సాక్షి, శ్రీకాకుళం: గత ఐదేళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు ఇసుకపై చేసిందేంటి?, టీడీపీ హయాంలో ఇసుకపై వందసార్లు క్యాబినెట్ సమావేశాలలో చర్చించామని, ఇసుకపై కొత్త పాలసీని ప్రవేశపెట్టామని చెప్పి.. ఇతర రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా తరలించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ఎలాగోలా బురద జల్లాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని, ఏం దొరక్క చివరికి ఇసుకపై పడ్డారని అమె మండిపడ్డారు. వరదల వలన నదులు ఉధృతంగా ప్రవహించి.. ఇసుక తవ్వకాలకు ఆటంకం ఏర్పడటంతో కొంత ఇసుక కొరత వాస్తవమని తెలిపారు. ఇసుక మూలంగానే అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో ప్రజలు కుర్చోబెట్టారని, చంద్రబాబు ఏం ముఖం పెట్టుకుని ఇప్పుడు దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
గత ఐదేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లాలోని నది భూగర్భాలలో ఇసుక తవ్వేసి.. రాబందుల్లా దోచేయలేదా అని కృపారాణి మండిపడ్డారు. అక్రమ ఇసుక రవాణాని అడ్డుకోవడానికే ఏపీఎన్‌ఎండీసీ ద్వారా తవ్వకాలు చేసి.. స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఇసుక అందాలని సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆమె వెల్లడించారు. ఇక భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మరికొద్ది రోజులలో స్టాక్ పాయింట్లు పెంచి ఇసుక మరింత అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. కాగా ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మోద్దని, కావాలనే భవన నిర్మాణ కార్మికులను రెచ్చగొట్టె కార్యక్రమాలు చేస్తున్నారని కిల్లి కృపారాణి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment