
ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్‌లో ఇద్దరికి చోటు
అనంతపురం అర్బన్: అఖిల భాతర కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. తమిళనాడులోని నాగపట్నంలో మూడు రోజులుగా ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. చివరి రోజు గురువారం కౌన్సిల్ జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో సభ్యులుగా రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు అన్నగిరి కాటమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జునకు చోటు దక్కింది.
యువకుడి ఆత్మహత్య
రొద్దం: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం ఆర్.కొట్టాల గ్రామానికి చెందిన కాకర్ల వరలక్ష్మి, బుగ్గ రంగయ్య దంపతుల కుమారుడు రవితేజ (35) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా నయం కాలేదు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున నొప్పి తీవ్రత తాళతేక ఓ పొలం వద్ద విషపు గుళికలు మింగాడు. కాసేపటి తర్వాత బంధువులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు గాలింపు చేపట్టి పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న రవితేజను గుర్తించి, వెంటనే తుమకూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
‘హంద్రీ–నీవా’కు శాశ్వతంగా సమాధి కడతారా?
● జలసాధన సమితి సభ్యుల ధ్వజం
● కాలువ వెడల్పుపై ఎమ్మెల్యేలు మాట్లాడాలి
హిందూపురం: రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్ట్‌లకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం.. రాయలసీమకు జీవనాడిగా ఉన్న హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌కు శాశ్వత సమాధి కట్టేందుకు సిద్ధమైందని జలసాధన సమితి సభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు జలసాధన సమితి సభ్యులు చైతన్య గంగిరెడ్డి, శ్రీనివాసులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 38వేల క్యూసెక్కులకు పెంచడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం పూనుకుందన్నారు. అలాగే 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే గాలేరు–నగరి ప్రాజెక్టు కాలువ సామర్థ్యం 30 వేల క్యూసెక్కులతో కాలువ నిర్మాణం చేస్తున్నారన్నారు. అయితే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే హంద్రీ–నీవా ప్రాజెక్టు కాలువ సామర్థ్యం కేవలం 3,850 క్యూసెక్కులకు పరిమితం చేస్తూ, భవిష్యత్తులో కాలువను వెడల్పు చేసేందుకు లేకుండా లైనింగ్ పనులు చేపట్టి రాయలసీమ ఆశయాలకు శాశ్వతంగా గండి కొట్టేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. ఈ అన్యాయంపై జిల్లా ఎమ్మెల్యేలు నోరు విప్పకపోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ముందు చూపుతో ఎమ్మెల్యేలు ఆలోచించి అప్రతిష్ట పాలుకాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లి హంద్రీ–నీవా ప్రయోజకాలను కాపాడాలని హితవు పలికారు.
చేనేత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: స్థానిక రాజేంద్రనగర్‌లో నివాసముంటున్న చేనేత కార్మికుడు బాలకృష్ణ (42) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాజేంద్రకుమార్‌కు భార్య ప్రమీల, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మగ్గం పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు.

ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్‌లో ఇద్దరికి చోటు

ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్‌లో ఇద్దరికి చోటు