చెరగని సంతకం
సాక్షి, ఏలూరు : కర్నూలు జిల్లా పావురాల గుట్టలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణాలు విడిచారనే చేదు వార్త రాష్ట్ర ప్రజలను శోకసంద్రంలో ముంచేసిన రోజు అది. ఆ విషయం తెలిసి గుండెలవిసేలా విలపించిన కోట్లాది మంది ప్రజల కన్నీరు ఏరులై పారిన రోజు అది. అదే 2009 సెప్టెంబర్ 2. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ లోకాన్ని విడిచి మంగళవారం నాటికి ఐదేళ్లు పూర్తవుతోంది. చిన్ని గుండెకు చిల్లు పడితే లక్షలాది రూపాయలు ధారపోసి ఎందరో పసివాళ్లకు నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రసాదించిన మహానేత.. పండుటాకులకు పెద్దకొడుకై వారి సంరక్షణ బాధ్యత తానే తీసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదముద్రలు జిల్లాలో నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి.
ఉచిత విద్యుత్ వరమిచ్చారు
ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకంచేసి రైతులను విద్యుత్ చార్జీల భారం నుంచి విముక్తుల్ని చేశారు. వ్యవసాయానికి రోజుకు 7గంటలపాటు ఉచిత విద్యుత్ అందించి, అప్పటివరకూ ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేశారు. తత్కాల్ సర్వీసులు పొం దిన వారు తమకూ ఉచిత విద్యుత్ అందించమని మనజిల్లా పర్యటనలో ఉన్నప్పుడు వైఎస్‌ను కోరగా వారికి కూడా ఆ పథకాన్ని వర్తింపజేస్తూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో టీడీపీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో 11,553 సర్వీసులు ఇస్తే, వైఎస్ అధికారంలో ఉన్న ఐదున్నరేళ్లలో 15,449 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఇచ్చారు.
అభివృద్ధి ఆయన చలవే
జిల్లాలో అధివృద్ధి పనులు వైఎస్ హయాంలో వేగంగా జరిగేవి. ఏటా తమ్మిలేరు వరద ముంపుతో అతలాకుతలం అవుతున్న ఏలూరు నగరం, పరిసర గ్రామాలను కాపాడేందుకు పడమర లాకుల నుంచి పలు ప్రాంతాల్లో రూ.25 కోట్లతో ఏటిగట్లు పటిష్టం చేసే పనులకు వైఎస్ శ్రీకారం చుట్టారు. రూ.85 కోట్లతో (యూఐడీఎస్‌ఎస్‌ఎంటీ పథకం కింద) తాగునీటి ప్రాజెక్టు నిర్మించారు. ఐదు ప్రాంతాల్లో 10వేల మందికి ఇళ్లు ఆయన కాలంలోనే సమకూరాయి. దేవరపల్లి మండలం శివారు బందపురం వద్ద తాడిపూడి కాలువపై గోపాలపురం, దేవరపల్లిలో సబ్ లిఫ్ట్ పనులకు 2008లో సుమారు రూ.48 కోట్లను వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. ఉండి కాలువపై ఉన్న అక్విడెక్ట్ నిర్మాణానికి 2009 ఫిబ్రవరిలో వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు వైఎస్ రూ.64 కోట్లను కేటాయించారు. 2008 జనవరి 31న ఆచంట నియోజకవర్గ పర్యటనలో భాగంగా రూ.14 కోట్ల వ్యయంతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని వైఎస్ మంజూరు చేశారు.
వల్లూరులో 60 ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చారు. తణుకు శివారు అజ్జరం పుంత ఇందిరమ్మ కాలనీలో 400 ఇళ్లు వైఎస్ హయాంలో నిర్మించారు. నరసాపురం వైఎస్సార్ నగర్‌లో పేదలకు 250 ఇళ్లు వైఎస్ రాజశేఖరరెడ్డి అందించారు. పాలకొల్లు మండలం తిల్లపూడిలో రూ.2 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తిచేసి 1,100 ఎకరాలకు నీరు అందేలా చేశారు. జలయజ్ఞంలో భాగంగా తాడిపూడి, పైడిమెట్ట, బ్రాహ్మణగూడెం, చాగల్లులో ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. ఇలాంటి పనులెన్నో చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రజల హృదయూల్లో నిలిచిపోయూరు. పాదయాత్ర చేసి జిల్లా ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని తీర్చడానికి అహర్నిశలు శ్రమించిన ఆ నేత లేరంటే ఇప్పటికీ ఎవరూ నమ్మలేకపోతున్నారు. కారణం.. జనం కష్టాల్లో ఉంటే ఆయనే గుర్తొస్తున్నారు. వారి సంతోషాలకు ఆయనే కారకులవుతున్నారు.