=నడి సంద్రంలో రక్షణ గాలిలో దీపమే..
=సమాచార సాధనాలు నామమాత్రం
=ఐకమత్యంతో నెట్టుకొస్తున్న మత్స్యకారులు
వేటకెళ్లిన మత్స్యకారులు నడి సంద్రంలో ఉండగా ఉప్పెన ముంచుకొస్తుంది.. వారి జాడ తెలుసుకోవాలి.. సమాచారం అందించాలి.. ఎలా? సాగర మధ్యంలో గంగపుత్రులు దిశ, దారి తెలుసుకోవాలి.. తీరానికి కబురందించాలి, కనీసం సమీపంలో ఉన్న బోటు వారితోనైనా మాట్లాడి సాయం తీసుకోవాలి.. ఎలా? మర పడవల్లో వీహెచ్‌ఎఫ్ రేడియో, జీపీఎస్ వంటి సాధనాలను సమకూరిస్తే అది సాధ్యమవుతుంది. ఆపదలో ఆదుకోవడం వీలవుతుంది. కనీసం సగం బోట్లకు కూడా ఈ సదుపాయాలు సమకూరలేదు. ప్రభుత్వ పెద్దల్లో కరువైన చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
విశాఖపట్నం, న్యూస్‌లైన్: మత్స్యకారుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. చేపలవేట మృత్యువుతో చెలగాటంగా తయారైంది. సాగరంలోకి వెళితే తిరిగి వస్తామనే భరోసా లేకుండా పోయింది. ప్రభుత్వం గోరంత సాయంతో చేతులు దులిపేసుకుంది. దీంతో జాలర్ల బతుకులు నడి సంద్రంలో చుక్కాని లేని నావల్లా తయారయ్యాయి. విశాఖ మత్స్యకారులు ఐకమత్యంతో కొంతమేర నెట్టుకొస్తున్నారు. అధికారులు అందించిన అరకొర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, ఒకరికొకరు సాయపడుతూ కొంతమేర సురక్షితంగా ఒడ్డున పడగలుగుతున్నారు. సబ్సిడీపై అందించే సాంకేతిక పరికరాలను ప్రభుత్వం సరిపడా సరఫరా చేస్తే సంద్రంలో అద్భుతాలు సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.
జిల్లాలో 132 కిలోమీటర్ల మేర తీరం ఉంది. 62 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు 750 మరబోట్లు, 1500 మోటారు బోట్లు, రెండు వేల సంప్రదాయ తెప్పలు చేపల వేట సాగిస్తున్నాయి. సుమారు 40 వేల కుటుంబాలు చేపలవేటే జీవనాధారంగా బతుకుతున్నాయి. పరోక్షంగా మరో 40 వేల కుటుంబాలు దీనిపై ఆధారపడ్డాయి. ఇన్ని వేల మందికి జీవనోపాధి చూపిస్తూ, కోట్లాది రూపాయల విదేశీ ఆదాయం ఆర్జించి పెడుతోన్న మత్స్య పరిశ్రమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఆరేడేళ్ల కిందట కొన్ని బోట్లకు జీపీఎస్, వీహెచ్‌ఎఫ్ రేడియా వంటి పరికరాలు అందించి చేతులు దులిపేసుకుంది.
గ్లోబల్ పొజిషన్ సిస్టం (జీపీఎస్) సముద్రంలో దిశ, దారిని తెలియజేసే పరికరం. దీని సాయంతో మత్స్యకారులు తాము ఎక్కడున్నాము, ఎలా వెళితే గమ్యం చేరుకుంటాము తదితర వివరాలు తెలుసుకోచ్చు. వీహెచ్‌ఎఫ్ రేడియో ద్వారా సముద్రం మధ్య నుంచి తీరానికి, బోటు నుంచి మరో బోటుకు మాట్లాడుకునే సౌకర్యం కలుగుతుంది. తమ సమాచారాన్ని చేరవేయడానికి, సాయం పొందడానికి ఇది ఎంతో ఉపయుక్తం. సెల్‌ఫోన్లు కూడా ఇప్పుడు మత్స్యకారులకు ఉపయోగపడుతున్నాయి. అయితే అవి 30 నుంచి 50 నాటికల్ మైళ్ల వరకు మాత్రమే పనిచేస్తాయి. మొత్తం 750 మరబోట్లు ఉండగా సగానికి పైగా పడవలకు ఈ సౌకర్యాలు లేవు.
సాధారణంగా విశాఖలో ఐదు నుంచి పది వరకు బోట్లు కలిసి చేపలవేట సాగిస్తాయి. అదే వీరికి వరంగా మారింది. తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో తీరం నుంచి సమాచారం అందకపోయినా.. వీహెచ్‌ఎఫ్ సెట్లు, సెల్‌ఫోన్లతో ఒక బోటు నుంచి ఇంకో బోటుకు సమాచారం అందిస్తారు. ఇటీవల వచ్చిన తుపానులో రెండు మరబోట్లు ప్రమాదంలో చిక్కుకుపోతే ఇదే విధంగా సమాచారం అందించి, సురక్షితంగా ఒడ్డుకు రప్పించగలిగారు. అదే సమయంలో గాలుల ఉధృతికి ఒక మరబోటు తిర గబడి సంద్రంలో మునిగి, 8 మంది మత్స్యకారులు ప్రమాదంలో చిక్కుకుపోయారు. దగ్గరలో వేట సాగిస్తున్న మరో మరబోటుకు చెందిన మత్స్యకారులకు ఈ సమాచారం అందడంతో వారిని కాపాడారు. ప్రభుత్వ సాయం అంతంత మాత్రమే అయినా ప్రాణాలు ఎలా రక్షించుకోవాలో సంద్రమే నేర్పిందని మత్స్యకారులు చెబుతున్నారు.
ఆటుపోటు జీవితం..ఎదురీతే ఆయుధం..
Published Fri, Dec 27 2013 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement
Advertisement