విద్యుత్ ‘అంబులెన్స్’
సాక్షి, ఏలూరు : విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందా.. ఫిర్యాదు చేసినా స్పందించడం లేదా.. ఇకపై ఇలాంటి సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ చేసిన కొద్దిసేపట్లోనే కుయ్.. కుయ్‌మంటూ వచ్చి ప్రజల ప్రాణాలను రక్షించే 108 అంబులెన్స్ తరహాలో వినియోగదారులు ఎదుర్కొం టున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఈపీడీసీఎల్ ఓ వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఐదుగురు సిబ్బందిని నియమించింది. ‘సెంట్రల్ బ్రేక్ డౌన్ టీమ్’ (ఈక్యూఆర్‌ఎస్)గా దీనికి నామకరణం చేసింది. గాంధీ జయంతి సందర్భంగా ఏలూరు నగరంలో నిరంతర విద్యుత్ సర ఫరాకు శ్రీకారం చుట్టారు. దానిని సక్రమంగా అమలు చేసేందుకు ఉద్దేశించిన ‘ఈక్యూఆర్‌ఎస్’ వాహనాన్ని గురువారం ఎమ్మెల్యే బడేటి కోటరామారావు(బుజ్జి), నగర మేయర్ షేక్ నూర్జహాన్ ప్రారంభించారు. విద్యుత్ వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1800-425-55333కు ఫోన్‌చేస్తే ఈ వాహన సిబ్బంది సేవ లు అందిస్తారు.
ఈ సందర్భంగా ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ లైన్లలో ఏర్పడే అంతరాయాలను వెంటనే పరిష్కరిం చడం, పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను మార్చ డం, విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్ల కొమ్మలను తొలగించడం, విద్యుత్ లైన్ల మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, వదులుగా ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి వాటిని సరిచేయడం, పాడైపోయిన, ఒరిగిపోయిన పోల్స్‌ను గుర్తించి సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్ మూడు ఫేజులలో లోడు సమానంగా ఉండేట్టు చూడటం వంటి విధులను ఈక్యూఆర్‌ఎస్ నిర్వర్తిస్తుందని వివరించారు. దీనివల్ల విద్యుత్ లైన్లలో ఏర్పడే అంతరాయాలను పరిష్కరించే సమయూన్ని తగ్గించవచ్చని ఎస్‌ఈ వివరిం చారు. ఈ వాహనంలో ఏడాది కాల పరిమితితో కాంట్రాక్ట్ సిబ్బంది నియమించామని, వారి పనితీరును ప్రతి నెలా సమీక్షిస్తామని చెప్పారు.