
అధికారుల తీరుపై చంద్రబాబు ఫైర్
విశాఖపట్నం: హుదూద్ తుపాను సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వ అధికారులు అనుసరిస్తున్న అలసత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విశాఖలో సహాయక చర్యలపై చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ అంతంత మాత్రంగా జరుగుతుందని... పూర్తి స్థాయిలో రేషన్ పంపిణీ జరిగే విధంగా చూడాలని చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.
కూలీలు, వాహనాల కొరత తీవ్రంగా ఉందని... ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీ పూర్తి స్థాయిలో జరగాలంటే మరో 10 రోజులు పడుతుందని బాబుకు ఉన్నతాధికారులు బదులిచ్చారు. దీంతో అసంతృప్తి చెందిన బాబు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.