
సుంకి సరిసరాలలో సంచరిస్తున్న ఏనుగులు
శ్రీకాకుళం ,గరుగుబిల్లి: నాలుగు నెలల నుంచి మండల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గంపు ఇంకా మైదాన ప్రాంతాన్ని వదలడం లేదు. మండలంలోని తోటపల్లి ప్రాజెక్ట్ పరిసరాల్లోని సుంకి గ్రామ పరిసర ప్రాంతాల్లో తిష్టవేశాయి. దీంతో ప్రజలు భీతిల్లుతున్నారు. జనసంచారం ఉన్న మైదాన ప్రాంతాలలో ఏనుగులు సంచరిస్తుండడంతో ప్రధాన రహదారి నుంచి రాకపోకలుచేసే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించేందుకు అటవీశాఖాధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడంలేదు.
పంటలకు నష్టం
ఏనుగులు ఈ ప్రాంతం నుంచి అటవీ ప్రాంతాలకు తరలించలేకపోవడంతో ప్రజలు నిత్యం భయాందోళన చెందుతున్నారు. వరి, చెరకు పంటలను నాశనం చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు ఎప్పుడు ఏ గ్రామంపై దాడి చేస్తాయోనని భయపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
ఏనుగులను సురక్షితమైన అటవీ ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్టీ యువమోర్చా కార్యదర్శి ఎన్.జయరాజ్ అన్నారు. సుంకి గ్రామ పరిసరాల్లో అటవీశాఖ ఇన్‌స్పెక్టర్ కల్యాణమునిని ఆదివారం కలిసి ఏనుగుల తరలింపుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ, ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
తరలించేదెప్పుడు..?
గుమ్మలక్ష్మీపురం: కురుపాం నియోజకవర్గ పరిధిలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అటవీ ప్రాంతానికి ఎప్పుడు తరలిస్తారని ఏపీ ఆదివాసీ చైతన్యసేవా సంఘం అధ్యక్షుడు ఆరిక సూర్యనారాయణ ప్రశ్నించారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏనుగుల సంచారం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోందన్నారు. ఏనుగులను అధికారులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు పంపించే చర్యలు చేపడుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఏనుగులు గరుగుబిల్లి నుంచి పార్వతీపురం వెళ్లే ప్రధాన రహదారి పరిసరాల్లో సంచరిస్తుండడం వల్ల నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అటవీ ఏనుగుల గుంపు నుంచి జనాలకు రక్షించే శాశ్విత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment