
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
పెనుకొండ: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖామాత్యులు సవిత పేర్కొన్నారు. స్థానిక వివేకానంద జూనియర్ కళాశాలలో గురువారం మహిళలకు ఉచిత కుట్టు శిక్షణను మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. మహిళల స్వయం ఉపాధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా కుట్టు శిక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 నెలల పాటు శిక్షణ ఉంటుందని, 75 శాతం హాజరు కలిగిన వారికి శిక్షణ చివరి రోజున కుట్టు మిషన్‌తో పాటు ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
● ఉత్సాహంగా ఉరకలెత్తిన దున్నలు
కణేకల్లు: స్థానిక చిక్కణ్ణేశ్వరస్వామి ఉత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన దున్నపోతుల రాతిదూలం పోటీలు ఆసక్తిగా సాగాయి. స్థానిక జెడ్పీఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదిగా పోటీలు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో రాతి దూలాన్ని లాగుతూ దున్నపోతులు ఉరకలేయడాన్ని చూసి ప్రజలు కేకలు, ఈలలతో హోరెత్తించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోటీలు సాయంత్రం 4 గంటలకు ముగిసాయి. రైతు కె.ముజ్జుకు చెందిన దున్నపోతులు 15 నిమిషాల వ్యవధిలో 2,608.10 అడుగుల మేర దూరాన్ని రాతిదూలాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. మరో రైతు తిప్పేష్‌కు చెందిన దున్నపోతులు ద్వితీయ స్థానంలో, రైతు జి.రిజ్వంత్‌కు చెందిన దున్నపోతులు మూడో స్థానంలో నిలిచాయి. విజేత దున్నల యజమానులను అభినందిస్తూ సర్పంచ్ దంపతులు నిర్మల, డాక్టర్ సోమన్నతో నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో కణేకల్లు మేజర్ పంచాయతీ ఈఓ ప్రసాద్, కణేకల్లు చెరువు సంఘం అధ్యక్షుడు బీటీ రమేష్, స్థానికులు లాలెప్ప, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయులపై విచారణ
కదిరి అర్బన్: పదో తరగతి ఇన్విజిలేషన్ విధుల్లో అలసత్వం వహించడంతో సస్పెండ్ అయిన కదిరి మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై విచారణ జరిగింది. పెనుకొండ డిప్యూటీ డీఈఓ పద్మప్రియ గురువారం స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో విచారణ నిర్వహించారు. నడింపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రుద్రంరెడ్డి, సైదాపురం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కిష్టప్ప సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. వారిద్దరి నుంచి రాతపూర్వకంగా సంజాయిషీ తీసుకున్నారు. నివేదికను డీఈఓకు పంపనున్నట్లు తెలిపారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి