010 పద్దున జీతాలు అందజేయాలి..
ఎయిడెడ్ సిబ్బంది జీతాలపై నియంత్రణ ఎత్తివేయాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగనే 010 పద్దు ప్రకారం ప్రతి నెలా జీతాలు వచ్చేలా చూడాలి. హెల్త్‌కార్డులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత నివ్వాలి. జీతాలు సరిగా రాక ఎయిడెడ్ సిబ్బంది కుటుంబాలు కష్టాలకు గురవుతున్నారు. పండగ వేళల్లో సైతం జీతాలు రాకపోవడం బాధాకరం.
- కె.శ్రీనివాసరావు, ప్రైవేటు ఎయిడెడ్ స్కూల్స్
అసోసియేషన్ గిల్డ్ జిల్లా అధ్యక్షుడు
నెల్లూరు(విద్య) : జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. నాలుగు నెలలుగా జీతాల్లేక పండగ పూట పస్తు పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. నెలనెలా జీతాలు వస్తేనే అంతంత మాత్రంగా సాగే జీవితాలు జీతాలు లేక అల్లాడిపోతున్నాయి. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితులు ఆశించిన స్థాయిలో మెరుగుపడడం లేదు. జిల్లాలో 84 ఎయిడెడ్ ప్రాథమిక, 18 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
ఐదు ఓరియంటల్ స్కూల్స్, ఒక హిందీ విద్యాలయం ఉన్నాయి. సుమారు 500 మందికిపైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలిమెంటరీ పాఠశాలలు, ఓరియంటల్ స్కూల్స్, హిందీ విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి జీతాలు అందలేదు. ఉన్నత పాఠశాలలకు డిసెంబర్ నుంచి జీతాలు రాలేదు. ప్రభుత్వం అనాలోచితంగా బడ్జెట్‌ను విడుదల చేయడతోనే ఈ పరిస్థితి దాపురించింది. ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాలలకు నాలుగు క్వార్టర్లకు కలిపి రూ.5,59,58,500 విడుదల చేశారు. ఈ మొత్తం అక్టోబర్ నెలవరకే ఎలిమెంటరీ స్కూల్ సిబ్బంది జీతాలకు సరిపోయింది.
ఒక నిర్ధిష్టమైన మొత్తాన్ని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి ఇదో ఉదాహరణ. జనవరి వరకు జీతాలు, డీఏ అరియర్స్ ఇచ్చేందుకు *6కోట్ల 2లక్షలు విడుదల చేయాల్సి ఉంది. హైస్కూల్‌లో డిసెంబర్ నుంచి జీతాలు, డీఏ అరియర్స్ ఇచ్చేందుకు *2,49,80,231లు విడుదల చేయాలి. ఓరియంటల్ సిబ్బందికి జీతాలు *65,90,662లు, దర్గామిట్టలోని బ్లెయిండ్ స్కూల్‌కు *1,86,500లు మంజూరుచే యాల్సి ఉంది. ఈ విషయమై విద్యాశాఖ కార్యాలయ సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎయిడెడ్ పాఠశాలలకు జీతాలు ఇచ్చేందుకు నిర్ధిష్టమైన విధానాన్ని పాటించకపోవడం విమర్శలకు కారణమౌతోంది. సరైన పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలకు బిల్లులు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎయిడెడ్ టీచర్లకు, బోధనేతర సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు రూ.100 కోట్లు మంజూరుకావాల్సి ఉందని అంచనా. బాబు ‘సంక్రాంతి చంద్రన్న కానుక’ పై చూపే శ్రద్ధ తమపై చూపడంలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సవతి ప్రేమ...
ఎయిడెడ్‌పాఠశాలల పట్ల ప్రభుత్వం చూపుతున్న సవతి ప్రేమ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వ, జెడ్పీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం అందించే లబ్ధి వీరికి చేరదు. జీతాలపై నియంత్రణ ఉండడంతో వీరికి నెలనెలా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు, హెల్త్‌కార్డులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ అందజేస్తూ జీవోలు విడుదలయ్యాయి. అయితే ఎయిడెడ్ సిబ్బందికి ఇంతవరకు వరకు జీఓలు అందలేదు. రిటైర్డ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేదు.
ఉపాధ్యాయ సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రకంగా, ఎయిడెడ్ ఉద్యోగులకు ఒక రకం గా లబ్ధి అందడంపై చాలాకాలంగా ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నాసమస్యలు తీరే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 57 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ జూన్‌లో టీడీపీ ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. కానీ ఎయిడెడ్ సిబ్బందికి ఆ జీఓ విడుదల కాలేదు. దీంతో జూన్‌లో రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు అటు పింఛన్, ఇటు జీతం రాక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఉద్యోగాల్లో కొనసాగాలనే ఉత్తర్వులు కూడా అందకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి.
పండగ పూట పస్తే
Published Tue, Jan 13 2015 2:03 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
Advertisement
Advertisement