జిల్లాపై ప్రేమ చూపిన మహానేతఅభివృద్ధి, సంక్షేమ
పథకాల్లో పెద్దపీట నిత్యం ఆయనను తలచుకుంటున్న
జనం
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : సుకవి జీవించు ప్రజల నాల్కలపై అని ప్రజాకవి జాషువా చెప్పినట్టు సుపరిపాలకుడు జీవించు జన హృదయాలలో అనుకోవచ్చునేమో! జనహితమే అభిమతంగా మంచి పరిపాలన అందించిన నేతలను ప్రజలు ఎన్నటికీ మరువరనేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయన మరణించి దాదాపు ఆరేళ్లవుతున్నా జిల్లా ప్రజలు ఇప్పటికీ తలుచుకోని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అందించి జనం హృదయాలలో మంచిపాలకుడిగా ముద్ర వేశారు. పేదలకు కార్పొరేట్ వైద్య సేవలందించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, అందరికీ విద్యావకాశాలు కల్పించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలు కొన్ని మచ్చుతునకలు మాత్రమే. 108 సేవలతో ఎన్నో ప్రాణాలు కాపాడిన పాలకునిగా వైఎస్ ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన అనంతరం వచ్చిన ప్రభుత్వాలు సంక్షేమాన్ని విస్మరించిన నేపథ్యంలో పెద్ద దిక్కును కోల్పోయిన బాధను ప్రజలు అనుభవిస్తున్నారు.
ఆ మేళ్లు అభివృద్ధికి మైలురాళ్లు
తనకు అధికారం కట్టబెట్టడంలో నమ్మకాన్ని చూపిన జిల్లాకు ఆయన పలు మేళ్లు చేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో 11,553 సర్వీసులు ఇస్తే, వైఎస్ ఐదున్నరేళ్లలో 15,449 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 80 టీఎంసీల గోదావరి నీటిని కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణానదికి, 23.44 టీఎంసీల నీటిని ఎడమ కాలువ ద్వారా విశాఖ పరిసర 560 గ్రామాల తాగునీటి, పరిశ్రమల అవసరాలకు సరఫరా చేస్తారు. ఈ నాలుగు జిల్లాల్లో పర్యాటకం, చేపల పెంపకం, జల రవాణా వంటివి అభివృద్ధి చెందుతాయి. రూ.16,010 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి తీసుకువచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే.
ఇవిగో ప్రగతి ఆనవాళ్లు
ఏలూరు వన్‌టౌన్‌లో భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులకు సీఎం అష్యూరెన్స్ కింద 2009లో రూ.17,30 కోట్ల విడుదలకు మార్గం సుగమం చేశారు. తమ్మిలేరు వరద ముంపు నుంచి ఏలూరు, పరిసర గ్రామాలను కాపాడటానికి పడమర లాకుల వద్ద నుంచి పలు ప్రాంతాల్లో రూ. 25 కోట్లతో ఏటిగట్లు పటిష్టం చేసే పనులు వైఎస్ మంజూరు చేశారు. రూ.85 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు, 10 వేల మందికి ఇళ్ల నిర్మాణం, రూ.4కోట్లతో 3చోట్ల వంతెనలు, హాకర్స్ జోన్, రూ.6 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, వైఎస్ హయాంలోనే జరిగాయి. గోపాలపురం, దేవరపల్లిలో సబ్ లిఫ్ట్ పనులకు రూ. 48 కోట్లు మంజూరు చేశారు. ఉండి కాలువపై ఉన్న అక్విడెక్ట్‌కు 2009 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. తాడేపల్లిగూడెంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.64 కోట్లు, ఆచంట నియోజకవర్గానికి రూ.14 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. వల్లూరులో 60, తణుకు శివారు అజ్జరం పుంత ఇందిరమ్మ కాలనీలో 400, నరసాపురంలో 250 ఇళ్లు పేదలకు అందించారు.
మదిమదిలో ఆ పాలన పదిలం
Published Wed, Jul 8 2015 1:10 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement