ఒంగోలులో డీఆర్‌ఎం విస్తృత తనిఖీలు
ఒంగోలు : విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) ప్రదీప్‌కుమార్ గురువారం ఉదయం ఒంగోలు రైల్వేస్టేషన్‌లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. దాదాపు మూడుగంటల పాటు స్టేషన్‌లోని అన్ని విభాగాలను కలియతిరిగారు. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో ఒంగోలు చేరుకున్న ఆయనకు స్టేషన్ సూపరింటెండెంట్ తూనుగుంట సత్యనారాయణ, హెల్త్ ఆఫీసర్ రమణారావు, ట్రాక్ ఇన్‌స్పెక్టర్ రామిరెడ్డి, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.
తొలుత ప్లాట్‌ఫారాలను పరిశీలించిన డీఆర్‌ఎం.. పలుచోట్ల టైల్స్ ఎత్తుపల్లాలుగా ఉండటంతో ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గమనించి సంబంధింత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి కుళాయిలు తిప్పినప్పుడు నీరు ప్లాట్‌ఫారంపై పారడంతో ప్రయాణికులు జారిపడితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను ప్రశ్నించారు.
పలుచోట్ల సీలింగ్ దెబ్బతినడాన్ని గుర్తించారు. వెంటనే వాటికి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. అనంతరం మెటల్ డిటెక్టర్‌ల పనితీరును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి వల్ల ఉపయోగం లేకపోగా ప్రయాణికులకు అడ్డంగా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను డీఆర్‌ఎం పరిశీలించారు. రైల్వేస్టేషన్ ఆవరణలో పార్కులు పెంచాలని, పార్కులు స్వచ్ఛందంగా నిర్వహించేందుకు ముందుకొచ్చేవారిని గుర్తించాలని అధికారులకు సూచించారు.
ప్రయాణికులతో మాటామంతీ..
అనంతరం ప్రయాణికులతో డీఆర్‌ఎం ప్రదీప్‌కుమార్ మాట్లాడారు. స్టేషన్‌లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? లోపాలు ఏమైనా ఉన్నాయా? సౌకర్యాలు ఇంకా పెంచాలా..? అని అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రయాణికులు మాట్లాడుతూ స్టేషన్‌లో తాగేందుకు మంచినీరు అందుబాటులో ఉంచాలని కోరారు. ఇప్పుడు సరఫరా అవుతున్న నీరు తాగేందుకు పనికి రావని చెప్పారు. టాయిలెట్ల వద్ద ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా జనరల్ టికెట్ కొన్న ప్రయాణికులు నేరుగా జనరల్ వెయిటింగ్ హాలులోని టాయిలెట్లను వినియోగించుకోవచ్చని డీఆర్‌ఎం చెప్పారు.
లిఫ్ట్ సౌకర్యం గురించి మాట్లాడగా ఒంగోలుకు రెండు లిఫ్టులు, ఒక ఎస్కలేటర్ మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఆటోవాలాల నుంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్‌పీఎఫ్ సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని ఉన్నతాధికారులను డీఆర్‌ఎం ఆదేశించారు.