‘దొర’కు ధర్మాగ్రహం | Electricity arrears On CMD APSPDCL focus Dora | Sakshi
Sakshi News home page

‘దొర’కు ధర్మాగ్రహం

Published Wed, Feb 24 2016 2:18 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

‘దొర’కు ధర్మాగ్రహం - Sakshi

‘దొర’కు ధర్మాగ్రహం

సాక్షి, గుంటూరు : జిల్లాలో పేరుకు పోతున్న విద్యుత్ బకాయిలపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ దొర దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల విద్యుత్ బకాయిలు సుమారు రూ.వంద కోట్లకు పైగా ఉండటంతో ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను తెలుసుకునేందుకు సీఎండీ నేరుగా రంగంలోకి దిగారు. డిసెంబర్, జనవరి నెలల్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించి పెండింగ్ బకాయిలపై ఆరా తీశారు. వీటిలో ఎక్కువగా బిల్ స్టాప్, డిస్‌కనెక్షన్ (యూడీసీ) బకాయిలే అధికంగా ఉన్నట్లు గుర్తించిన సీఎండీ దీనిపై లోతుగా విచారణ జరపాలని నిర్ణయించారు. గుంటూరు నగరంలోనే సుమారు రూ.2 కోట్లు బిల్‌స్టాప్ బకాయిలు ఉన్నట్లు గుర్తించిన సీఎండీ విద్యుత్ కనెక్షన్ లేకుండా నగరాల్లో ఎలా నివసిస్తారంటూ ప్రశ్నించినట్లు తెలిసింది.

జిల్లాలో బిల్ స్టాప్ బకాయిలు, ఫైన్‌లు వేసినా చెల్లించని వారికి సైతం వేరే పేర్లతో అదే అడ్రస్సులో తిరిగి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి కొనసాగిస్తున్నట్లు అనుమానించిన సీఎండీ ఈ వ్యవహారాలపై తనిఖీలు చేయాలనే ఆలోచనకు వచ్చారు. జిల్లాలోని రేపల్లె పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేయించారు. ఆ ప్రాంతంలో కొన్ని ఫ్యాక్టరీలకు రికార్డుల్లో విద్యుత్ కనెక్షన్ కట్ చేసినట్లు ఉండగా, క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యుత్‌ను పునరుద్ధరించి సరఫరా యథావిధిగా జరుపుతున్నారు. దీంతో సీరియస్ అయిన సీఎండీ జిల్లాలో పూర్తి స్థాయి తనిఖీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
 
జిల్లాను జల్లెడ పడుతున్న విద్యుత్ విజిలెన్స్ అధికారులు..
సీఎండీ ఆదేశాలతో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 8 జిల్లాలకు చెందిన విజిలెన్స్ అధికారులంతా గుంటూరు జిల్లాపై దృష్టి సారించారు. శుక్రవారం జిల్లాలోని యడ్లపాడు, నకరికల్లు, వెల్దుర్తిమండలాల్లో ఇంటింటీ తనిఖీ నిర్వహించి 255 కేసులు నమోదు చేసి రూ.17 లక్షలకు పైగా అపరాధ రుసుం విధించారు. రానున్న రోజుల్లో ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో విద్యుత్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నడంతో అవినీతికి పాల్పడ్డ ఏఈలు, సిబ్బంది వెన్నులో వణుకు మొదలైంది.
 
సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలకు చెక్
విద్యుత్ శాఖ అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమాలకు చెక్ పెడుతున్నారు. గతంలో ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయనే విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తే తప్ప తెలిసేది కాదు. అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఉండే మీటర్‌కు మోడెమ్‌ను అనుసంధానం చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నారు. ఆయా ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా ఆయా ఏరియాల్లో మీటర్లు ఎంత కరెంటు వాడుతున్నాయి, వినియోగదారులు ఎంత మొత్తం డబ్బు చెల్లిస్తున్నారనేది నమోదవుతుంది. దీంతో ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించి అక్రమార్కుల భరతం పడుతున్నారు.
 
నెలలో పది రోజులు తనిఖీలు
నెలలో పది రోజులు పెండింగ్ బకాయిలపై దృష్టి సారించి జిల్లా స్థాయి అధికారులతో తనిఖీ బృందాలు ఏర్పాటు చేసి పంపుతున్నాం. వీరు పెండింగ్ బకాయిలు వసూళ్లతో పాటు అక్రమాలకు పాల్పడేవారిపై తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
- జయభారత్‌రావు, ఎస్‌ఈ, విద్యుత్‌శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement