ప్రతి పోలీసు రక్తదాత కావాలి
కడప అర్బన్ :
ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి పోలీసు రక్తదాత కావాలని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ తెలిపారు. పోలీసు అమర వీరుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రిమ్స్ వైద్యుల సహకారంతో పోలీసు మినీ కల్యాణ మండపం లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాలను స్మరించుకునేందుకు ప్రతి ఏడాది అక్టోబరులో అమర వీరుల దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ వారోత్సవాల ప్రారంభం సందర్భంగా పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి పోలీసు సమాజానికి ఉపయోగపడేలా విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ విజయ్‌కుమార్, డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, సీఐలు శ్రీనివాసులు, రాజగోపాల్‌రెడ్డి, మహబూబ్‌బాష, సదాశివయ్య, ఆర్‌ఐ హరికృష్ణ, ఎస్‌ఐలు, పోలీసు స్బిబంది, రిమ్స్ బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్లో అవగాహన పెరగాలి
ప్రజల్లో పోలీసుస్టేషన్, అందులోని కార్యకలాపాలపై అవగాహన పెరగాలని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఏవీజీ విజయ్‌కుమార్ తెలిపారు. పోలీసు అమరవీరుల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా బుధవారం కడప వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎదురుగా ఆర్మ్‌డ్ రిజర్వుడు పోలీసుల ఆధ్వర్యంలో వివిధ రకాల పరికరాలను, ఆయుధాలను ‘ఓపెన్ హౌస్’గా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పోలీసుపాత్రపై ప్రజల్లో అవగవాహన పెంచేందుకు అమరవీరుల దినోత్సవ వారోత్సవాల్లో క్లూస్‌టీం, ఆర్మ్‌డ్ రిజర్వుడ్ పోలీసులు పరికరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఓపెన్ హౌస్‌లో ఏర్పాటు చేసిన పరికరాలు పలువురిని ఆకట్టుకున్నారుు.