ఎన్నికల ఎత్తులు డోలాయమానం
Published Tue, Feb 25 2014 3:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికల రాజకీయాల్లో కేంద్రమంత్రి కృపారాణి దూకుడు పెంచారు. తన వర్గ ప్రాబల్యం పెంచుకునేందుకు ఉపకరించేలా టిక్కెట్ల కేటాయింపు జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా నరసన్నపేట నియోజకవర్గంలో తన మాట నెగ్గితే చాలు.. జిల్లా అంతా దారిలోకి వచ్చేస్తుందని భావిస్తున్నారు. అందుకే కోండ్రు మురళీ వర్గీయుడిగా ఉన్న డోల జగన్‌కు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే శిమ్మ ప్రభాకరరావు కుటుంబంతో మంతనాలు సాగించిన ఆమె, తదుపరి వ్యూహాన్ని చకచకా అమలు చేస్తున్నారు. డోల జగన్‌ను నరసన్నపేట నుంచి తప్పించడం ద్వారా శిమ్మ కుటుంబానికి మార్గం సుగమం చేయాలన్నది ఆమె వ్యూహం. అందులో భాగంగా జగన్‌ను పాతపట్నం అభ్యర్థిగా ఖరారు చేయాలని ప్రతిపాదించారు. ఆమె తాజా ఎత్తుగడ కోండ్రు వర్గాన్ని విస్మయానికి గురిచేసింది. డోల జగన్‌ను ఆత్మరక్షణలో పడేసింది. జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కృపారాణి ద్విముఖ వ్యూహం
ద్విముఖ వ్యూహంతోనే డోల జగన్‌ను పాతపట్నం పంపించాలని కేంద్రమంత్రి ప్రతిపాదించారు. ఒకటి నరసన్నపేటలో ఆయన్ను అడ్డు తొలగించుకోవడం.. రెండు తనకు ఏమాత్రం పట్టులేని పాతపట్నంలో కొంతవరకైనా ఓట్లు సాధించడం. ఆ మేరకు అధిష్టానం ప్రతినిధుల వద్ద గట్టిగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన జగన్‌కు పాతపట్నం సరైన నియోజకవర్గమని, మరోవైపు నరసన్నపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అక్కడ వెలమ సామాజికవర్గమే గెలుస్తోందని వారికి చెప్పుకొచ్చారు. అందువల్ల డోలను నరసన్నపేటలో నిలబెట్టడం వల్ల పార్టీకి ప్రయోజనం ఉండదని చెప్పారు.
అదే సమయంలో వర్గ రాజకీయాల వల్లే అతన్ని వ్యతిరేకిస్తున్నాననే ముద్ర పడకుండా జాగ్రత్తపడ్డారు. తూర్పుకాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పాతపట్నానికి అదే వర్గానికి చెందిన జగన్ సరైన అభ్యర్థి అవుతారని చెప్పుకొచ్చారు. అలా చేస్తే నరసన్నపేటలో వెలమ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శిమ్మ ప్రభాకరరావు కుటుంబానికి టిక్కెట్ కేటాయించవచ్చన్నది ఆమె ఉద్దేశం. శిమ్మ ప్రభాకరరావు సతీమణి, మాజీ ఎంపీపీ ఉషారాణి పేరును కూడా కృపారాణి అధిష్టానానికి సూచించారు. తద్వారా కాంగ్రెస్ దాదాపుగా తుడుచుకుపెట్టుకుపోయిన నరసన్నపేటలో కొంతమేర ఓట్లు సాధించగలనని ఆమె విశ్వసిస్తున్నారు. అదే సమయంలో పాతపట్నంలోనూ కొంతవరకైనా కలసివస్తుందని భావిస్తున్నారు. అక్కడ డోల జగన్ గెలవకపోయినా ఎంపీగా తనకు కొన్ని ఓట్లు తెచ్చిపెడతారని ఆశిస్తున్నారు.
అధిష్టానం సానుకూలత
సామాజికవర్గాల కోణంలో కృపారాణి చేసిన ప్రతిపాదన పట్ల కాంగ్రెస్ అధిష్టానం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డోల జగన్‌కు సూచనప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం. దాంతో ఆయనలో గుబులు మొదలైంది. ఎందుకంటే నరసన్నపేట నియోజకవర్గంలో ఆయనకు భారీ బంధుగణం ఉంది. కానీ పాతపట్నం పూర్తిగా కొత్త. కనీసం పరిచయాలు కూడా లేవు. తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికే కృపారాణి ఈ ఎత్తుగడ వేశారని ఆయన తన సన్నిహితుల వద్ద ఆగ్రహంగా వ్యాఖ్యానిస్తున్నారు. తాను నమ్ముకున్న కోండ్రు మురళి కూడా ఈ విషయంలో సహకరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవిలను ఆశ్రయించాలని భావిస్తున్నారు. నరసన్నపేట విషయంలో కృపారాణి వ్యూహం జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరును సరికొత్త మలుపు తిప్పుతోంది.
Advertisement
Advertisement