Thotapalli project
-
అమరావతి పెట్టుబడిదారుల కోసం ఉత్తరాంధ్రులకు వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని, అందరికీ సమన్యాయం చేయాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార వికేంద్రీకరణ తలపెట్టారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కేవలం తన అనుయాయులను పెత్తందారులను చేయడానికే చట్టబద్ధంగా ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను చంద్రబాబు పక్కనబెట్టి నారాయణ, సుజనాచౌదరిల కమిటీ చెప్పిన అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరి సొమ్ముతో తమ మందిమాగధులకు మేలు చేసేది రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. అమరావతి సహా మూడు ప్రాంతాలూ అభివృద్ధి చేయాలని తాము కోరుకుంటున్నామని, కానీ అమరావతి రైతుల ముసుగులోని పెట్టుబడిదారులు మాత్రం ఉత్తరాంధ్ర నాశనం అయిపోవాలని దేవుడికి మొక్కడానికి అరసవల్లి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి స్థానిక టీడీపీ నాయకులు మద్దతు పలకడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమేనన్నారు. దశాబ్దాలుగా టీడీపీకి అండగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్‌ను కాపాడాల్సింది పోయి చంద్రబాబు ప్రయోజనాల కోసం పణంగా పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హడావుడిగా శిలాఫలకాలు వేయడం తప్ప చంద్రబాబు జిల్లాకు చేసింది శూన్యమన్నారు. గతంలో మాదిరిగానే ప్రజలు అమాయకులని వెన్నుపోటు పొడుద్దామంటే కుదరదని హెచ్చరించారు. వికేంద్రీకరణపై టీడీపీ విషప్రచారాన్ని వారే తిప్పికొడతారని, కుట్రల్లో భాగమైన పాదయాత్రను అడ్డుకుంటారని స్పష్టం చేశారు. జెడ్పీ చాంబర్లో మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. టీడీపీ నాయకులు చేస్తున్న విషప్రచారాన్ని ఖండించారు. ఆ ప్రకటనల వెనుకనున్న అసలు విషయాన్ని వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... టీడీపీ ప్రచారం: భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినది మేమే. 400 ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసేసుకుంది. వాస్తవ విషయం: విమానాశ్రయం కోసం గత టీడీపీ ప్రభుత్వం 2,750 ఎకరాలను జీఎంఆర్‌కు ఇస్తూ ఒప్పందం చేసుకుంది. ఆ భూసేకరణపై 150 వరకూ కేసులు హైకోర్టు విచారణలో ఉన్నా వాటిని పరిష్కరించకుండానే, ఓ ఒక్క నిర్వాసితుడికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండానే చంద్రబాబు ఎన్నికల ముందు ఆదరాబాదరాగా శంకుస్థాపన చేసేశారు. అశోక్ గజపతిరాజు అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా ఏ ఒక్క అనుమతీ తీసుకురాలేదు. రైతులతో మాట్లాడి ఆ కేసులన్నీ ఉపసంహరింపజేసినదీ, నిర్వాసితులకు న్యాయం చేసినదీ, కేంద్రం నుంచి అనుమతులన్నీ తెచ్చినదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. త్వరలోనే శంకుస్థాపన కూడా జరగనుంది. విమానాశ్రయానికి అంత భూమి అవసరం లేదనే జీఎంఆర్ నుంచి 547 ఎకరాలను ప్రభుత్వం వెనక్కుతీసుకుంది. ఐదు గ్రామాల నిర్వాసితులకు అన్ని రకాల పరిహారం ఇచ్చింది. అన్ని సౌకర్యాలతో కాలనీలు సిద్ధం చేసింది. టీడీపీ ప్రచారం: గిరిజన యూనివర్సిటీకి టీడీపీ హయాంలోనే భూమి సేకరించేశాం. రూ.10 కోట్ల ఖర్చుతో కాంపౌండ్ వాల్‌నూ కట్టేశాం. వాస్తవ విషయం: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసింది. ఇతర రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలన్నీ గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. కానీ వాటి లక్ష్యాన్ని పక్కనబెట్టి టీడీపీ పాలనలో మైదాన ప్రాంతమైన కొత్తవలస మండలంలో స్థల సేకరణ చేశారు. సొంత కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి రూ.10 కోట్లతో మంజూరు చేసిన చేసిన ప్రహరీ కూడా ఐదేళ్లలో పూర్తి చేయలేకపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ ఉద్దేశంతో వారికి అందుబాటులో ఉండేలా సాలూరు నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమీపంలోనే రైలు, రోడ్డు, విమాన ప్రయాణ సదుపాయాలు ఉండేలా మెంటాడ మండలంలో సుమారు 500 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేస్తే, కేంద్ర కమిటీ దానికి మొగ్గు చూపించింది. దీన్ని పార్లమెంట్లో ఆమోదం పొందేలా ప్రధానమంత్రి, కేంద్ర హోమ్‌మంత్రితో మాట్లాడి సాధించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. ఆ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ నియమించినదీ, తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అన్ని గిరిజన ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలనే ఆయన కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరుచేశారు. మరో మెడికల్ కాలేజీ త్వరలోనే పార్వతీపురం మన్యం జిల్లాకూ మంజూరు చేయనున్నారు. టీడీపీ ప్రచారం: అమరావతి రైతులకు మద్దతుగా అన్నివర్గాల వారితో రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. పాదయాత్రకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తాం. ఉత్తరాంధ్రను తాకట్టు పెట్టడం తప్ప ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధీ చేయలేదు. వాస్తవ విషయం: జిల్లాలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న అటు అశోక్‌కు తప్ప మిగతా టీడీపీ నాయకులెవ్వరికీ ఇక్కడ జరిగిన అభివృద్ధిపై అవగాహన లేదు. గణాంకాలు చూస్తే తెలుస్తుంది. టీడీపీ పాలనలో ఏమి జరిగిందో, వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మంత్రి బొత్స సత్యనారాయణ నాయకత్వంలో సిద్ధంగా ఉన్నాం. తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ ప్రాజెక్టులను పూర్తి చేసింది వైఎస్సారే. కాలువ, మిగులు పనులకు ఇటీవలే రూ.125 కోట్లను జగన్ ప్రభుత్వం కేటాయించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు టీడీపీ పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీనికి అడ్డంకిగానున్న సారిపల్లి గ్రామ నిర్వాసితుల సమస్యను పరిష్కరించడానికి రూ.77 కోట్లను కేటాయించినది మా ప్రభుత్వమే. వీటన్నింటినీ విస్మరించి వైఎస్సార్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలపై విషప్రచారం చేయడానికి టీడీపీ నాయకులకు తగదు. విశాఖ రాష్ట్ర పరిపాలన రాజధాని గాకుండా అడ్డుకోవడానికే జరుగుతున్న అమరావతి పాదయాత్రకు మద్దతు పలకడం సమంజసం కాదు. కాదని ఆ విధానానికే కట్టుబడి ఉంటే 2024 ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు. వికేంద్రీకరణ, విశాఖ పరిపాలనా రాజధాని వల్ల ఉత్తరాంధ్రకు ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలకు మేలు జరుగుతుంది. దాని కోసం అన్ని వర్గాలతో కలిసి పోరాటం చేయడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. -
ఖడ్గవలసలో ఏనుగుల సంచారం
విజయనగరం, గరుగుబిల్లి: కొద్ది రోజులుగా ఈ ప్రాంత వాసులను భయాందోళనకు గురి చేస్తున్న ఏనుగులు తాజాగా మంగళవారం మండలంలోని సుంకి, తోటపల్లి ప్రాజెక్టు పరిసరాల్లోని కుడిమట్టికట్ట వద్ద ఖడ్గవలస సమీపంలో సంచరిస్తున్నాయి. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో పంట నష్టం తీవ్రంగా జరుగుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టు పరిసరాల్లోనే నాలుగు రోజుల నుంచి ఏనుగులు సంచరిస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరి పంటతో పాటు అరటి తదితర పంటలను నష్టపరుస్తున్నాయి. ప్రణాళిక ప్రకారం తరలింపు ఏనుగులను ఒక ప్రణాళిక ప్రకారం తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్టు పార్వతీపురం జిల్లా అటవీశాఖ అధికారి జి.లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం ఆయన సుంకి పరిసరాలలో ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 9 నుంచి ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని చెప్పారు. ఒడిశాకు వెళ్లినా తిరిగి ఇక్కడకు వచ్చాయని చెప్పారు. ఏనుగులను తరలించేందుకు బేస్ క్యాంప్స్, ట్రాక్స్ల ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పంట నష్టం జరిగితే పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆయనతో పాటు పార్వతీపురం, కురుపాం రేంజర్స్ ఎం.మురళీకృష్ణ, కళ్యాణముని తదితరులున్నారు. -
కదలని ఏనుగులు
శ్రీకాకుళం ,గరుగుబిల్లి: నాలుగు నెలల నుంచి మండల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గంపు ఇంకా మైదాన ప్రాంతాన్ని వదలడం లేదు. మండలంలోని తోటపల్లి ప్రాజెక్ట్ పరిసరాల్లోని సుంకి గ్రామ పరిసర ప్రాంతాల్లో తిష్టవేశాయి. దీంతో ప్రజలు భీతిల్లుతున్నారు. జనసంచారం ఉన్న మైదాన ప్రాంతాలలో ఏనుగులు సంచరిస్తుండడంతో ప్రధాన రహదారి నుంచి రాకపోకలుచేసే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించేందుకు అటవీశాఖాధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడంలేదు. పంటలకు నష్టం ఏనుగులు ఈ ప్రాంతం నుంచి అటవీ ప్రాంతాలకు తరలించలేకపోవడంతో ప్రజలు నిత్యం భయాందోళన చెందుతున్నారు. వరి, చెరకు పంటలను నాశనం చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు ఎప్పుడు ఏ గ్రామంపై దాడి చేస్తాయోనని భయపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించాలి ఏనుగులను సురక్షితమైన అటవీ ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్టీ యువమోర్చా కార్యదర్శి ఎన్.జయరాజ్ అన్నారు. సుంకి గ్రామ పరిసరాల్లో అటవీశాఖ ఇన్స్పెక్టర్ కల్యాణమునిని ఆదివారం కలిసి ఏనుగుల తరలింపుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ, ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తరలించేదెప్పుడు..? గుమ్మలక్ష్మీపురం: కురుపాం నియోజకవర్గ పరిధిలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అటవీ ప్రాంతానికి ఎప్పుడు తరలిస్తారని ఏపీ ఆదివాసీ చైతన్యసేవా సంఘం అధ్యక్షుడు ఆరిక సూర్యనారాయణ ప్రశ్నించారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏనుగుల సంచారం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోందన్నారు. ఏనుగులను అధికారులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు పంపించే చర్యలు చేపడుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఏనుగులు గరుగుబిల్లి నుంచి పార్వతీపురం వెళ్లే ప్రధాన రహదారి పరిసరాల్లో సంచరిస్తుండడం వల్ల నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అటవీ ఏనుగుల గుంపు నుంచి జనాలకు రక్షించే శాశ్విత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
తోటపల్లి ప్రాజెక్టు వంతెనపై వైఎస్ జగన్ ఫ్రజాసంకల్పయాత్ర
-
నాలుగేళ్లుగా ఎదురుచూపులు..
ప్రజా సంకల్పయాత్ర బృందం: తోటపల్లి ప్రాజెక్ట్ నీటి కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నామని గజపతినగరం నియోజకవర్గ సన్న, చిన్నకారు రైతుల తరఫున డి.దేముడు, ఎంసీ నాయుడు, తదితరులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గజపతినగరం నియోజకవర్గంలో గజపతినగరం మండలం గుడివాడ క్రాస్ వద్ద పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తోటపల్లి ప్రధాన కాలువ నుంచి గజపతినగరం బ్రాంచి కెనాల్ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టర్, అధికారుల ఉదాసీన వైఖరి వల్లే పనులు పూర్తి కావడం లేదన్నారు. దీంతో గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో సుమారు 15 వేల ఎకరాలకు సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాబూ జగజ్జీవన్‌రామ్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేస్తే ఉత్తరాంధ్రలో సుమారు నాలుగు లక్షల ఎకరాల భూమికి సాగునీరందుతుందని చెప్పారు. సాగు నీటి పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు న్యాయంచేయాలని కోరారు. కార్మికుల పక్షాన నిలవాలి.. పారిశుద్ధ్య కార్మికుల పక్షాన నిలబడి న్యాయం చేయాలని గజపతినగరం డివిజన్ పారిశుద్ధ్య కార్మికుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పి.నాగేశ్వరరావు, ఎస్.కృష్ణ, గౌరవాధ్యక్షుడు కె.అప్పలరాజు, తదితరులు కోరారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి పురం అప్పారావు ఆధ్వర్యంలో మానాపురం వద్ద జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన కార్మికులకు కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్లుగా నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. జీఓ 151 ప్రకారం జీతాలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అమలు కావడం లేదని వాపోయారు. వివక్ష కనబరుస్తున్నారు.. అనంతపురం జిల్లాలో గల శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయంలో ప్రభుత్వం వివక్ష కనబరుస్తోందని యూనివర్సీటీ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ చాగంటి రామిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూనివర్సీటీలో 29 మంది రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి 2009లో నోటిఫికేషన్ ఇచ్చి 2010లో విధులు అప్పగించారన్నారు. అయితే డీఏ, ఇంక్రిమెంట్ల వంటి సౌకర్యాలు కల్పించడంలో యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. రెగ్యులర్ సిబ్బందితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలన్న హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని జననేత దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ హయాంలో అన్యాయం.. చంద్రబాబు సర్కార్ గీత కార్మికులకు తీరని అన్యాయం చేసిందని ఏపీ గీతకార్మిక సంఘ జిల్లా కమిటీ అధ్యక్షుడు పురం ఫణీంద్రకుమార్ అన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 80 వేల కుటుంబాలు.. 100కు పైగా సంఘాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయరన్నారు. జీఓ 560 ప్రకారం ప్రతి గీత కార్మిక సొసైటీకి ఐదెకరాల భూమి ఇస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదని వాపోయారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక గీత కార్మికులను ఆదుకోవాలని కోరారు. -
తోటపల్లి ప్రాజెక్టును మేమే పూర్తి చేశాం
జరజాపుపేట (నెల్లిమర్ల) : తోటపల్లి ప్రాజెక్టును తామే పూర్తిచేసి, 1.2 లక్షల ఎకరాలకు సాగునీరందించామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. జిల్లాలోని నాలుగు నదులను అనుసంధానం చేస్తామన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేటలో మంగళవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి త్వరలో నిర్వహించబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆద్యంతం తన ప్రసంగాన్ని కొనసాగించారు. నగర పంచాయతీతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, వివిధ రూపాల్లో కోట్లాది రూపాయలు మంజూరు చేశామన్నారు. 325 ఇళ్ళు మంజూరు చేశామని, రూ. 20 కోట్లతో తాగు నీటి సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. ఇక్కడ అభివృద్ధి పనులు వేగవంతానికి జెడ్పీ సీఈఓ రాజకుమారిని ప్రత్యేకాధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రసంగించిన మంత్రి ఆద్యంతం సభికులను అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. గ్రామ పంచాయతీతోనే మాకు అభివృద్ధి.. మంత్రి రఘునథరెడ్డి ప్రసంగిస్తుండగా కొంతమంది మహిళలు లేచి జరజాపుపేటను గ్రామ పంచాయతీగా మార్పు చేస్తేనే తమకు అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పేందుకు ప్రయస్తుండగా మంత్రి వారిని వారించి కూర్చోబెట్టారు. ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, జేసీ శ్రీకేశ్ బాలాజీ లఠ్కర్, నోడల్ అధికారి ఉదయ్‌భాస్కర్, కమిషనర్ అచ్చిన్నాయుడు, ఎంపీపీ వనజాక్షి, నేతలు అవనాపు సత్యనారాయణ, నల్లి చంద్రశేఖర్, కింతాడ కళావతి తదితరులు పాల్గొన్నారు. -
649 ఎకరాల భూమి సేకరణ
తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో కాలువల తవ్వకాలకు ఏర్పాట్లు లావేరు: తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో కాలువల తవ్వకాలకు జిల్లాలో ఏడు మండలాల్లో 649 ఎకరాల భూమిని సేకరిస్తున్నామని తోటపల్లి, వంశధార ప్రాజెక్టుల భూసేకరణ విభాగం స్పెషల్ డీప్యూటీ కలెక్టర్ బి.గోవర్థనరావు అన్నారు. గురుగుబిల్లి, లావేరు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. తోటపల్లి ప్రాజెక్టు కాలువల కోసం గురుగుబిల్లి వద్ద సేకరించిన భూములను పరిశీలించారు. అనంతరం లావేరులో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మండలంలో తోటపల్లి కాలువల కోసం సేకరించిన భూముల వివరాలుపై తహసీల్దార్, అధికారులతో చర్చించారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో కాలువల తవ్వకాల కోసం లావేరు, రణస్థలం, జి.సిగడాం, రాజాం, రేగిడి, సంతకవిటి, వంగర మండలాల్లో 649 ఎకరాల భూమిని సేకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 50 ఎకరాలు మినహా మిగతా భూమిని అంతా కాలువల కోసం సేకరించామని చెప్పారు. కాలువల తవ్వకాలకు భూములు ఇవ్వడానికి ఏడు మండలాల్లో రైతులు బాగా సహకరించారన్నారు. భూములు ఇచ్చిన రైతులకు మొదటి విడతగా రూ. 55 కోట్లు నష్టపరిహారం చెల్లించామని పేర్కొన్నారు. మరో రూ. 15 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయనతో పాటు తహసీల్దార్ బందరు వెంకటరావు, ఆమదాలవలస డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ డి.సన్యాసిరావు, లావేరు మండల సర్వేయర్ నాగభూషణరావు తదితరులు ఉన్నారు. -
తోటపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం
వీరఘట్టం: విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి మండలంలో ఉన్న తోటపల్లి రిజర్వాయర్‌కు వరదనీటి ప్రవాహం పెరుగుతోంది. బుధవారం ఉదయం ఇన్‌ఫ్లో 6,600 క్యూసెక్కులుగా ఉంది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి కిందకు 4,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం 102.9 మీటర్లుగా ఉంది. -
తోటపల్లి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం
-
'మార్కెటింగ్ లో చంద్రబాబు దిట్ట'
హైదరాబాద్: తనను తాను మార్కెట్ చేసుకోవడంతో చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. నదుల అనుసంధానం పూర్తైపోయిందని ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. నదుల అనుసంధానం కాదు, టీడీపీ ఆఫీసుకు నిధుల అనుసంధానం జరిగిందని అంబటి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సాగునీటి ప్రాజెక్టులు చిత్తశుద్ధితో పూర్తిచేసిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయడానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టుదలతో కృషి చేశారని చెప్పారు. ఎవరో చేసిన పనిని తాను చేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. పులిచింతల ప్రాజెక్టును కూడా తానే పూర్తి చేశానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరాన్ని పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్టు తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. పంపులు లేకుండానే పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారన్నారు. ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. -
తోటపల్లి నిర్వాసితుల ఆందోళన, అరెస్టు
-
జాతికి అంకితం
-
తోటపల్లి నిర్వాసితుల ఆందోళన, అరెస్టు
పార్వతీపురం: విజయనగరం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడానికి గురువారం సీఎం చంద్రబాబు నాయుడు తోటపల్లి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ నిర్వాసితుల వాణి వినిపించేందుకు సిద్ధమవుతున్న నిర్వాసితుల నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించక ముందే ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడం తగదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందు నిర్వాసితులు సమస్యలన్నిటినీ పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న నిర్వాసిత బాదితుల సంఘం రాష్ర్ట నాయకులు బంటుదాసు, సదానందంలను బుధవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి రానున్న సీఎం సమస్యలపై నిలదీస్తారనే ఉద్దేశ్యంతోనే ఈ అరెస్ట్‌ల ప్రకియ ప్రారంభించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
సాగు నీరు సరే... వీరి కన్నీళ్ల సంగతేంటి ?
విజయనగరం కంటోన్మెంట్: తోటప ల్లి ప్రాజెక్టు కోసం కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాలకు చెందిన 20 గ్రామాల్లోని 528 కు టుంబాల వారు తమ భూములు, ఇళ్లు, ఇతర ఆస్తులు వదులుకున్నా రు. వారంతా ఇప్పుడు తీవ్ర ఇబ్బం దుల్లో జీవనం సాగిస్తున్నారు. వారికి అందజేస్తామన్న ప్యాకేజీలు, ఇళ్ల స్థలాలు, ఇతర సౌకర్యాలు కల్పించే విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. పెద్ద గోతులున్న చోట స్థలాలు కేటాయించడంతో ఏం చేయాలో అర్థంకాక వారు ఆందోళన చెందుతున్నారు. నిర్వాసితుల సమస్యలు చాలా మంది నిర్వాసితులకు ఇంకా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. భూసేకరణ జరగలేదు నిర్వాసితులు కోరిన చోట కాకుండా.... అధికారులు త మకు నచ్చిన చోట స్థలాలు కేటాయించడంతో ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోతుల్లో స్థలాలిచ్చి, వాటిని చదును చేయకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం గోతులు కప్పేందుకే సరిపోతోంది, ఇసుకకూడా లభించకపోవడంతో ఇళ్లులు కట్టుకోలేకపోతున్నారు. జలాశయంలో నీరు నిల్వ ఉంచితే కొమరాడ మండలం గుణానుపురం, జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామాల్లోకి నీరు ప్రవేశిస్తుంది. దీంతో వారు భయాందోళన చెందుతున్నారు. జియ్యమ్మవలస మండలం బాసంగి, గదబవలస గ్రామాల నిర్వాసితులు తమ సమస్యలపై తహశీల్దార్ నుంచి ముఖ్యమంత్రి వరకూ పలు అర్జీలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేసేందుకు వస్తున్నప్పటికీ వారి సమస్యలు తీరడం లేదు. నిమ్మలపాడు, బిత్తరపాడు, భట్ల భద్ర, బాసంగి, గదబవలస తదితర గ్రామాలకు సీమనాయుడు వలసలో స్థలాలు చూపించారు. అయితే బాసంగి, గదబవలస గ్రామాలకు సంబంధించిన వారికి ఇంకా న్యాయం చేయలేదు. బాసంగిలో 384 మందికి ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికీ అమలు కావడం లేదు. ఇందులో 215 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మిగిలిన 169 మందికి ఇవ్వాల్సి ఉంది. తమ పొలాలున్న చోట తమకు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలివ్వాలని వారు కోరుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. టీడీపీ నాయకుల భూములున్నాయని... సీమనాయుడు వలస వద్ద బాసంగి నిర్వాసితులకోసం గెడ అవతల శ్మశాన వాటికను కేటాయించడంతో నిర్వాసితులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుక్రితం గ్రామానికి చెందిన శీర రామచంద్ర అనేవ్యక్తి, మరో వ్యక్తి మృతి చెందగా గెడ్డ ఇవతల చితి పేర్చారు. అయితే గ్రామస్తులు అంగీకరించకపోవడంతో దానిని తొలగించి మరో చోట పోలీసుల సమక్షంలో దహనం చేయించారంటే నిర్వాసితులకు ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. గెడ్డ ఇవతల టీడీపీ నాయకులకు చెందిన భూములుండడం వల్లే అక్కడ శ్మశానానికి స్థలం కేటాయించలేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. గెడ్డ అవతల శ్మశానానికి కేటాయించిన మూడెకరాల స్థలం కూడా పెద్ద గోతులు, గుమ్ములతో నిండి ఉందని వాపోతున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి నిర్వాసితులను జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. సీఎం వస్తున్నారని హడావుడిగా ఎలాగైనా తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించేయాలనే తాపత్రయమే తప్పా... నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఎక్కడా కనిపించడంలేదు. నిర్వాసితులకు ఇచ్చేందుకు వీలుగా సీమనాయుడు వలస, వెంకటరాజ పురం గ్రామాల నుంచి ఎలాంటి నోటీసులు లేకుండా 30 ఎకరాలను సేకరించారు. అలాగే సుంకి, నందివాని వలస గ్రామాలకు తులసిరామునాయుడు వలస వద్ద తీసుకున్న 62 ఎకరాల్లో కొంత చదును చేసి కొంత చదును చేయలేదు. సుంకిలో 324 పట్టాలకు కేవలం 160 పట్టాలిచ్చారు. ఇంకా ఇక్కడ మిగతా వారికి ఇవ్వాల్సి ఉంది. నందివాని వలసకు సంబంధించి 26 ఎకరాలు తీసుకుంటున్నప్పటికీ దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషనే ఇంకా ఇవ్వలేదు. నిర్వాసితుల కోసం భూములిచ్చిన మాకు ఇంకా పరి హారం ఇవ్వలేదని గ్రీవెన్స్‌సెల్‌కు భూముల యజమానులు వచ్చి ఫిర్యాదులు చేస్తునే ఉన్నారు. -
పంతానికి పోయి సమస్య పెంచుకోవద్దు..
జియ్యమ్మవలస: పంతానికి పోయి సమస్యను పెంచుకోవద్దని తోటపల్లి ప్రాజెక్టు బాసంగి నిర్వాసితులకు జిల్లా జాయింట్ కలెక్టర్ బి.రామారావు హితబోధ చేశారు. ఒకే చోట ఉన్న భూమిని తీసుకోవాలని వారికి సూచించారు. విభేదాలతో గ్రామాన్ని విడగొట్టవద్దని చెప్పారు. మండలంలోని చింతలబెలగాం రైతులు, బాసంగి గ్రామానికి చెందిన నిర్వాసితులతో శనివారం ఆయన చర్చలు జరిపారు. శుక్రవారం పోలీసు బందోబస్తుతో వచ్చిన అధికారులు చింతలబెలగాం నిరుపేద రైతులకు చెందిన భూములు తీసుకోవడానికి ప్రయత్నించగా బాధితులు ఒక రోజు వ్యవధి కోరి కలెక్టర్‌కు తమ గోడు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జేసీ బి.రామారావు, ఆర్డీవో ఆర్.గోవిందరావు చింతలబెలగాం, బాసంగి వచ్చి రైతులు, నిర్వాసితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 6 ఎకరాల పొలం వారికి చాలదని, ఆ భూమి తీసుకుంటే తీరని అన్యాయానికి గురవుతామని రైతులు చెప్పారు. బాసంగి గ్రామస్తులకు కూడా రహదారి పక్కనే పొలాలు ఉన్నాయని, వాటిని ఇవ్వకుండా, ఒకే దగ్గర ఉన్న 53 ఎకరాలు చూపించినా వినకుండా తమ పొలాలపైనే దృష్టి పెడుతున్నారని వివరించారు. ఒకే దగ్గర ఉన్న 53 ఎకరాలను తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జేసీ రామారావు మాట్లాడుతూ బాసంగికి చెందిన నడిమింటి రమేష్‌పై మండిపడ్డారు. సమస్యను సృష్టిస్తున్నావంటూ విరుచుకుపడ్డారు. నువ్వు ఉండేది పార్వతీపురంలో కదా.. సమస్య పరిష్కరించాల్సిపోయి సృష్టించడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించారు. రాజీపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అటువంటి వారిపై చర్యలు తీసుకోకుండా తహశీల్దార్ ఏమి చేస్తున్నారని జేసీ ప్రశ్నించారు. వీఆర్వో ఎస్.ఎ.తిరుపతిరావు కూడా సమాచారాన్ని దాచి పెడుతున్నారని తెలిసిందన్నారు. ఇది నిజమని తేలితే వీఆర్వోపై చర్య తీసుకోవాలని తహశీల్దార్‌కు సూచించారు. -
ఏడాదిలోగా తోటపల్లి ప్రాజెక్టు పూర్తి: బాబు
విజయనగరం: ఏడాదిలోగా తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి కాల్వల ద్వారా నీరందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా చంద్రబాబు గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గొర్ల మండలం గుజ్జంగి వలస సభలో చంద్రబాబు మాట్లాడుతూ... మామిడి తోటలు నష్టపోయిన వారికి భూమి ఆధారంగా కాకుండా చెట్లు ప్రాతిపదికన నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే టేకు చెట్లు కోల్పోయిన వారికి అటవీ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో టేకు చెట్లు వేలం ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తామన్నారు. చిన్న టేకు చెట్లు కోల్పోయిన వారికి చెట్టుకు రూ. 500 చొప్పును పరిహారం ఇప్పిస్తామన్నారు. ఈ నెల 30న జిల్లా పరిషత్ కార్యాలయంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అప్పటిలోగా అన్ని సహాయక పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు.