేస్తున్నారు. సామాజిక సమీకరణలు యాదవులకు పదవి ఇచ్చే సమయానికే అడ్డంకిగా మారుతున్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు.

మచిలీపట్నం, గుడివాడ, విజయవాడల్లో ఇటీవల బహిరంగంగా విమర్శలకు దిగారు. టీడీపీ అధిష్టానం తీరుపై దుమ్మెత్తిపోశారు. అనంతపురం జిల్లాలో యాదవ సామాజికవర్గానికి చెందిన తిప్పే స్వామి, బీదా రవీంద్రకు ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చామంటూ సాకుగా చూపి ఇక్కడ బచ్చులకు అన్యాయం చేశారని వారు చెబుతున్నారు. తనను కలవడానికి వచ్చిన వైవీబీ, బుద్దా వెంకన్న ఎదుట బచ్చుల అర్జునుడు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, పార్టీ అధినేత చంద్రబాబు తనను మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే.

 పదవులన్నీ ఒక సామాజిక వర్గానికేనా?
 జిల్లాలో విజయవాడ ఎంపీ, విజయవాడ మేయర్, జెడ్పీ చైర్‌పర్సన్, ఆప్కాబ్ చైర్మన్, గన్నవరం, మైలవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, కైకలూరు నియోజకవర్గాలతో పాటు ఇటీవల ఎమ్మెల్సీగా ఎంపికైన వైవీబీ రాజేంద్రప్రసాద్, జగ్గయ్యపేటకు చెందిన తొండెపు దశరథ జనార్దన్ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వారంతా కీలక పదవుల్లో ఉన్నారు. జిల్లాలో ఒకే సామాజికవర్గానికి చెందిన ఇంతమందికి పదవులు ఇచ్చిన టీడీపీ నాయకత్వం యాదవులకు పదవులు ఇచ్చే సమయానికి సమీకరణలు అడ్డువస్తున్నాయంటూ సీలింగ్ విధించటం టీడీపీలోని యాదవ సామాజిక వర్గ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఒక వర్గానికే పదవులు ఇస్తున్నారని, వారికే ప్రాధాన్యత ఉంటోందని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఇతర పార్టీల్లో ఉన్న ప్రాధాన్యత ఇక్కడేదీ?
 కాంగ్రెస్ పార్టీలో ఉండగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు, కొలుసు పార్థసారథికి టికెట్లు ఇవ్వడంతో పాటు సారథికి మంత్రి పదవికి కూడా ఇచ్చి సముచితం స్థానం కల్పించారని ఆ వర్గం నేతలు అంటున్నారు. వైఎస్సార్ సీపీలోనూ యాదవ సామాజిక వర్గానికి చెందిన కేపీ సారథికి మచిలీ         పట్నం ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు ఆ తర్వాత ఆయనకు జిల్లా బాధ్యతలను కూడా అప్పగించారని గుర్తు చేస్తున్నారు. టీడీపీలోనే తమ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

 అడ్డుకున్నదెవరు?
 పార్టీలో అంతర్గత విభేదాలు కూడా బచ్చులకు సీటు రాకుండా అడ్డుకున్నట్లు మరో వాదన వినిపిస్తోంది. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు బచ్చుల అర్జునుడు బీసీ కావటం, ఆయన్ని ఎమ్మెల్సీ చేస్తే మచిలీపట్నంలో తన ప్రాబల్యం కొంత తగ్గుతుందనే భావనతో మంత్రి అడ్డుకున్నారని తెలుస్తోంది. ఇందుకు విజయవాడకు చెందిన పలువురు నేతలతో కలిసి ఆయన తెరవెనుక మంత్రాంగం నడిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బుద్దా వెంకన్నను తెరపైకి తెచ్చి బచ్చులకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది.

బచ్చుల మంత్రి ఉమాతో సన్నిహితంగా ఉండటంతో ఆయన ఎమ్మెల్సీ టికెట్ ఇప్పిస్తారంటూ తొలుత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కూడా ఓ చెయ్యి వేసి బచ్చులను పక్కన పెట్టించారనేది టీడీపీలో జరుగుతున్న చర్చ. పైకి చెబుతున్న కారణాలు ఏవైనా తమ సామాజిక వర్గానికి పార్టీలో అన్యాయం జరుగుతోందనేది వాస్తవమని, ఒక సామాజిక వర్గానికే అన్నింటా ప్రాధాన్యత దక్కుతోందని, తమను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని యాదవ సామాజిక వర్గం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement