జనంపై విద్యుత్ చార్జీల మోత! | Electric charges lift it! | Sakshi
Sakshi News home page

జనంపై విద్యుత్ చార్జీల మోత!

Published Fri, Feb 6 2015 2:25 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

జనంపై విద్యుత్ చార్జీల మోత! - Sakshi

జనంపై విద్యుత్ చార్జీల మోత!

  • భారం రూ.1,261 కోట్లు
  •  ఏపీఈఆర్‌సీకి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించిన విద్యుత్ పంపిణీ సంస్థలు
  •  ఈఆర్‌సీ ఆమోదమే తరువాయి..
  •  ఏప్రిల్ నుంచే అమలు!
  • సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యుత్ షాక్ ఇచ్చింది. వారిపై భారీ ఎత్తున విద్యుత్ చార్జీల భారాన్ని వేసేందుకు సిద్ధపడింది. గృహ వినియోగదారులు మొదలుకుని పరిశ్రమల వరకూ అన్నింటిపైనా చార్జీల మోత మోగించింది. పేదలపై భారం పడనివ్వబోమని పైకి చెబుతూనే.. డిమాండ్ చార్జీల పేరుతో దొంగదెబ్బ సైతం తీసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు గురువారం ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ)కు సమర్పించాయి. వీటికి కమిషన్ అనుమతినివ్వడమే ఆలస్యం.

    ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెంచిన విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రజలు మోయకతప్పదు. ఈ మొత్తం విలువ రూ.1,261 కోట్లు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరేళ్లపాలనలో ఏనాడూ ఒక్కపైసా విద్యుత్ చార్జీలు పెరగలేదు. ప్రస్తుతం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన ఎనిమిది నెలలకే జనం జేబుకు చిల్లు పెట్టడం విశేషం. వంద యూనిట్లలోపు గృహ వినియోగదారులపై కనికరం చూపించామని చెబుతున్న సర్కారు, ఆపైబడిన వినియోగదారులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. వందకు ఒక్క యూనిట్ దాటినా, 50 యూనిట్ల నుంచే పెరిగిన భారాన్ని మీద వేసే పథక రచన చేసింది.

    మధ్యతరగతి, వాణిజ్య వర్గాలు, పారిశ్రామిక, చేతివృత్తులను చావుదెబ్బ కొట్టింది. చేనేతలను ఉద్ధరిస్తానని చెప్పిన సర్కారు.. మరమగ్గాలకు చార్జీల పెంపును బహుమతిగా ఇచ్చింది. పెనుభారాన్ని వేసి చేనేత చితికిపోయేలా చేసింది. కాటేజీ ఇండస్ట్రీపై ఏకంగా కోటి రూపాయలు దండుకోవాలనుకుంది. నిధుల కోతతో అల్లాడుతున్న పంచాయతీలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. వీధి దీపాలకయ్యే ఖర్చును అమాంతం రూ.25 కోట్లకు పెంచింది.

    పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న ఔత్సాహికులను తీవ్రంగా నిరాశ పరిచింది. నష్టాల ఊబిలో ఉన్న పరిశ్రమలపై చార్జీల భారం మోపి భయపెట్టింది. ఈ రంగం నుంచి ఏకంగా రూ.645 కోట్లు దండుకోవాలని నిర్ణయించింది. వాణిజ్య వర్గాల వెన్నువిరిచేలా రూ.71 కోట్ల భారాన్ని మోపింది. వీటిపై వేసిన భారం ఏకంగా రూ.81 కోట్లు.
     
    గృహ వినియోగదారులపై పెను భారం..

    100 యూనిట్లు దాటిన వినియోగదారులు(ఎల్‌టీ-సీ, డీ కేటగిరీలు) దాదాపు 25 లక్షల మందిపై విద్యుత్ చార్జీల భారం పడింది. ప్రతిపాదిత చార్జీలనే అమలు చేస్తే గృహ వినియోగదారులు మరో రూ.144 కోట్లు చెల్లించాలి. ఎప్పుడో కాలం చెల్లిన ఎఫ్‌ఎస్‌ఏలనూ పేరు మార్చి ట్రూ-అప్ చార్జీలుగా వసూలు చేయాలని నిర్ణయించింది. దీని పరిధిలోకి 99 లక్షలమంది వస్తారు. యూనిట్‌కు 16 పైసలతో మొదలైన పెంపు, కేటగిరీ వారీగా పెరుగుతూ వచ్చింది.

    500 వందల యూనిట్ల పైబడి వాడితే, ఏకంగా రూ.300 వరకూ అదనంగా బిల్లు చేతికొచ్చే వీలుంది. విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ, అవసర నివేదికలను మాత్రమే తమకు సమర్పించాయని ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్ తెలిపారు. దీనిపై ఈ నెల 23, 24న విశాఖపట్నంలో, 25న కాకినాడ, వచ్చేనెల 4న హైదరాబాద్‌లో విచారణ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఈ నెల 26న గుంటూరు, 27, 28న తిరుపతిలో విచారణ చేపడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement