అన్నా.. నిన్ను ఎమ్మెల్సీ చేస్తనే!!
అన్నా... నీకే టికె ట్టు ఇద్దామనుకున్నా... నీకు తెలుసు కదన్నా... రకరకాల ఈక్వేషన్స్... ఇవ్వలేకపోయినా... నువ్వేమీ ఫికర్ చేయకు... నిన్ను ఎమ్మెల్సీని చేస్తా...
సర్... టికె ట్టు ఇవ్వడం ఈజీయే... కానీ ఎన్నికల్లో పోటీపడటం అంత ఈజీ కాదు... నా మాట విను... నన్ను నమ్ము... బాగా డబ్బులు ఖర్చవుతాయ్... నిన్ను ఎమ్మెల్సీని చేస్తా...
మీ కులపోళ్లందరూ చెప్పారు... నీకిస్తే వాళ్లే గెలిపిస్తమన్నారు... కానీ పోటీ ఎక్కువై వర్కవుట్ కావడం లేదు... నిన్ను ఎమ్మెల్సీగా తీసుకుంటా... ఫస్ట్ పేరు నీదే... నాదీ పూచీ...
మంచాల శ్రీనివాసరావు: తెలంగాణలోని ఏ పార్టీ శిబిరంలో చూసినా ఇలాంటి సంభాషణలే! టికెట్ల ఆశావహులకు, టికెట్లు ఆశించిన భంగపడిన వారికి, రెబల్స్‌గా రంగంలోకి దిగుతున్నవారికీ, అసంతృప్తి వీడి తిరిగి పార్టీ పనిచేయటానికి వీలుగా పార్టీల ముఖ్యులు ఇలా నాయకుల చెవుల్లో ఎమ్మెల్సీ పూలు పెడుతున్నారు. పార్టీలో చేర్చుకోవటానికి, పార్టీని వీడిపోకుండా ఉండటానికి, పార్టీకి మరింతగా పనిచేయటానికి, అసంతృప్త నేతలకు సర్దిచెప్పటానికి పార్టీల ముఖ్య నాయకులు నియోజకవర్గ స్థా యి నేతలకు ఇలా హామీ లు ఇస్తున్నారు... ప్రధాన పార్టీల్లో ఇలా ఎమ్మెల్సీ పదవులపై హామీలు పొం దిన నాయకుల సంఖ్య ఇప్పటికే 150 దాకా ఉం టుందని అంచనా. ప్రత్యేకించి టీఆర్ఎస్, కాంగ్రెస్ శిబిరాల్లో ఈ తతంగం ఎక్కువగా ఉంది...
అందరికీ ఎమ్మెల్యే టికెట్లే కావాలి!
నిజానికి ఎమ్మెల్యే టికెట్లు ఆశించే పార్టీ నాయకులను బుజ్జగించటానికి రకరకాల కార్పొరేషన్ పదవులు, ఇతరత్రా నామినేటెడ్ పదవుల్ని ఎరవేయడం పరిపాటిగా ఉండేది. కానీ ప్రస్తుతం రాష్ట్ర విభజనలో నిమగ్నమైన అధికారగణం నిష్కర్షగా సగం మేరకు కార్పొరేషన్లను, పనికిరాని ప్రభుత్వ సంస్థలను రద్దు చేసే పనిలో పడింది. నీకు ఫలానా కార్పొరేషన్ ఇస్తా, నిన్ను ఫలానా సంస్థకు అధ్యక్షుడిని చేస్తా అనే పాతరకం హామీలను ప్రస్తుతం నాయకులే నమ్మే పరిస్థితి లేదు.
అందుకని ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులను ఎరవేస్తున్నారు! ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నడుమ విపరీతమైన పోటీ నెలకొన్న ఈ స్థితిలో ఈ రెండు శిబిరాల్లోనే ఎక్కువగా ఈ ఎమ్మెల్సీ పదవుల హామీలు వినిపిస్తున్నాయి. ఒక్కో స్థానంలో ఇద్దరేసి, ముగ్గురేసి అభ్యర్థులు పార్టీ కోసం పనిచేస్తుండటం, తెలంగాణ పోరాటంలో పనిచేశామని చెబుతూ టికెట్లు అడిగేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం, కొన్ని సీట్లు పొత్తుల్లో కేటాయించడం వల్ల కొందరు ఆశలు గల్లంతు కావడం వంటి కారణాలతో పార్టీల్లోని చాలా మంది నేతల్ని బుజ్జగించాల్సి వస్తోంది.
నిజంగా ఇవ్వగలిగేది ఎన్ని?
- తెలంగాణ శాసనమండలిలో ఉండేదే 40 సీట్లు
- దీనిలో మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, మరో మూడు ఉపాధ్యాయ నియోజకవర్గాలు వీటికి పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించగలవు. ఎవరైనా సరే ఎన్నికలో పోటీపడి గెలవాల్సిందే.
- 14 స్థానాలకు శాసనసభ్యులు ఓట్లేసి ఎన్నుకుంటారు. ఇప్పుడు వాటిల్లో ఖాళీలే లేవు. ఏ రెండేళ్ల తరువాతో మూడో వంతు ఖాళీలు కొన్ని ఏర్పడినా... అప్పుడు పార్టీల వారీగా ఉండబోయే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఒక్కో పార్టీ ఒకరికో, ఇద్దరికో మాత్రమే అవకాశం కల్పించగలవు.
- 14 స్థానాలకు స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోవాలి. ప్రస్తుత ఖాళీలు 5. వీటికీ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగలవు. ఎవరైనా సరే ఎన్నికలో పోటీపడి గెలవాల్సిందే
- 6 స్థానాలకు గవర్నర్ ద్వారా నామినేట్ చేయించవచ్చు. వీటిల్లో మూడు ఖాళీలున్నాయి.
ఈ లెక్కను బట్టి ఒక పార్టీ ఎందరు నాయకులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వగలదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు!
జన తెలంగాణ
అందరికీ రాజకీయావకాశాలు..
- కొత్త రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలి. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించాలి. పేదలందరికీ కూడు, గూడు, విద్య అవకాశాలు లభించేలా చూడాలి. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి. అన్ని వర్గాల వారికి రాజకీయావకాశాలు కల్పించాలి. చేతి వృత్తుల వారికి రుణాలివ్వాలి. - మురహరి శ్రీధర్ నాయి,
దూల్‌పేట, హైదరాబాద్.
ఉద్యోగులే కీలకం
నవ తెలంగాణ నిర్మాణం కలగా మిగలకూడదు. భౌగోళిక తెలంగాణగా మిగలకూడదు. బంగారు తెలంగాణగా ఏర్పడాలంటే ఉద్యోగులు కీలకపాత్ర పోషించాలి. కొన్ని ఇబ్బందులున్నా ప్రభుత్వానికి సహకరించాలి. అవసరమైతే ఎక్కువ సమయం పని చేయడానికి కూడా సిద్ధం కావాలి. కొత్త ప్రభుత్వం ఈ ప్రాంత మేధావుల సూచనలు, సలహాలను తీసుకోవాలి. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.
- ఎం. రవళి, ఆదర్శ పాఠశాల,
చిన్న కోడూరు, మెదక్ జిల్లా
ఉపాధి చూపేలా విద్య...
ఆర్థిక అసమానతలు లేని తెలంగాణ కావాలి. మూతపడిన అన్ని పరిశ్రమలను తెరిపించాలి. ప్రతి జిల్లాలో ఒక వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలి. మండలానికో పశువైద్యశాల ఉండాలి. ఉపాధి మార్గం చూపే విద్యావిధానాన్ని రూపొందించాలి. రవాణా సౌకర్యాలను మెరుగుపర్చాలి. సాగునీటివసతులను పెంపొం దించి అధిక దిగుబడులు సాధించేందుకు వీలుగా రైతులకు అవగాహన కల్పించాలి.
- చింతపంటి కమలాకర్ ,
గాంధీనగర్, వేములవాడ