చెలమల నీరు తాగాల్సిందే
చెలమల నీరు తాగాల్సిందే
జియ్యమ్మవలస :
గెడ్డతిరువాడ గ్రామస్తులకు తాగునీటి కష్టాలు తీరడం లేదు. ఎన్నికల వేళ లో రాజకీయ నాయకులు రక్షిత పథకం ఏర్పా టు చేస్తామని శంకుస్థాపనలు చేసి ఊరించినా నిర్మాణ పనులే చేపట్టలేదు.
సుమారు మూడు వేల మంది జనాభా నివాసం ఉన్న ఈగ్రామంలో సమస్యలపై స్పందించే నాథుడు లేడని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వట్టిగెడ్డ రిజర్వాయర్ సమీపంలో స్పిల్‌వేకు ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో నాలుగు బోర్లు ఉన్నాయి. వాటిలో మూడింటి నుంచి ఉప్పునీరు వస్తోంది. మరో బోరు నీరు తాగేందుకు పనికి వచ్చినా అందరికీ చాలడం లేదు. దీంతో మహిళలు వేకువ జాము నుంచి తాగునీటి కోసం రెండు కిలోమీర్ల కాలినడకనే వెళుతున్నారు. వట్టిగెడ్డ రిజర్వాయర్ కాలువల వద్ద చెలమలు తవ్వి నీరు సేకరిస్తున్నారు.
ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు రక్షిత పథకానికి శంకుస్థాపన చేశారని, పనులు చేపట్టలేదని, ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇలా హడావుడిగా శంకుస్థాపన చేశారని పలువురు విమర్శిస్తున్నారు. వేసవిలో తమ కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయని ఆవేదన చెందుతున్నారు. చలమల్లో కూడా అంతకా నీరు ల భ్యం కాదని, గంటల కొద్దీ వేచిఉండాల్సిన పరిస్థితని చెబుతున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి రక్షిత పథకాన్ని శంకుస్థాపనకు పరిమితం చేయకుండా పనులు ప్రారంభించానలి, తాగునీరు అందించాలని మహిళలు వేడుకుంటున్నారు.