హైదరాబాదు పవర్ చూడు!
హైదరాబాద్‌కూ... చింతచెట్టుకూ ఏదో దగ్గరి సంబంధం ఉంది. అందుకే చింతచెట్ల పేరిట వెలసినన్ని కాలనీలూ, బస్తీలూ, ప్రాంతాలు మరే చెట్టు పేరుతోనూ లేవు. ఒకవైపు ఖైరతాబాద్ మరో వైపు బంజారాహిల్స్‌కు మధ్యనున్న చింతల్‌బస్తీని చూస్తే అటు నగరంలా... ఇటు పల్లెలా డబుల్‌రోల్ చేస్తుంటుంది. ఒక జీవి పుట్టి... గిట్టే వరకూ తినేవీ, తాగేవీ, అవసరమైనవీ, ఉపయోగించేవీ... అన్నీ మన చింతల్‌బస్తీలో దొరుకుతాయి.
ఇక బాలానగర్- జీడిమెట్ల మధ్యనున్న ‘చింతల్’ అనే ప్రాంతం ప్రశాంతత అంటే అర్థమేమిటో చెబుతుంది. మరోవైపున ఎల్బీనగర్‌కు దగ్గర్లోని ‘చింతల్‌కుంట’నే తీసుకోండి... కష్టజీవులూ, శ్రమజీవులూ, పరిశ్రమ జీవులూ వర్థిల్లుతుంటారక్కడ. ఇలా హైదరాబాద్‌లో నలువైపులా చింతల్‌బస్తీ, చింతల్, చింతల్‌కుంట ఉన్నాయేమిటని ఆశ్చర్యపోతుంటామా!... మరో అంశం మనల్ని సంభ్రమపరుస్తుంది. అదేమిటంటే... అప్పట్లో హైదరాబాద్ మెయిన్ బస్ స్టేషన్ లోహ నిర్మితమైన ఒక డోమ్ ఆకారంలో ఉండేదన్న విషయం మనకు తెలిసిందే.
దీన్నే మనం గౌలీగూడ స్టేషన్ అనే వాళ్లం. ఇంతలో నగరం విస్తృతంగా పెరిగి ఈ డోమ్ బాగా ఇరుకైపోయింది. దాంతో హైదరాబాద్‌లో... ఆసియాలోనే అతి పెద్ద బస్‌స్టేషన్‌ను నిర్మించేందుకు స్థలం వెతుకుతుంటే కనబడ్డ ప్రదేశం... మళ్లీ ‘ఇమ్లీబన్’యే. అంటే ‘చింత చెట్ల’ వనం. నిర్మాణం పూర్తయ్యాక దానికి సాక్షాత్తూ మన జాతిపిత మహాత్మాగాంధీగారి పేరు పెట్టారు. అయినా అక్కడి చెట్ల పేరిటే ఇమ్లీబన్ బస్‌స్టేషన్ అన్న మాటకే ప్రతీతి ఎక్కువ.
ఎందుకు? ఎందుకిలా ఈ ‘చింత’కూ హైదరాబాద్‌కూ లంకె కుదిరింది. దీనివెనకున్న ఆంతర్యమేమిటి అని లోతుగా పరిశీలిస్తే మనకు తోచే అంశాలు ఎన్నెన్నో! దగ్గు మందు అంటే దగ్గును పెంచే మందు అని కాదు కదా అర్థం. అలాగే చింత... అంటే చింతలను తీసుకొచ్చేది, చింతను పెంచేదీ అని కాదు, చింతలను తీర్చేదనీ అర్థం. అందుకే హైదరాబాద్ వాసులు బస్తీ పేర్లు విషయంలో చింతను విశేషంగా, విశేషణంగా వాడుకున్నారు. పైన పేర్కొన్న బస్తీలూ, కాలనీల రూపంలో నగరవాసులకు ఆవాస ‘చింతదీర్చి’ నివేశన వరములిచ్చిన చెట్టది.
ప్రశాంత చింతలవనంలో బస్సు కోసం నిరీక్షిస్తూ తపస్సు చేసుకునేందుకు మన తపస్సు పక్వానికి రాగానే దేవుడిలా ప్రత్యక్షమవుతుంది బస్సు. అందుకు అనువైన అడవే ఇమ్లీబన్. చింత విషయంలో పులుపు చావనట్లే... మన నగరం విషయంలో ఇక్కడి ప్రజల్లో చేవ చావదు. శ్రమణకుడంటే బౌద్ధంలో అర్థం ఏమిటో నాకంతగా తెలియదు. కానీ... వాస్తవానికి మన నగరంలోని శ్రమజీవులంతా చింతలబస్తీ, చింతల్‌కుంట, చింతల్, ఇమ్లీబన్‌లోనూ శ్రమ చేస్తుంటారు కాబట్టి వారినే ‘శ్రమ’ణుకులంటూ పిలవడం సబబేమో.
ఎందుకంటే శ్రమణకులకు సన్యాసం స్వీకరించాక జ్ఞానం తప్ప మరో ప్రాపంచిక అంశం పట్టనట్లు... ఈ చింతల పేరిట ఉన్న బస్తీల్లో, ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు శ్రమను నమ్ముకున్న ఆయొక్క చింతన తప్ప మరో అంశం తెలియదు. అందుకే చింతలో చిగురూ... ఆ చిరుగులో పులుపూ ఉన్నంతవరకూ హైదరాబాద్ ప్రజల్లో శ్రమా, ఆ శ్రమ తాలూకు పవరూ ఉంటుంది.
- యాసీన్