
తోటపల్లి ప్రాజెక్టును మేమే పూర్తి చేశాం
జరజాపుపేట (నెల్లిమర్ల) : తోటపల్లి ప్రాజెక్టును తామే పూర్తిచేసి, 1.2 లక్షల ఎకరాలకు సాగునీరందించామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. జిల్లాలోని నాలుగు నదులను అనుసంధానం చేస్తామన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేటలో మంగళవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి త్వరలో నిర్వహించబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆద్యంతం తన ప్రసంగాన్ని కొనసాగించారు. నగర పంచాయతీతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, వివిధ రూపాల్లో కోట్లాది రూపాయలు మంజూరు చేశామన్నారు. 325 ఇళ్ళు మంజూరు చేశామని, రూ. 20 కోట్లతో తాగు నీటి సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. ఇక్కడ అభివృద్ధి పనులు వేగవంతానికి జెడ్పీ సీఈఓ రాజకుమారిని ప్రత్యేకాధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రసంగించిన మంత్రి ఆద్యంతం సభికులను అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు.
గ్రామ పంచాయతీతోనే మాకు అభివృద్ధి..
మంత్రి రఘునథరెడ్డి ప్రసంగిస్తుండగా కొంతమంది మహిళలు లేచి జరజాపుపేటను గ్రామ పంచాయతీగా మార్పు చేస్తేనే తమకు అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పేందుకు ప్రయస్తుండగా మంత్రి వారిని వారించి కూర్చోబెట్టారు. ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, జేసీ శ్రీకేశ్ బాలాజీ లఠ్కర్, నోడల్ అధికారి ఉదయ్‌భాస్కర్, కమిషనర్ అచ్చిన్నాయుడు, ఎంపీపీ వనజాక్షి, నేతలు అవనాపు సత్యనారాయణ, నల్లి చంద్రశేఖర్, కింతాడ కళావతి తదితరులు పాల్గొన్నారు.