రాష్ట్ర విభజన అనంతరం 1177 పడకలతో ఏపీలోనే అతిపెద్ద పేదల ఆసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో సమస్యలు తిష్టవేశాయి.
♦ గుండె ఆపరేషన్లు చేసేందుకు ఆటంకాలు
♦ నీరు, విద్యుత్ సరఫరాలో సమస్యలు
♦ విధులకు డుమ్మా కొడుతున్న వైద్య సిబ్బంది
గుంటూరు మెడికల్ : రాష్ట్ర విభజన అనంతరం 1177 పడకలతో ఏపీలోనే అతిపెద్ద పేదల ఆసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో సమస్యలు తిష్టవేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు రూ. 33 కోట్లతో నిర్మించిన డాక్టర్ పొదిలి ప్రసాద్ సూపర్‌స్పెషాలిటీ, ట్రామా కేర్ సెంటర్‌లో విద్యుత్, నీటి సమస్యలు తరచూగా తలెత్తుతుండటంతో గుండె ఆపరేషన్లకు సైతం ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
నూతనంగా నిర్మించిన పొదిలి ప్రసాద్ భవనానినికి విద్యుత్ సరఫరా లేని సమయాల్లో జనరేటర్ ద్వార పవర్‌ను పంపిణీ చేసేందుకు 320 కేవీ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. అయితే కరెంటు లేని సమయాల్లో ప్రస్తుతం ఉన్న జనరేటర్ ద్వార ఉత్పిత్తి అవుతున్న విద్యుత్ సరిపోవడం లేదు. ఇటీవల కాలంలో ప్రభుత్వం పీపీపీ విధానంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా జీజీహెచ్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీలు ప్రారంభించింది.
గత మూడు వారాలుగా ఆపరేషన్లు జరుగుతున్నాయి. అయితే ఆపరేషన్లకు కరెంటు లేని సమయాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జనరేటర్ సామర్ధ్యం సరిపోకపోవడమే దీనికి కారణం. అదనంగా మరో 320 కేవీ జనరేటర్‌ను ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో మిలీనియం బ్లాక్‌లో విద్యుత్ సరఫరా ఇచ్చే అవకాశం జరుగుతుంది. లేని పక్షంలో కేవలం అత్యవసరంగా కొన్ని ఆపరేషన్ థియేటర్‌లకు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతుంది.
మొట్టమొదటి సారిగా మూడు వారాల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రారంభించిన సమయంలో మంచినీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో కొంత అంతరాయం తలెత్తింది. వేసవికి ముందుగానే మిలీనియం బ్లాక్ ప్రారంభానికి ముందుగానే ఆసుపత్రిలో నీటి సరఫరా గురించి ప్రణాళికలు రూపొందించాల్సిన అధికారులు విఫలమవడంతో నేడు సమస్య ఉత్పన్నమవుతుంది. రెండు నెలల క్రితం కార్పొరేషన్ నుంచి నూతనంగా నీటి సరఫరా లైనును మిలీనియం బ్లాక్ కోసం ఏర్పాటు చేశారు.
నేటి వరకు పైపులైనులు ఏర్పాటు చేసినా నీటి సరఫరా మాత్రం వాటి ద్వార జరుగకపోవడంతో ఓపెన్ హార్ట్ సర్జరీల సమయంలో వైద్య సిబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. అత్యవసర వైద్య సేవల విభాగంలో వైద్యులు నిర్ణీత పనివేళల్లో అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఫలితంగా పేదలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఓపీ వేళల్లో కూడా కొద్దిపాటి సిబ్బంది మాత్రమే విధులకు హాజరవుతుండగా మిగతా వారు ఆసుపత్రికి వచ్చి సొంత కార్యకలాపాలపై మక్కువ చూపిస్తున్నారు.
మిలీనియం బ్లాక్‌లో అదనంగా పడకలు ఉన్నప్పటికీ వాటికి సరిపడ వైద్య సిబ్బందిని, వైద్యులను ప్రభుత్వం కేటాయించకపోవడంతో నూతన భవనంలో అరకొర వైద్యసేవలే లభిస్తున్నాయి. ప్రతి మూడు నెలలకొకసారి కలెక్టర్ అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటి సమావేశం ఏర్పాటు చేసి ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన పనులను ప్రజాప్రతినిధుల సమక్షంలో మంజూరు చేస్తారు. జీజీహెచ్‌లో సుమారు ఏడాదిన్నరగా ఆసుపత్రి అభివృద్ధి కమిటి సమావేశం జరుగకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
జీజీహెచ్‌కు వచ్చే పేదరోగులకు దాహార్తిని తీర్చేందుకు, మినరల్ వాటర్ ఉచితంగా అందించేందుకు ఏడాది క్రితం ప్రజాప్రతినిధులు తమ సొంతనిధులను ఆసుపత్రికి కేటాయించారు. నేటి వరకు మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు గురించి ఆసుపత్రి అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావినిస్తుంది. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ జీజీహెచ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై స్పందించి పరిష్కరించాలని పలువురు రోగులు కోరుతున్నారు.