బదిలీల కలవరం | Disturbing transformations | Sakshi
Sakshi News home page

బదిలీల కలవరం

Published Fri, Aug 21 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

Disturbing transformations

ఎక్సైజ్ సీఐ, ఎస్‌ఐలకు తప్పని స్థానచలనం
నేతల వద్దకు అధికారుల క్యూ
చిత్తూరు డీసీగా నాగలక్ష్మి రాక?

 
స్తబ్దతగా ఉన్న జిల్లా ఎక్సైజ్ శాఖలో బదిలీల ప్రక్రియ వేగవంతమైంది. దీంతో పైరవీలు ఊపందుకున్నాయి. వచ్చే నెల మొదటివారంలో అధికారులకు స్థాన    చలనం తప్పనిసరి కానుంది. మరోవైపు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డెప్యూటీ కమిషనర్‌గా నాగలక్ష్మి రానున్నారనే వార్తలు అధికారుల్లో దడ పుట్టిస్తోంది.
 
చిత్తూరు (అర్బన్):   జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఈనెల 14న ఆదేశాలు వెలువడిన సంగతి తెలిసిందే. డెప్యూటీ కమిషనర్(డీసీ)గా కుళ్లాయప్పను, చిత్తూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా (ఈఎస్) నాగసుద్దయ్యను, తిరుపతి ఈఎస్‌గా శ్రీనివాసరావును బదిలీచేసిన విషయం విదితమే. తిరుపతిలో ఈఎస్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు  ఇప్పటికే ఒంగోలులో బాధ్యతలు స్వీకరించారు. అయితే చిత్తూరుకు బదిలీ చేసిన ముగ్గురు అధికారులు ఇప్పటి వరకు ఇక్కడ బాధ్యతలు స్వీకరించకపోవడంతో కొత్తవారు ఇక్కడికి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అనారోగ్యం కారణంతో ఉన్న కుళ్లాయప్ప ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం అనుమానంగా ఉంది. దీనికి తోడు కర్నూలు జిల్లా డీసీగా బాధ్యతలు చేపట్టిన నాగలక్ష్మికి ఉప ముఖ్యమంత్రి కేఈ.కృష్ణమూర్తి నుంచి అభయహస్తం లభించలేదని తెలిసింది. దీంతో కర్నూలు నుంచి చిత్తూరు డీసీగా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు ఎక్సైజ్‌శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకో ఏమో గానీ నాగలక్ష్మి పేరు చెబితేనే జిల్లా ఎక్సైజ్‌శాఖలో పనిచేస్తున్న అధికారులకు దడ పుడుతోంది. ఆమె జిల్లాకు వస్తే ఇక్కడి నుంచి మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోవాల్సిందేనని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

50 మందికి స్థాన చలనం...
ఎక్సైజ్‌శాఖలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న పలువురు సీఐలు, ఎస్‌ఐలను బదిలీ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. చిత్తూరు, తిరుపతి ఎక్సైజ్ పరిధిల్లో మొత్తం 18 మంది సీఐలు, 40 మంది వరకు ఎస్‌ఐలు పనిచేస్తున్నారు. వీరిలో రెండేళ్లుగా ఒకే సర్కిల్‌లో పనిచేస్తున్న అధికారులను ఇతర సర్కిళ్లకు, ఐదేళ్లుగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఇటీవల ఎక్సైజ్ శాఖ నుంచి మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఈ పద్ధతి ప్రకారం 15 మంది సీఐలు, 35 మంది ఎస్‌ఐలకు బదిలీలు తప్పనిసరిగా కనిపిస్తోంది.  సీఐలు, ఎస్‌ఐల పనితీరు ఆధారంగా మార్కులు వేసి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి వారికి గ్రేడింగ్‌లు సైతం ఇచ్చారు. బదిలీల్లో గ్రేడింగ్‌లతో పాటు అధికారపార్టీ నాయకుల నుంచి సిఫార్సు లేఖలు, మంత్రి నుంచి లెటర్‌ప్యాడ్లు పట్టుకెళ్లిన వారికి కోరుకున్న చోట పోస్టింగులు ఇవ్వనున్నట్లు ప్రచారం ఊపందుకోవడంతో అధికారులు.. రాజకీయ నాయకుల ఇళ్లచుట్టూ తిరుగుతున్నారు. మామూళ్లు సమర్పించుకోవడానికి సైతం కొందరు అధికారులు వెనుకాడటంలేదు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement