కొల్లేరు కుదింపు.. ఎలా మదింపు
ఏలూరు :కొల్లేరు కాంటూరు కుదింపు వ్యవహారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాంటూరును 5నుంచి 3కు కుదించాలంటూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ.. ఈ ప్రక్రియకు అంత త్వరగా మోక్షం కలిగే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. చిత్తడి నేలల పరిరక్షణ చట్టం పరిధిలోకి కొల్లేరును చేర్చిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. కొల్లేరును ఆ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప కాంటూరు కుదింపు వ్యవహారం కొలిక్కి రాదనేది వారి వాదన. సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు మంచినీటి సరస్సును +5 కాంటూరు వరకు (77,138 ఎకరాల పరిధి) అభయారణ్యంగా గుర్తిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో-120 జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు పరిధిలో అక్రమంగా తవ్విన చేపల చెరువులను 2006లో ధ్వంసం చేసి పర్యావరణ పరిరక్షణ దిశగా అధికారులు అడుగులు వేశారు.
దీనివల్ల కొల్లేరు ప్రాంత ప్రజల జీవనోపాధికి ముప్పు వాటిల్లింది. దీంతో కాం టూరును 5 నుంచి 3కు కుదించడం ద్వారా మిగులు భూములను పేదలకు పంపిణీ చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. ఈ మేరకు 2008లో అసెంబ్లీలో తీర్మానం సైతం చేశారు. ఆయన మరణానంతరం కాంటూ రు కుదింపు వ్యవహారం మరుగునపడిపోయింది. తాజాగా ఇదే అంశంపై మరోసారి అసెంబ్లీ తీర్మానం చేశారు. అయితే, చిత్తడి నేలల పరిరక్షణ చట్టం పరిధిలోకి కొల్లేరును చేర్చడంతో కాంటూరు కుదింపు అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పర్యావరణ కోణంలో కొల్లేరు అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉంది. ఈ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం చిత్తడి నేలల చట్టం పరిధి నుంచి సరస్సును మినహాయిం చేందుకు ముందుకొస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చట్టం నుంచి కొల్లేరుకు మినహాయింపు పొందకపోతే ఎంత కాలానికైనా కాంటూరు కుదింపు సాధ్యం కాదు.
కుదిస్తే 43,500 ఎకరాలు అందుబాటులోకి
కాంటూరును 5నుంచి 3కు కుదిస్తే కొల్లేరు అభయారణ్యం నుంచి 43,500 ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుంది. ఇందులోనే జిరాయితీదారులు, సొసైటీలకు చెందిన 21వేల ఎకరాల భూమి కూడా ఉంది. ఆ భూములను జిరాయితీదారులకు, సొసైటీలకు అప్పగించగా మిగిలే 22,500 ఎకరాల పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని కొల్లేరు ప్రాంత పేదలకు అర ఎకరం చొప్పున పంపిణీ చేయాలని మత్స్యకార సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
ఎకో సెన్సిటివ్ జోన్‌గా...
అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందిన ‘రామ్సార్’ సమావేశం కొల్లేరును సున్నితమైన పర్యావరణ ప్రాంతం (ఎకో సెన్సిటివ్ జోన్)గా గుర్తించింది. ఈ సరస్సు సముద్ర మట్టం నుంచి 10 కాంటూరు వరకు 2.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్టు స్పష్టం చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ప్రకృతి సిద్ధంగా వరద నిరోధక జలాశయంగా కొల్లేరు ఏర్పడిందని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కొల్లేరును చిత్తడి నేలల చట్టం పరిధిలోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కొల్లేరు ప్రజల నుంచి అభ్యంతరాలను, సలహాలు, సూచనలు స్వీకరించారు. 2012లో కొల్లేరును చిత్తడి నేలల పరిరక్షణ చట్టం పరిధిలోకి తీసుకువచ్చారు. దీనిని రెండు జిల్లాల్లోని కొల్లేరు ప్రజలు వ్యతిరేకించారు. ఈ సందర్భంలోనే కొల్లేరులో నాలా పన్నును రద్దుచేసి కొంత ఉపశమనం కల్పించారు. అనంతరం కొల్లేరులో నివసించే ప్రజలతో 26 పర్యావరణ అభివృద్ధి సమితులు (ఈడీసీ) ఏర్పాటు చేశారు. అయితే, కొల్లేరు పరిరక్షణ మాత్రం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల నడుమ కొల్లేరును 5 నుంచి 3వ కాంటూరు కుదించే వ్యవహారం ఏమేరకు సాకారం అవుతుందనేది ప్రశ్నార్థకంగా ఉంది.