నేడు ఎంసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఫలితాలు ఈనెల 9న సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విడుదల చేస్తారని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణరావు తెలిపారు. మాసాబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో విడుదల చేస్తామని వెల్లడించారు. మే 22న జరిగిన ఈ పరీక్షకు 3,73,286 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో 2,66,895 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 1,06,391 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రాథమిక కీని గత నెల 24న విడుదల చేసి 31 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. అయితే ఈసారి కేవలం 20 లోపే అభ్యంతరాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
ఇక సోమవారం విడుదల చేసే ఫలితాల్లో విద్యార్థులు ఎంసెట్‌లో సాధించిన మార్కులు, ఇంటర్మీడియెట్ మార్కులకు వచ్చిన వెయిటేజీ వివరాలను కలిపి ర్యాంకులను వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఫలితాలను www.sakshieducation.com, www.apeamcet.org వెబ్‌సైట్లతో పాటు ఇతర ప్రైవేటు వెబ్‌సైట్లలో పొందవచ్చు. అలాగే ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. కేపిటల్ లెటర్స్‌తో ఈఏఎంసీఈటీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నంబరు వేసి 53346 (బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి) నంబరుకు, ఇతర మొబైల్ వినియోగదారులు 54242 నంబరుకు ఎస్‌ఎంఎస్ పంపించి ర్యాంకు వివరాలు పొందవచ్చు.