ఏపీ సీఎస్‌ పునేఠపై సీఈసీ వేటు | EC Serious On AP CS Anil Chandra Punetha | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎస్‌ పునేఠపై సీఈసీ వేటు

Published Sat, Apr 6 2019 1:48 AM | Last Updated on Sat, Apr 6 2019 1:48 AM

EC Serious On AP CS Anil Chandra Punetha - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ కన్నెర్ర చేసింది. తాము తొలగించిన ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావును తిరిగి అదే పోస్టులో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా సీఎం ఒత్తిళ్ళకు లొంగిపోయి వ్యవహరించడాన్ని తప్పుబట్టింది. వెంకటేశ్వరరావును వెనకేసుకొస్తూ, ఈసీ చర్యను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టుకెళ్లడాన్ని సీరియస్‌గా తీసుకుంది. సీఎస్‌గా పునేఠను తప్పించింది. అంతేకాదు ఎన్నికల విధులకు ఆయన్ను దూరంగా ఉంచాలంటూ ఆదేశించింది. 1983 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్‌వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు..  క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పునేఠకు తదుపరి పోస్టింగ్‌పై తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని జీవోలో పేర్కొన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం గతంలో వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో తదితర కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఒత్తిళ్లకు లొంగినందుకే..
ఇంటెలిజెన్స్‌ డీజీ.. ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ సీఈసీ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా జారీ చేసిన జీవోను, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిళ్లకు లొంగిపోయి రద్దు చేయడం.. పునేఠ మెడకు చుట్టుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ఏజెంటుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తర్వాత వెంకటేశ్వరరావును తిరిగి అదే పదవిలో నియమిస్తూ పునేఠ మరో జీవో జారీ చేశారు. అంతేకాదు ఎన్నికల సంఘం ఉత్తర్వులను ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ పరిణామాలన్నిటినీ కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఒక అధికారిని వెనుకేసుకు రావడానికి గల కారణాలపై ఆరా తీసినట్లు తెలిసింది.

ఏబీ వెంకటేశ్వరరావు పూర్తిగా తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఆయన్ను ఆ పదవి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించకుండా కొనసాగించుకోవాలని భావించిన ఏపీ ముఖ్యమంత్రి.. ఆ మేరకు ఒత్తిడి తెచ్చి సీఎస్‌తో జీవోలు జారీ చేయించారని నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఈసీ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ జీవో ఇచ్చిన నేపథ్యంలో పునేఠను పిలిపించిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ వివరణ కోరింది. ఏబీని బదిలీ చేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటి? ఆయనకు అనుకూలంగా ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం వెనుక మతలబు ఏమిటి? తదితర అంశాలపై ఇంటెలిజెన్స్‌ నుంచి నివేదికలు తెప్పించుకోవడంతో పాటు పునేఠను కూడా వాకబు చేసింది. సీఎం ఒత్తిడికి లొంగిపోయి తమ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిని సీఎస్‌ స్థానంలో ఉంచితే కమిషన్‌ చులకనవుతుందని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉండదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే పునేఠపై చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏకపక్ష నిర్ణయంపై ఆగ్రహం
ఇంటెలిజెన్స్‌ డీజీకి ఎన్నికల విధులతో సంబంధం ఉండదని, ఆయన సీఈసీ పరిధిలోకి రారంటూ డీజీపీ పంపిన ఫైల్‌ మేరకు సీఎస్‌ పునేఠ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ‘ఎవరు ఎన్నికల పరిధిలోకి వస్తారో? ఎవరు ఎన్నికల నిర్వహణ విధుల పరిధిలోకి రారో మాకు తెలియదా? తెలియకుండానే ఉత్తర్వులు జారీ చేయడానికి మాకేమైనా చట్టం తెలియదా? మీరు చెబితే మేం తెలుసుకోవాలా? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను తప్పించి ఏకే మహంతిని డీజీపీగా నియమించిన విషయం పునేఠకు తెలియదా? తెలిసీ కమిషన్‌ నిర్ణయాన్ని ఉల్లంఘించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సీఎస్‌ పదవి అంటే సీఎం అడుగులకు మడుగులొత్తుతూ పక్షపాతంగా వ్యవహరించడమా?..’ అన్నరీతిలో కమిషన్‌ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

సీఎం రాజకీయ స్వార్థానికి పునేఠ బలి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి రాజకీయ స్వార్థానికి పునేఠ బలయ్యారని ఐఏఎస్‌ అధికారులు అంటున్నారు. ‘కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలు వెంకటరత్నం, రాహుల్‌దేవ్‌ శర్మలను బదిలీ చేస్తూ పునేఠ జీవో నంబరు 716 జారీ చేశారు. తర్వాత సీఎం ఒత్తిళ్లతో ఇంటెలిజెన్స్‌ డీజీ ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి రారంటూ జీవో నంబరు 721 జారీ చేశారు. ఆ వెంటనే డీజీ వెంకటేశ్వరరావు బదిలీ ఉత్తర్వులను రద్దుచేస్తూ.. డీజీ ఇంటెలిజెన్స్‌గానే కొనసాగుతారంటూ జీవో 720 జారీ చేశారు. సీఎం ఒత్తిడి చేసినప్పుడు నిక్కచ్చిగా వ్యవహరించకుండా లొంగిపోయి తప్పుచేయడంవల్లే పునేఠ పదవి పోయింది. నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరించకపోతే ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు రావచ్చు...’ అని పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వ్యాఖ్యానించారు.

ఈసీకి ఏపీ డీజీపీ వివరణ
వెంకటేశ్వరరావు బదిలీ రద్దు వ్యవహారంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలోనే.. మొదట పునేఠాను పిలిచి వివరణ కోరిన ఈసీ తర్వాత డీజీపీని పిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే డీజీపీ ఢిల్లీలో ఈసీని కలిసే ముందే ఆయన్ను ఏసీబీ డీజీ విధుల నుంచి తప్పిస్తూ పునేఠా ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. కాగా గురువారం ఢిల్లీ వెళ్లిన డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘం ముంగిట వివరణ ఇచ్చారు. అయితే ఈసీ ఫుల్‌ బెంచ్‌ లేదని, ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు లేకపోవడంతో శుక్రవారం రావాలని డీజీపీకి ఈసీ ఆదేశించింది. దీంతో గురువారం రాత్రి ఢిల్లీలోనే ఉండిపోయిన ఆయన శుక్రవారం మరోమారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు.

సీఈసీ కమిషనర్లు అశోక్‌ లావాస్, సుశీల్‌ చంద్రలను కలిసి వివరణ ఇచ్చారు.  డీజీపీగాను, ఏసీబీ డీజీగాను రెండు విధులు నిర్వహించిన మీరు ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా జీవో ఇవ్వడం కోసం సీఎస్‌పై ఒత్తిడి తెచ్చి ఎందుకు నోట్‌ఫైల్‌ ఇవ్వాల్సి వచ్చిందని వారు డీజీపీని ప్రశ్నించినట్టు సమాచారం. ఏబీ వెంకటేశ్వరరావును తప్పించినప్పటికీ ఆయన అనధికారికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారనే ఫిర్యాదులపై కూడా డీజీపీని ఈసీ వివరణ కోరినట్టు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement