బడుగు జీవికి భారీ షాక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మరోసారి భారీ విద్యుత్ షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా ఈసారి నిరుపేదలపై పెను భారం మోపనుంది. 0-50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించేవారికి యూనిట్‌కు ఏకంగా 55 పైసల చొప్పున చార్జీలు పెంచనుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.5 వేల కోట్ల మేరకు చార్జీల వడ్డనకు విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రతిపాదనలను డిస్కంలు మంగళవారం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి సమర్పించనున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ తమకు రూ.46,248 కోట్ల మేరకు ఆదాయం అవసరం అవుతుందని డిస్కంలు అంచనా వేశాయి.
ఇందులో ప్రస్తుత విద్యుత్ చార్జీల ప్రకారం రూ.35,088 కోట్ల ఆదాయం వస్తుందని తాజా ప్రతిపాదనల్లో పేర్కొన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అంటే రూ.11,160 కోట్ల మేరకు లోటు ఏర్పడుతోంది. దీనికితోడు ఈ ఆర్థిక సంవత్సరంలో అదనపు విద్యుత్ కొనుగోలుకు అరుున ఖర్చు రూ.1,223 కోట్లు. తద్వారా మొత్తం లోటు రూ.12,383 కోట్లకు పెరిగిందని డిస్కంలు వివరించాయి. అరుుతే సుమారు రూ.7,383 కోట్ల మేరకు సబ్సిడీ రూపంలో భరించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.5 వేల కోట్ల మొతాన్ని జనాన్ని బాది వసూలు చేసేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనలపై జనవరిలో ఈఆర్‌సీ బహిరంగ విచారణ చేపట్టే అవకాశం ఉంది. అనంతరం మార్చి మూడో వారంలో ఈఆర్‌సీ ఆదేశాలు జారీ చేయనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి వస్తాయి.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం 2010-11తో మొదలుకుని 2013-14 వరకు వరుసగా నాలుగేళ్లపాటు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచింది. మొదటి సంవత్సరం గృహ వినియోగదారులకు చార్జీల పెంపునకు సాహసించని ప్రభుత్వం... ఆ తర్వాత మూడేళ్లూ 200 యూనిట్లకు పైబడిన వినియోగదారులందరికీ చార్జీలను పెంచింది.
ఈసారి మరో అడుగు ముందుకేసి 0-50 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు కూడా చార్జీలు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 0-50 యూనిట్ల వారికి రూ. 1.45 చార్జీ ఉండగా.. దీనిని ఏకంగా రూ.2కు పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం రెండున్నర కోట్ల వినియోగదారుల్లో కోటి మందికిపైగా ఈ కేటగిరీలోనే ఉన్నారు. దాదాపు నిరుపేదవర్గాలవారే ఉండే ఈ కేటగిరీకి మిగతా కేటగిరీలతో పోల్చితే అత్యధికంగా 55 పైసల మేరకు పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధమయ్యూరుు. ఇక పరిశ్రమలకు కూడా విద్యుత్ షాక్ తగలనుంది.
సాధారణ పరిశ్రమలకు ప్రస్తుత విద్యుత్ చార్జీ రూ.6.08 ఉండగా.. తాజా ప్రతిపాదనలతో రూ. 6.50కు పెరగనుంది. భారీ పరిశ్రమలకు 27 పైసల నుంచి 35 పైసల వరకూ పెరగనుంది.
వీటికితోడు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రస్తుతం అదనంగా టైం ఆఫ్ టారిఫ్ (టీవోటీ) పేరుతో పరిశ్రమలు, భారీ వాణిజ్య సంస్థల నుంచి అదనంగా రూపాయి వసూలు చేస్తున్నారు. దీనిని రూపాయిన్నరకు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించినట్టు తెలిసింది.