కాకి లెక్కలు..! | Electricity bills issuance on Allegations | Sakshi
Sakshi News home page

కాకి లెక్కలు..!

Published Wed, Mar 4 2015 1:57 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

Electricity bills issuance on Allegations

 గ్రామంలో వినియోగిస్తున్న వీధి దీపాలు లెక్కించి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటలకు ఎన్నియూనిట్లు వినియోగించారో అంచననా వేసి గుడ్డిగా బిల్లులు  జారీ చేశారన్న ఆరోపణలు జిల్లాలోని పంచాయతీల సర్పంచ్‌ల నుంచి వ్యక్తమవుతున్నాయి. చాలా వరకు పంచాయతీల్లో వీధి దీపాలు ఉన్నా వెలగని పరిస్థితి ఉందని, వాటికి కూడా లెక్కలు కడితే తామెందుకు చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమస్య  జిల్లాలోని సాలూరు మండలంలో విద్యుత్ శాఖ అధికారులకు ఎదురైంది.
 
 విజయనగరం మున్సిపాలిటీ: గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల జారీపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి విద్యుత్ మీటర్లు లేకుండానే విద్యుత్ శాఖ అధికారులు కోట్లాది రూపాయల బిల్లులు జారీ చేస్తున్నారని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఆరోపిస్తుండగా... బిల్లులు చెల్లించకుండా తప్పించుకునేందుకు అటువంటి వాఖ్యలు చేస్తున్నారని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాలోని 921 గ్రామ పంచాయతీలలో వీధి దీపాల వినియోగానికి సంబంధించి విద్యుత్ బిల్లుల వసూలుపై ఉత్కంఠ సాగుతోంది. ఇదే  సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి పలువురు సర్పంచ్‌లు తీసుకువెళ్లి
 నట్లు తెలుస్తోంది.
 
 జిల్లాలో గ్రామ పంచాయతీల్లో ప్రతి రోజూ రాత్రి వేళలో వినియోగించే వీధి దీపాలకు సంబంధించిన బిల్లులను  ఆయా పంచాయతీల నుంచి వసూలు  చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు 13వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు గత కాలంలో పంచాయతీల్లో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించి రూ.20కోట్ల 7 లక్షల 28వేల 801 బిల్లులను సర్పంచ్‌లకు అందజేశారు.  అయితే గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు మాత్రం ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తున్నారు. గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిన వెంటనే  ఎన్నికలు నిర్వహించకుండా మూడేళ్ల పాటు  తాత్సారం చేయడంతో అభివృద్ధి కుంటుపడిందని, ఈ నేపథ్యంలో అభివృద్ధి కోసం కేంద్రప్రభు త్వం కేటాయించిన నిధులనే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల రూపంలో వసూలు చేయడం సమంజసం కాదంటున్నారు.
 
 మీటర్లు లేకుండానే విద్యుత్ బిల్లులా ?
 ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీల్లో వీధి దీపాలకు వినియోగించే విద్యుత్‌కు సంబంధించి ఎటువంటి మీటర్లు లేకుండానే అధికారులు ఎలా బిల్లులు వేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.  జిల్లా వ్యాప్తంగా గల 921 పంచాయతీల నుంచి రూ20కోట్ల 7 లక్షల 28వేల 801 రావాల్సి ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు లెక్కలు చెబుతుండగా అందులో రూ.2కోట్ల 86 లక్షల 79వేల 130  ఇప్పటి వరకు వసూలైంది. మరో రూ.17కోట్ల 20 లక్షల 49వేల 671 వసూలు కావాల్సి ఉంది.అయితే ఈ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం రెండు నెలల కిత్రమే ఆదేశాలు జారీ చేయగా.. మీటర్లు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు ఎలా బిల్లులు వేస్తారని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. .  
 
 బిల్లులు చెల్లించకుండా తప్పించుకునేందుకే సాకులు : విద్యుత్ శాఖ ఎస్‌ఈ
 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు విద్యుత్‌బిల్లులు చెల్లించకుండా తప్పించేందుకునేందుకు అటువంటి కుంటి సాకులుచెప్పి ఉండవచ్చని విద్యుత్ శాఖఎస్‌ఈ జి.చిరంజీవిరావు అన్నారు. దాదాపు అన్ని పంచాయతీల్లో మీటర్లు ఉన్నాయని, ఇటీవల సాలూరు మండలంలో లేవని పలువురు సర్పంచ్‌లు తమ దృష్టికి తీసుకువస్తే ఏర్పాటు చేశామన్నారు. అదేవిదంగా మిగిలిన అన్ని పంచాయతీల్లో మీటర్ల ఏర్పాటుపై సిబ్బందికి ఆదేశాలు  జారీ చేశామన్నారు. ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తు ఫాన్‌లో పాడైన వాటిని మార్చాలని  సదరు ఏఈలకు సూచించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement