విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): దేశ రాజకీయ చరిత్రలో అవినీతిని అంతమొందించాలనే నిర్ణయం తీసుకున్న సీఎం ఇప్పటివరకు ఎవ్వరూ లేరని, ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పం చరిత్రాత్మకమని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళం నగరంలో పార్టీ కార్యాలయంలో సోమవారం ఈమె మాట్లాడుతూ సీఎం జగన్ తొమ్మిదేళ్లపాటు నిర్విరామంగా కష్టపడి ప్రజలందరి సమస్యలు తెలుసుకుని అందుకు తగినట్లుగా నవరత్నాలు రూపొందించడంతో వైఎస్సార్‌సీసీకి పట్టం కట్టారన్నారు. అదేవిధంగా రాజకీయ చరిత్రలో 50శాతానికి పైగా ఓటింగ్ వేయించుకున్న ఘనత జగన్‌మోహన్‌రెడ్డికి తప్ప మరెవ్వరికి సాధ్యపడదన్నారు. చంద్రబాబు తాను సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆర్భాటం చేస్తూ రూ.30 కోట్లు ఖర్చు చేస్తే, జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం రూ.15లక్షలతో సాదాసీదాగా చేసుకోవడం ప్రజలందరిని ఆశ్చర్యానికి గురి చేందన్నారు. తొలి సంతకంతోనే వృద్ధులకు అంచెలంచెలుగా రూ.3 వేలు ఇవ్వడం, తొలి దశలోనే వికలాంగులకు రూ.3 వేలు ఇవ్వడం, డయాలసిస్ కిడ్నీ రోగులకు రూ.10 వేలు నిర్ణయంతో ఎంతోమందికి లబ్ధి చేకూరనుందన్నారు.
మద్యానికి బానిసై లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రూ.43,800 బెల్టుషాపుల రద్దుకు తీసుకున్న నిర్ణయం ఓ సంచలనమన్నారు. 4 లక్షల మంది వలంటీర్లను ఆగస్టు 15 కల్లా, గ్రామ సచివాలయాల్లో 1.6 లక్షల ఉద్యోగాలు గాంధీ జయంతి కల్లా నియమించి నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టాలన్నదే జగన్ సంకల్ప మన్నారు. చంద్రబాబులా ఓ పెద్ద పుస్తకాన్ని ఎన్నికల మేనిఫెస్టోగా ముద్రించి, దాన్ని కనీసం ప్రజలకు తెలియకుండానే వెబ్‌సైట్‌లో తొలగించారని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ప్రతిఒక్కరూ తమ జేబుల్లో నిత్యం ఉంచుకునేలా రెండు పేజీల మేనిఫెస్టో ప్రకటించారని, దీనిపై ప్రశ్నించే వెసులుబాటు కల్పిస్తామన్నారు. చంద్రబాబునాయుడు వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నాడని, అవే సీట్లు ఈ ఎన్నికల్లో టీడీపీకి మిగిలాయని ఎద్దేవా చేశారు. జిల్లాలో అఖండ విజయాన్ని సాధించిన 8 మంది ఎమ్మెల్యేలకు, మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అభినందన సభ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలకు విమానఖర్చులు, ప్రచారాలకు, సభలు, సమావేశాలకు లక్షల కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేసి రాష్ట్రాన్ని రూ.2.50లక్షల కోట్లు అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. దీంతో ఆ అప్పు ప్రతీ పౌరుడిపై రూ.60వేలు ఉందన్నారు. అంతేకాకుండా ఉద్యోగులు తమ జీతంలో దాచుకున్న జీపీఎఫ్ ఖాతా నుంచి రూ.60కోట్లు వాడేయడం దారుణమని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎన్ని ధనుంజయరావు, టీ కామేశ్వరి, శిమ్మ రాజశేఖర్, తంగుడు నాగేశ్వరరావు, కోరాడ రమేష్, పైడి చందు, పైడి రవి, జీ కేశవరావు, గుంట జ్వోతి, పీ సుగుణారెడ్డి, పైడి అమ్మినాయుడు, సురంగి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment