నాగవళి నదిలో పడి చనిపోయిన ఏనుగు
విజయనగరం, కొమరాడ(కురుపాం): ఏజెన్సీ ప్రాంతంలో హల్‌చల్‌చేస్తున్న ఏనుగుల గుంపులో ఓ ఏనుగు మృత్యువాత పడింది. గతేడాది సెప్టెంబర్ ఐదో తేదీన జిల్లాలో ప్రవేశించిన ఎనిమిది ఏనుగుల గుంపులో సెప్టెంబర్ 16వ తేదీన ఓ గున్న ఏనుగు విద్యుదాఘాతంతో మృతి చెందిన విషయం విదితమే. శ్రీకాకుళం, విజయనగరం సరిహద్దులో సంచరిస్తున్న ఈ గుంపులో ఒకటి నాలుగు రోజుల క్రితం విడిపోయింది. అది దుగ్గి గ్రామంలో నాగావళి నది ఊబిలో పడి చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు సోమవారం గుర్తించారు. గుంపునుంచి వేరుపడిన ఈ మగ ఏనుగు గుణానుపురంలో గ్రామ పొలాలో జొన్నచేనులో వేసిన గుళికలుతినేయడంతో స్పృహ తప్పి మళ్లీ నాగవళి నదిలో నీరు తాగి కోలుకుందని రైతులు చెపుతున్నారు.
శనివారం సాయత్రం నుంచి ఏనుగు కనిపించకపోవడంతో అధికారులు వెదికినా ఫలితం కనిపించలేదు. తీరా సోమవారం దుగ్గి వద్ద నాగావళి నదిలో పడిపోయి ఉంది. వెంటనే వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సీసీఎఫ్ రాహుల్ పాండే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఊబిలో పడి తిరిగి ఎక్కలేక చనిపోయిందని అటవీశాఖాధికారులు చెబుతుండగా... గుళికలు తిన్నందునే చనిపోయి ఉండవచ్చని రైతులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఓ మగ ఏనుగు చనిపోవడం ఈ ప్రాంతీయులను తీవ్రంగా కలచివేసింది. ఇప్పటికైనా అధికారులు ఏనుగుల గుంపును శాశ్వతంగా తొలగించే ఏర్పాట్లు చేయకుంటే మిగిలిన ఏనుగులకూ ముప్పు పొంచి ఉందని ఇక్కడివారి అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment