ఏ విద్యాసంస్థ అయిన ఏర్పాటు చేయాలంటే సుదీర్ఘ పరిశోధన జరగాలి. మౌలిక సదుపాయాలు, పూర్తిస్థాయిలో అధ్యాపకులు, మైదానం కల్పించాలి. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. అవేవీ లేకుండా ఆదరాబాధరాగా విద్యాసంస్థను ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అవస్థలు తప్పవు. ఫలితాలపై త్రీవ ప్రభావం చూపుతాయి. టెక్కలి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.
ఎచ్చెర్ల: జిల్లాలో ప్రస్తుతం ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. గతంలో శ్రీకాకుళం పురుషుల, మహిళల, ఆమదాలవలస కళాశాలలు ఉండేవి. 2013 ఏప్రిల్‌లో టెక్కలి, సీతంపేట రెండు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించారు. ప్రారంభంలో సీతంపేట పాలిటెక్నిక్ కళాశాలను ఆమదాలవలస కళాశాలలో నిర్వహించగా, టెక్కలి పాలిటెక్నిక్ కళాశాలను శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగేది. కొద్ది రోజుల తర్వాత సీతంపేట పాలిటెక్నిక్ కళాశాలను సీతంపేటకు తరలించారు. టెక్కలి పాలిటెక్నిక్ కళాశాలను మాత్రం తరలించలేదు. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులకు ఇక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. సివిల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లు ఈ కళాశాలలో కొనసాగుతున్నాయి.
ఈ కళాశాలకు సంబంధించి ప్రత్యేక అధికారిని నియమించారు తప్ప, సిబ్బందిని మాత్రం నియమించలేదు. అధ్యాపకుల కొరత కారణంగా శ్రీకాకుళం పాలిటెక్నిక్ పురుషుల కళాశాల విద్యార్థుతో తరగతులు క్లబ్ చేసి నిర్వహించటం, లేదంటే మొక్కుబడిగా తరగతులు నిర్వహించటం జరుగుతుంది. ఇది ఉత్తీర్ణత శాతంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శ్రీకాకుళం పురుషుల పాలి టెక్నిక్ కళాశాలలో గత విద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 90 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, టెక్కలి పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి 50 శాతం లోపు ఉత్తీర్ణత నమోదు అయింది. ఎలక్ట్రికల్ బ్రాంచిలో 60 మందికి 21 మంది విద్యార్థులే ఉత్తీర్ణత సాధించారు.
ఇప్పటికీ గుర్తించని స్థలం
టెక్కలి పాలిటెక్నిక్ కళాశాలను టెక్కలిలో నిర్వహించేందుకు 2013లో కేంద్ర మంత్రిగా ఉన్న కిల్లి కృపారాణి టెక్కలి పరిసరాల్లోని తర్లికొండ ప్రాంతంలో ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం పరిశీలించారు. కానీ, స్థలం గుర్తించలేదు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి కిం జరాపు అచ్చెన్నాయుడు ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా టెక్కలి పాలిటెక్నిక్ కళాశాల తరలించేందుకు కనీస చర్యలు చేపట్టలేదు.
ఒక్కసారిగా తరలిస్తే ఎన్నో సమస్యలు
శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో వసతి గృహం ఉంది. ఇక్కడ సీట్ల కేటాయింపులో శ్రీకాకుళం విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. టెక్కలి విద్యార్థులకు మిగులు సీట్లు మాత్రమే ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. మరో పక్క బస్ పాస్ పొందేటప్పుడు సైతం విద్యార్థులకు సమస్య ఉంది. ఈ కళాశాలను షిప్టు చేయకపోతే భవిష్యత్‌లో మరెన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. స్టడీ, టీసీ వంటివి ఏ కళాశాల పేరు మీద ఇస్తారు అన్నది ఒక అంశం కాగా, శ్రీకాకుళం పరిసర ప్రాంత విద్యార్థులు టెక్కలి పాలిటెక్నిక్ కళాశాలలో చేరుతుండడం మరో అంశం. ఒక్కసారిగా ఈ కళాశాలను టెక్కలి షిప్టుచేస్తే విద్యార్థులు అక్కడకు వెళ్లటం సైతం కష్టమవుతుంది. పరాయిపంచన కొనసాగుతున్న ఈ కళాశాలకు సౌకర్యాలు కోసం సాంకేతిక విద్యాశాఖ రూ. 20 లక్షలు మంజూరు చేసింది. ఈ డబ్బులతో ఫర్నిచర్ కొంటే షిప్టు సమయంలో అక్కడికి తరలిస్తారా అన్నది ప్రశ్నార్థకం. ప్రస్తుతం టెక్కలిలో ఈ కళాశాల ఏర్పాటు చేయాలంటే 10 ఎకరాల స్థలం, రూ. 10 కోట్లతో మౌలిక వసతులు ఏర్పాటు, 15 మంది అధ్యాపకుల నియామకం అవసరం. ఇప్పట్లో ఇది జరిగే పనేనా అన్నది కొందరి వాదన. అయితే ఎన్నాళ్లు పరాయిపంచన ఈ కళాశాల కొనసాగుతుందన్నది మరో అంతుపట్టని ప్రశ్న. టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవిష్యత్ ఏమిటో వేచి చూడవల్సిందే.
ముందు చూపు కరువు
Published Fri, Aug 28 2015 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM
Advertisement