మాట్లాడుతున్న ఎస్‌ఈ దత్తి సత్యనారాయణ
అరసవల్లి : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి వాయుగుండంగా మారడంతోపాటు భారీ వర్షాలతోపాటు గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో విద్యుత్‌శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి ఆపద వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమైంది. జిల్లా ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపిడిఇసిఎల్) ఎస్‌ఈ దత్తి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా జిల్లాలో ఈనెల 18, 19, 20 తేదీల్లో వాయుగుండం ప్రభావంతో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందన్న సంకేతాలతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని వివరించారు. స్తంభాలు నేలకొరిగితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇందులో భాగంగా ప్రస్తుతానికి రెండు వేల విద్యుత్ స్తంభాలు సిద్ధంగా ఉన్నాయని, అత్యవసరమైతే మరో 14 వేల స్తంభాలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అవసరమైతే విద్యుత్ ప్రైవేట్ కార్మికులను సుమారు 600 మంది సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. అలాగే పోల్ డ్రిల్లింగ్ మిషన్లు టెక్కలి డివిజన్‌లో రెండు, శ్రీకాకుళం డివిజన్‌లో ఒకటి సిద్ధంగా ఉన్నాయన్నారు. వాయుగుండం ప్రభావంతో తీవ్రవైన గాలులతో తీర ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయంతోపాటు నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో తమ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశామని వివరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా జనరేటర్లను సైతం సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేకంగా అధికారులతో సమావేశమై కార్యాచరణను సిద్ధం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment