విజయనగరం: ఏడాదిలోగా తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి కాల్వల ద్వారా నీరందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా చంద్రబాబు గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గొర్ల మండలం గుజ్జంగి వలస సభలో చంద్రబాబు మాట్లాడుతూ... మామిడి తోటలు నష్టపోయిన వారికి భూమి ఆధారంగా కాకుండా చెట్లు ప్రాతిపదికన నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అలాగే టేకు చెట్లు కోల్పోయిన వారికి అటవీ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో టేకు చెట్లు వేలం ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తామన్నారు. చిన్న టేకు చెట్లు కోల్పోయిన వారికి చెట్టుకు రూ. 500 చొప్పును పరిహారం ఇప్పిస్తామన్నారు. ఈ నెల 30న జిల్లా పరిషత్ కార్యాలయంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అప్పటిలోగా అన్ని సహాయక పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ను సీఎం చంద్రబాబు ఆదేశించారు.