వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్న టీడీపీ బీసీ నేతలు
ఇప్పటికే విశ్రాంత డీఎస్పీ వేణుగోపాల్ చేరిక
త్వరలోనే మరి కొందరు బీసీలు టీడీపీకి గుడ్‌బై
పుట్టపర్తి నియోజకవర్గంలో భారీగా పడిపోతున్న టీడీపీ గ్రాఫ్
సాక్షి, పుట్టపర్తి: టీడీపీ అధిష్టానం అవలంబిస్తున్న విధానాలు...స్థానిక నేత పల్లె రఘునాథరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ పార్టీలోని బీసీ వర్గాల నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టికెట్ కేటాయింపు విషయంలో నియోజకవర్గంలోనే ఎక్కువ ఓటు బ్యాంకు కలిగిన తమను కాదని మరోసారి ‘పల్లె’ కుటుంబానికే పట్టం కట్టడాన్ని బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరారు. మరికొందరు అదే బాటలో నడుస్తున్నారు.
‘క్యాష్’ పాలిటిక్స్
పల్లె రఘునాథరెడ్డిపై అసమ్మతి ఎక్కువ కావడంతో అభ్యర్థిని మార్చాలని స్థానిక టీడీపీ నాయకులు అధిష్టానానికి విన్నవించారు. అయితే ‘క్యాష్’ పాలిటిక్స్ అవలంబిస్తున్న టీడీపీ అధిష్టానం వద్ద పల్లె రఘునాథరెడ్డి తనదైన శైలిలో లాబీయింగ్ చేసుకుని కోడలు పల్లె సింధూరాకు టికెట్ ఇప్పించుకున్నారు. ఫలితంగా చంద్రబాబు, నారా లోకేశ్ తీరుపై పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు.
బీసీలకు టీడీపీ అన్యాయం
పుట్టపర్తి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానివే అత్యధిక ఓట్లు ఉన్నాయి. అందులో చాలామంది నాటి నుంచి టీడీపీ వెంట నడుస్తున్నారు. అయితే రాజకీయంగా ఎదగనీయకుండా.. పల్లె రఘునాథరెడ్డి అణగదొక్కారు. అయినప్పటికీ అదే పార్టీలో కొనసాగిన బీసీ నేతలు ఈ సారి పుట్టపర్తి టికెట్ బీసీలకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు. దీంతో చంద్రబాబు కూడా తొలుత ఓకే అన్నారు. ఆ తర్వాత పల్లెకే పట్టం కడుతూ ఆయన కోడలికి టికెట్ కేటాయించారు. దీన్ని బీసీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అడ్డం తిరిగితే బెదిరింపులు
పల్లె రఘునాథరెడ్డి తీరు బాగోలేదని.. ఆయనకు టికెట్ ఇస్తే పని చేసేది లేదని అధిష్టానం వద్ద తమ అసమ్మతి తెలిపిన వడ్డెర్లపై దాడి జరిగింది. పల్లె రఘునాథరెడ్డి తన అనుచరుల ద్వారా తమపై దాడి చేయించారని వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పల్లపు జయచంద్రమోహన్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై చంద్రబాబు వద్ద పంచాయితీ జరిగినట్లు సమాచారం.
జగన్ న్యాయం చేస్తారని నమ్మి...
వైఎస్సార్ సీపీలో బీసీ నాయకులకు పెద్దపీట వేస్తున్నారు. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ టికెట్ల వరకూ బీసీలకు జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నామినేటెడ్ పోస్టులనూ ఎక్కువగా బీసీలకే కట్టబెట్టారు. ఈక్రమంలోనే టీడీపీలోని బీసీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. పుట్టపర్తి టికెట్ ఆశించి భంగపడ్డ రిటైర్డ్ డీఎస్పీ వేణుగోపాల్, తిరుపతేంద్ర ఇప్పటికే వైఎస్సార్‌సీపీలో చేరారు. త్వరలోనే మరికొందరు టీడీపీ సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వారు కూడా ఏ క్షణంలోనైనా కండువా మార్చడం ఖాయమని అనుచరులు చెబుతున్నారు.
కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ హవా
పుట్టపర్తి నియోజకవర్గంలో ఐదేళ్లుగా ‘ఫ్యాన్’ ప్రభంజనం సృష్టిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి జయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 15 చోట్ల వైఎస్సార్ సీపీ జెండా ఎగిరింది. ఆరు మండలాల జెడ్పీటీసీ స్థానాలతో పాటు అన్ని మండల ఎంపీపీ పదవులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంక్షేమ లబ్ధితో జనమంతా జగన్‌కు మద్దతు పలుకుతుండగా... వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment