సాక్షి, పుట్టపర్తి: మాజీ మంత్రి, పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పల్లె రఘునాథరెడ్డి సొంత పార్టీ నేతల చెవిలో పూలు పెట్టాడు. 2019 ఎన్నికల సమయంలో చేబదులుగా సొంత పార్టీ నేతల నుంచి రూ.లక్షల్లో నగదు తీసుకుని వాటిని ఇవ్వకుండా తప్పించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. చేసేది లేక సదరు తెలుగు తమ్ముళ్లు పల్లె రఘునాథరెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగారు.
బాధితుల కథనం మేరకు...
గత ఎన్నికల సమయంలో ఖర్చుల కోసమంటూ పల్లె రఘునాథరెడ్డి టీడీపీలోని బీసీ వర్గానికి చెందిన పీసీ గంగన్న, ఒ.లక్ష్మినారాయణ వద్ద రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని వారం రోజుల్లో తిరిగి చెల్లిస్తానని చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన పల్లె రఘునాథరెడ్డి వారి వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో నెలరోజుల తర్వాత వారే పల్లె రఘునాథరెడ్డి వద్దకు వెళ్లి అడగ్గా.. రూ.25 లక్షల చొప్పున రెండు చెక్కులు రాసి ఇచ్చారు.
అయితే బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా.. రెండు చెక్కులు చెల్లలేదు. తనకిచ్చిన చెక్కుకు సంబంధించి సదరు బ్యాంకు ఖాతాలో నగదు లేదని అధికారులు చెప్పారని పీసీ గంగన్న, ఇచ్చిన చెక్కులో సంతకం మ్యాచ్ కాలేదని బ్యాంకర్లు చెక్కు తిరస్కరించారని లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ తర్వాత వెళ్లి పల్లె రఘునాథరెడ్డిని డబ్బుల విషయమై నిలదీసినట్లు బాధితులు వివరించారు. ‘డబ్బులు కావాలంటే వేచి ఉండాలి. పార్టీ లో కొనసాగాలి. లేదంటే మీ ఇష్టం’ అని పల్లె రఘునాథరెడ్డి సమాధానం ఇచ్చినట్లు బాధితులు వాపోతున్నారు.
తప్పించుకు తిరుగుతున్న ‘పల్లె’
చెక్కులు బౌన్స్ అయ్యాయని భావించిన పీసీ గంగన్న, లక్ష్మినారాయణ లాయర్లను ఆశ్రయించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి నోటీసులు ఇచ్చారు. సరైన చెక్కులు ఇవ్వాలని, లేనిపక్షంలో నగదు రూపేణా బకాయిలు చెల్లించాలని కోరుతూ నోటీసులు పంపించారు. కానీ ఆ నోటీసులను తీసుకోకుండా పల్లె రఘునాథరెడ్డి తప్పించుకు తిరిగారని బాధితులు చెబుతున్నారు. లాయర్లు, పోలీసులను అడ్డు పెట్టుకుని తమ బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీలో బీసీలమైన తమకు అన్యాయం జరిగినా పార్టీ పెద్దలు ఏ ఒక్కరూ నోరుమెదపకపోవడమ దుర్మార్గమంటున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.
నా చెక్కులు మిస్ అయ్యాయి
2019 ఎన్నికల సమయంలో నా చెక్కులు రెండు మిస్ అయ్యాయి. వాటినే పీసీ గంగన్న, లక్ష్మీనారాయణ తీసుకున్నట్లు అనుమానం వచ్చింది. ఆరా తీయగా వారు ఒక్కో చెక్కులో రూ.25 లక్షలు రాసుకుని బ్యాంకుకు వెళ్లి నా డబ్బు కాజేయాలని చూసినట్లు సమాచారం వచ్చింది. అంతేగానీ చెల్లని చెక్కులు నేను ఎవరికీ ఇవ్వలేదు. నేను ఎవరితో అప్పు కూడా చేయలేదు. నాకు ఆ అవసరం కూడా లేదు. అనవసరంగా కేసులకు వెళ్తే భయపడేది లేదు. – పల్లె రఘునాథరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment