ఎన్నిక.. ధైర్యం చాలక!
కార్పొరేషన్ ఎన్నికలకు జంకుతున్న అధికార పార్టీ
వ్యతిరేక ఫలితాలు తప్పవని అంతర్గత నివేదికలు?
ఒక్క అభివృద్ధి పనీ చేపట్టకపోవడంపై వ్యతిరేకత
అంతర్గత కుమ్ములాటలతో సతమతం
అమలుకు నోచుకోని సీఎం హామీలు
కర్నూలు:కర్నూలు కార్పొరేషన్‌కు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని ప్రభుత్వ వర్గాల అంతర్గత నివేదికలు వెల్లడిస్తున్నాయా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని ప్రజలు భావిస్తున్నారా? రాయలసీమకు అన్యాయం జరుగుతోందనే అభిప్రాయం నగర వాసుల్లో వ్యక్తమవుతోందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. ఈ కారణాల వల్లే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలో ఇతర కార్పొరేషన్లకూ ఎన్నికలు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఇక్కడ మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు కాలేదంటూ ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటం వెనుక అసలు కారణం ఓటమి భయమేనని తెలుస్తోంది. 2010 ఆగస్టు నాటితో కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం పూర్తి కాగా.. ఐదేళ్లు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోవడం గమనార్హం.
అన్నింటిలోనూ అన్యాయమే..
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అభివృద్ధి మొత్తం ఒకేచోట కేంద్రీకృతమవుతోందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. దీనికితోడు రాయలసీమకు అన్యాయం జరుగుతోందనే భావన ఇక్కడి ప్రజల్లో బలపడుతోంది. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్క అభివృద్ధి పనీ ప్రారంభం కాకపోవడం ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకతకు దారితీసింది. మరోవైపు మొదటి స్మార్ట్ సిటీ జాబితాలో కర్నూలుకు స్థానం దక్కలేదు. మొదటి జాబితాలో కర్నూలుకు స్థానం దక్కుతుందని స్వయంగా సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. స్మార్ట్ సిటీ కాకుండా మెగాసిటీలంటూ సీఎం కొత్త పల్లవి అందుకున్నారు. వీటితో పాటు కర్నూలులో ఆగస్టు 15 సందర్భంగా సీఎం ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోలేదు. పై కారణాలతో ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత నెలకొంది.