భద్రాచలం, న్యూస్‌లైన్: ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరందించేందుకు కేంద్రమంత్రి పోరిక బలరామ్‌నాయక్ మంజూరు చేసిన ఎంపీ ల్యాడ్స్ నిధులు వృథాగా మారాయి. ఆయన గెలిచిన తరువాత మొదటిసారిగా భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాల్లో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.30 లక్షలు కేటాయించారు. విద్యార్థులకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో వీటిని గిరిజన విద్యాసంస్థల్లో కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రాచలం నియోజకవర్గంలోని కొత్తూరునారాయణపురం ఆశ్రమ పాఠశాల, పట్టణంలోని గురుకుల బాలికల పాఠశాలతో పాటు ఏరియా ఆస్పత్రిలో ఈ ప్లాంట్లు నిర్మించారు. అలాగే పురుషోత్తపట్నం, ఇల్లెందు నియోజకవర్గం బయ్యారంలో కూడా ఏర్పాటు చేశారు.
ఒక్కోచోట రూ. 6 లక్షల వ్యయంతో వీటిని చేపట్టి విద్యార్థులకు, ఆయా గ్రామాల ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించారు. అయితే పర్యవేక్షణ లోపం, నిధుల ఖర్చుపై ఎంపీ అనుచరుల అజమాయిషీ కారణంగా వాటర్ ప్లాంట్ల ఏర్పాటు పనులు సవ్యంగా ముందుకు సాగలేదనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. కాగా, మూడేళ్ల క్రితం నిర్మించిన వాటర్ ప్లాంట్లు మూణ్నాళ్లకే మూలన పడ్డాయి. పురుషోత్తపట్నం, భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్లాంట్ల నుంచి ఇప్పటి వరకూ చుక్క నీరు రాలేదు. పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్లాంటు పనులు అస్తవ్యస్తంగా సాగడంతో అది అలంకార ప్రాయంగానే మిగిలింది. ఏరియా ఆస్పత్రిలోని ఐడీహెచ్ వార్డుకు ఓ మూలన ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ నిర్వహణ గురించి పట్టించుకోక పోవటంతో రోగులకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. మిగతా చోట్ల కూడా తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.
నిధులు కాజేసే ప్రయత్నం...
పరిశుభ్రమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఎంపీ నిధులు విడుదల చేసినప్పటికీ ఆయన అనుచరులుగా పెత్తనం చెలాయించే కొందరు నాయకులు వీటి ఖర్చుపై అజమాయిషీ చేయటంతోనే సమస్య ఉత్పన్నమయిందనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో ప్లాంట్ ఏర్పాటుకు రూ.6 లక్షలు వెచ్చించాల్సి ఉంది. కానీ దీనిలో కొంత మొత్తంలోనే డబ్బు వెచ్చించారని, పనులు పూర్తి చేయకుండానే నిధులు కాజేసే ప్రయత్నం చేశారని, దీనికి సదరు పర్యవేక్షణాధికారులు అడ్డుపడటంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని సమాచారం. రూ. 6 లక్షలు విడుద లైన పనులకు ఒక్కో చోట రూ.3 లక్షల వరకే వెచ్చించిగా, మిగతా నిధులు ఖర్చు కాకుండానే మిగిలిపోయాయి. వాస్తవంగా వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు కొత్తగా బోరు నిర్మించి, దాని ద్వారా పైపులైన్ కనె క్షన్ ఏర్పాటు చేసి ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనువుగా ఉన్న చోట షెడ్డు నిర్మించి కొంతకాలం దాని పర్యవేక్షణ బాధ్యతను చూడాలి. ఆ తర్వాత ఆయా గ్రామ పంచాయితీ లేదా ఆశ్రమ పాఠశాలల నిర్వాహకులకు అప్పగించాలి. పురుషోత్తపట్నం వంటి చోట్ల గతంలోనే తీసిన బోరుకు మోటార్ అమర్చి, షెడ్డు నిర్మించకుండానే తూతూ మంత్రంగా పనులు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. షెడ్డుకు బదులుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో దీన్ని అమర్చి, పర్యవేక్షణపై దృష్టి సారించకపోవటంతో వాటర్ ప్లాంటు నిరుపయోగంగా మారింది.
పథకాల పునరుద్ధరణపై శ్రద్ధ ఏదీ..?
ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల పనులు అసంపూర్తిగా వదిలేసిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వాటిని వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదు. పనులు జరిగి రెండేళ్లు కావస్తున్నప్పటికీ మిగిలిన నిధులను వెచ్చించి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించకపోవ టంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్లు పనిచేయలేదని తెలుసుకున్న మంత్రి బలరామ్‌నాయక్ వీటి పర్యవేక్షణ అధికారులను తీవ్రంగానే మందలించినట్లు తెలిసింది. అయినప్పటికీ వారిలో చలనం లేకపోవటంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పటం లేదు. మంచి ఆశయంతో చేపట్టిన ఈ పథ కం లక్ష్యం నెరవేరకపోగా, నిధుల ఖర్చుకు ప్రతిరూపాలుగా ఆయా చోట్ల పరికరాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి మినరల్ వాటర్ ప్లాంట్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
నిధులున్నా కన్నీరే..!
Published Tue, Dec 24 2013 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement
Advertisement