సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా తాము చేస్తున్న సమ్మెను విరమించేది లేదని సీమాంధ్ర ఉద్యోగులు శనివారం హైకోర్టుకు నివేదించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి తమలో గూడుకట్టుకున్న భయాందోళనలు, సందేహాలను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ముందుకు రాలేదని, వాటిని నివృత్తి చేసేంతవరకు సమ్మె నుంచి వెనక్కెళ్లేది లేదని తెలిపారు. ఉద్యోగ సంఘాల తరఫున సీనియర్ న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, ఎ.సత్యప్రసాద్‌ల వాదనలను రికార్డు చేసుకున్న ధర్మాసనం... తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన విభజనపై సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం వీటిని శనివారం మరోసారి విచారించింది. శనివారం విచారణ ప్రారంభం కాగానే న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. గత 45 రోజులుగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఉద్యోగుల భయాందోళనలు, సందేహాలను నివృత్తి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని తెలిపారు. అందువల్లే సమ్మెను కొనసాగించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేంతవరకు సమ్మెపై వెనక్కి వెళ్లేది లేదని ఉద్యోగులు చెబుతున్నారని విన్నవించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మీ క్లయింట్ (ఏపీఎన్‌జీవోలు) ఏమంటారు?’’ అని న్యాయవాది మోహన్‌రెడ్డిని ప్రశ్నించింది. వారు తమ కార్యనిర్వాహక కమిటీ భేటీలో చర్చించిన తరువాత ఏ విషయం చెబుతారని, ఇందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని మోహన్‌రెడ్డి విన్నవించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరిస్తూ... ‘‘మీ క్లయింట్ ఇక్కడే ఉన్నట్లున్నారు. వారితో మాట్లాడి ఏ విషయమూ మాకు ఇప్పుడే చెప్పండి’’ అని స్పష్టం చేసింది. దీంతో మోహన్‌రెడ్డి కోర్టు హాలులో ఉన్న ఏపీఎన్‌జీవోల నాయకుడు అశోక్‌బాబుతో మాట్లాడారు.
అనంతరం మోహన్‌రెడ్డి.. సమ్మెను విరమించేందుకు ఏపీఎన్‌జీవోలు సిద్ధంగా లేరని నివేదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ...‘‘సంతోషం... ఏదో ఒకటి, మాకు స్పష్టతనిచ్చారు. ఈ మొత్తం వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకుంటారని ఆశించాం. మీరు (ఉద్యోగులు) చాలా కాలం గా సమ్మె చేస్తున్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా రు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మెపై పునరాలోచిస్తారని భావించాం. సమ్మె కొందరి ఇగోకు ప్రయోజనకారిగా మారింది. అలాగని మేము ఎవరినీ తప్పుపట్టడం లేదు. ఉద్యోగులు సమ్మె చేస్తున్నది రాజకీయ నిర్ణయంపై కాబట్టి, ఆ నిర్ణయంలో మేము జోక్యం చేసుకోలేం. ఉద్యోగ సమస్యలపై సమ్మె చేస్తుంటే తగిన న్యాయం చేసేవాళ్లం. చట్టాలు ఎక్కడా సమ్మె చేయాలని చెప్పడం లేదు. ఇటీవల జూనియర్ డాక్టర్లు మేం చెప్పిన వెంటనే సమ్మె విరమించారు. వారి సమస్యలకో పరిష్కారం చూపాం’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.