భయకంపం
రెక్టార్ స్కేల్‌పై 5 పాయింట్లు!
నగరంలో పలుచోట్ల ప్రకంపనలు
రోడ్లపైకి జనం పరుగులు
ఎలాంటి నష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న వైనం
విజయవాడ : నేపాల్‌లో మంగళవారం మళ్లీ భూకంపం వచ్చింది. ఆ ప్రభావం మన జిల్లాపై చూపింది. మధ్యాహ్నం 12.53 గంటల ప్రాంతంలో నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇటీవల నేపాల్‌లో జరిగిన భూకంపంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన విషయం ప్రజలు మరిచిపోకముందే మళ్లీ భూమి కంపించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. వెంటనే రోడ్లపైకి పరుగులు తీశారు. అపార్టుమెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో ఉన్న వారు కిందికి దిగారు. రెక్టార్ స్కేల్‌పై 5 పాయింట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
నవరంగ్ థియేటర్ వద్ద..
గవర్నరుపేటలోని నవరంగ్ థియేటర్ వద్ద భూప్రకంపం ప్రభావం ఎక్కువగా కనిపించింది. వాహనాల స్పేర్ పార్టులు అమ్మే దుకాణాల్లో సామగ్రి కిందపడిపోవడంతోపాటు బల్లలు, కుర్చీలు కదిలాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బందరురోడ్డులో మిడ్ సిటీ హోటల్ వద్ద కూడా భూమి క ంపించడంతో హోటల్‌లోని వారు రోడ్లపైకి పరుగులు తీశారు. కృష్ణలంక, బెంజిసర్కిల్, గురునానక్ కాలనీ, పటమటలంక , ఆటోనగర్‌లోనూ భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గొల్లపూడి, భవానీపురం, సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతాల్లోనూ అక్కడక్కడా భూమి కంపించింది. టీవీల్లో ఈ సమాచారం చూసిన బయటి ప్రాంతాలవారు నగరవాసులను ఫోన్లలో పరామర్శించారు. భూకంపం వల్ల ఆస్తినష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదని అర్బన్ తహశీల్దార్ శివరావు ‘సాక్షి’కి తెలిపారు.
వణికిన జిల్లా..
ఠబందరు, అవనిగడ్డ, పామర్రు, పెడన, ఉయ్యూరు, కైకలూరు తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.
ఠఅవనిగడ్డ మండలం రామచంద్రాపురం గ్రామం, కోడూరు మండలం మాచవరం గ్రామంలోనూ కొన్ని ఇళ్లలో సామానులు కింద పడిపోయాయని స్థానికులు చెప్పారు.
పామర్రు స్టేట్ బ్యాంక్‌లో సొమ్ము చెల్లించడానికి క్యూలో ఉన్నవారు భూమి కంపిస్తున్నట్లు గుర్తించి బయటకు పరుగులు తీశారు.
ఉయ్యూరు సాయిమహల్ సెంటర్‌లో భూమి స్వల్పంగా కంపించింది.
కలిదిండి మండలం పెదలంకలో భూమి కంపించిందని గ్రామస్తులు తెలిపారు.
గతంలో ఇలా..
జిల్లాలో భూమి కంపించడం ఇది తొలిసారి కాదు. గతంలో కృష్ణలంక మెట్లబజార్‌లో కృష్ణానది ఒడ్డున భూమి స్వల్పంగా కంపించింది. నది ఒడ్డున ఇళ్లలో ఫ్యాన్లు స్విచ్ ఆన్ చేయకుండా తిరగడం, తలుపులు కొట్టుకోవడం జరిగాయి. దీంతో అప్పటి మునిసిపల్ కమిషనర్ ఉషారాణి కాల్వ గట్లవాసుల్ని అప్రమత్తం చేశారు. రెండేళ్ల కిందట నగరంతోపాటు నందిగామ, కంచికచర్ల తదితర మండలాల్లో ఉదయం భూమి కంపించింది. దీంతో భయభ్రాంతులైన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. మధురానగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలు రాత్రిపూట రోడ్లపైనే నిద్రించారు. గత ఏడాది నందిగామలో స్వల్పంగా భూమి కంపించింది.