వైఫల్యాలపై నిలదీస్తే... కక్షసాధింపా? | Dropping the channel broadcasting sakshi | Sakshi
Sakshi News home page

వైఫల్యాలపై నిలదీస్తే... కక్షసాధింపా?

Published Sun, Jun 12 2016 1:07 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

వైఫల్యాలపై నిలదీస్తే...  కక్షసాధింపా? - Sakshi

వైఫల్యాలపై నిలదీస్తే... కక్షసాధింపా?

సాక్షి చానల్ ప్రసారాల నిలిపివేతపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు
విజయవాడలో కొవ్వొత్తుల  {పదర్శన
పెడనలో నల్ల రిబ్బన్లతో ఆందోళన
రోడ్డెక్కిన జర్నలిస్టు సంఘాలు
{పసారాలు పునరుద్ధరించాలని డిమాండ్
లేకుంటే పోరాటం   ఉధృతం చేస్తామని హెచ్చరిక

 

నిజాలను నిర్భయంగా చెబితే నేరమా.. వైఫల్యాలపై నిలదీస్తే దోషమా.. ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు చేరవేస్తేనే తట్టుకోలేరా.. అంటూ సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు శనివారం ఆందోళనలు నిర్వహించారు. ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు ప్రభుత్వ తీరును గర్హించారు. భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని మండిపడ్డారు. సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సర్కారుకు జనం బుద్ధిచెప్పటం ఖాయమని హెచ్చరించారు. - సాక్షి, విజయవాడ

 

విజయవాడ : సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడంపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో జరిగే వివిధ సంఘటనలు, వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపించే చానల్ ప్రసారాలు రెండు రోజులుగా నిలిచిపోవడంతో జీర్ణించుకోలేని ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక చానల్ ప్రసారాలను నిలిపివేయడం వల్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందని, ఇది భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. సాక్షి ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు.

 
విజయవాడ శిఖామణి సెంటర్‌లో సాక్షి అభిమానులు, శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల, కార్పొరేటర్లతో పాటు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సత్తా యోనారాజు, తోకల శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 
పెడనలో స్థానిక ప్రెస్‌క్లబ్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాల నేతలంతా కలిసి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలియజేశారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పుట్టి కృష్ణప్రసాద్, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎక్కల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

 
గుడివాడలో ఏపీయూడబ్ల్యూజే, ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నెహ్రూ చౌక్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గోరపాటి రాజు, సీనియర్ పాత్రికేయులు ప్రసాద్, కౌన్సిలర్ చోర గుడి రవికాంత్ పాల్గొన్నారు. తక్షణం చానల్ ప్రసారాలను పునరుద్దరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రెస్‌క్లబ్ నేతలు హెచ్చరించారు.

 
కైకలూరులో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి ఏవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్ నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించారు. తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు.

 
నూజివీడు చినగాంధీబొమ్మ సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ బి.రేవతి, వైఎస్సార్ సీపీ పట్టణాధ్యక్షుడు పి.సత్యనారాయణ, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. రేవతి మాట్లాడుతూ ప్రజాసమస్యలను వెలికితీస్తున్న సాక్షి చానల్ ప్రసారాలు నిలిపివేయడమంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే  ఖూనీ చేయడమన్నారు.

 
గన్నవరం, హనుమాన్‌జంక్షన్‌లో జాతీయరహదారిపై జర్నలిస్టుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేశారు.

 
కంకిపాడు బస్టాండ్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మాదు వసంతరావు, జిల్లా అధికార ప్రతినిధి బండి నాంచారయ్య తదితరులు పాల్గొని ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.

 

 నందిగామలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు మెయిన్ బజార్ నుంచి గాంధీ విగ్రహం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఘంటా విజయకుమార్, ఏపీజేయూ జిల్లా అధ్యక్షుడు శాకమూరి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఈ విధంగా పత్రికా స్వేచ్ఛను హరించలేదని, చానల్ ప్రసారాలు నిలివేయడమంటే  ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడవడమేనని అభిప్రాయపడ్డారు.

 

 జగ్గయ్యపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ పద్మజకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు శీరం మూర్తి, సైదేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాక్షి చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జగ్గయ్యపేట ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement